
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న డీసీపీ క్రైమ్స్ బి.రాజకుమారి
విజయవాడ : వేర్వేరు కేసులో ఐదుగురు పాత నేరస్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి లక్షలాది రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను స్వాధీనం చేస్తున్నారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను బందర్ రోడ్డులోని కంట్రోల్ కమాండ్ సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డీసీపీ రాజకుమారి వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. సీసీఎస్ పోలీసులకు అందిన సమాచారం మేరకు బీసెంట్ రోడ్డు పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో పలు దొంగతనం కేసుల్లో పాత నేరస్తులైన ఇద్దరు నిందితులు రద్దీ ప్రదేశాలను లక్ష్యంగా ఎంచుకుని పక్కనే ఉన్న వ్యక్తులు ఏమరుపాటులో ఉండగా బ్యాగులు కత్తిరించటం, పర్సులు అపహరించటం చేస్తుంటారు. వీరు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన దేవర శాంతకుమారి, దేవర సువార్త పాత నేరస్తులుగా గుర్తించారు. వీరి నుంచి 19 కేసులకు సంబంధించి రూ.7 లక్షల విలువగల బంగారు ఆభరణలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6, టూ టౌన్ ఏరియాలో 1, గవర్నర్‌పేటలో 1, సత్యనారాయణపురం ఏరియాలో 4, కృష్ణలంక పరిధిలో 4, నున్న పోలీస్ స్టేషన్ ఏరియాలో 1, పటమట ఏరియాలో 1, ఉయ్యూరులో 1.. మొత్తం 19 నేరాలకు పాల్పడినట్లు డీసీపీ వివరించారు. పైకేసుల్లో నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.
ఇంటి దొంగతనాలకుపాల్పడిన ఇద్దరు అరెస్టు..
కాగా, వేర్వేరు కేసుల్లో ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన కేసుల్లో ఇద్దరు నిందితులను సీసీఎస్ సిబ్బంది అరెస్టు చేశారని ఆమె చెప్పారు. సోమవారం మాచవరం, గవర్నర్‌పేట ఏరియాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు చెప్పారు. విజయవాడ గిరిపురానికి చెందిన సత్తా సుధాకర్, తోట శివనాగరాజులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రెండు కేసులకు సంబంధించి రూ.3.24 లక్షలు విలువగల 122 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీలు మక్చుల్, వర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరో పాత నేరస్తురాలి అరెస్టు..
ఇదిలా ఉండగా నగరంలోని పలు ప్రాంతాల్లో బస్సులు, ఆటోల్లో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తోటి ప్రయాణీకుల బ్యాగులు కోసి బంగారు ఆభరణలు అపహరించిన ఓ మహిళా పాత నేరస్తురాలిని సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి ఏడు కేసుల్లో రూ.6 లక్షల విలువ చేసే 164 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీదు మండలం శివాపురం గ్రామానికి చెందిన ద్వారకాచర్ల గిరిజాకుమారి అనే పాత నేరస్తురాలు నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా సీసీఎస్ పోలీసులు పట్టుకుని విచారించారు. ఆమె నగరంలోని వన్ టౌన్, గవర్నర్‌పేట, కృష్ణలంక ఏరియాల్లో 7 దొంగతనాలకు పాల్పడింది. ఈ కేసుల్లో రూ.6 లక్షల విలువ గల బంగారు ఆభరణలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment