రక్తపు మడుగులో ఉన్న పద్మావతి మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు(ఫైల్)
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో భవానీపురం పోలీసుస్టేషన్ పరిధిలో హత్యకు గురైన యేదుపాటి పద్మావతి హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. గత నెల 31వ తేదీన పట్టపగలే ఆమెను హత్య చేసి నగలు దొంగతనం చేయడాన్ని సవాలుగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ నాలుగు పోలీసు ప్రత్యేక బృందాలను దర్యాప్తుకు ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణా ల్లో జల్లెడ పట్టి చివరకు హంతకుడి ఆచూకీ కనుగొన్నట్లు సమాచారం.
పక్కా ప్రొఫెషనల్..
హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు లభించకుండా కారం చల్లడం.. చేతి వేలిముద్రలు కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి గమనించిన ఇది పక్కా ప్రొఫెషనల్ పనిగా భావించి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు సాగించారు. దొంగతనానికి వచ్చిన ఆగంతకుడు క్షణాల వ్యవధిలో పని ముగించుకొని వెళ్లడానికి వచ్చాడని తెలుస్తోంది. అందువల్లే ఆమె మెడలో ఉన్న గొలుసు, నల్లపూసల దండ, చేతికి ఉన్న నాలుగు గాజులను మాత్రమే తీసుకెళ్లడం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
పెనుగులాటతో హత్య..
పక్కాగా రెక్కీ చేసికుని దొంగతనానికి వచ్చిన ఆగంతకుడికి.. మృతురాలు పద్మావతికి మధ్య తీవ్ర పెనుగులాట జరిగినట్లు ఆధారాలు చెబుతున్నాయి. జనవరి 31వ తేదీన చివరగా మృతురాలు, ఆమె భర్త వెంకటేశ్వర్లు స్థానికంగా ఉన్న అమ్మపాద అపార్ట్‌మెంట్ జరిగిన ఫంక్షన్‌కు హాజరై ఇంటికొచ్చారు. ఆ తర్వాత ఆమె భర్త పనిపై బయటకు వెళ్లిపోయారు. ఈ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగను చూసిన పద్మావతి తీవ్రంగా ప్రతిఘటించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. చివరకు ఆమె అరుపులతో చుట్టుపక్కల వారు వస్తే తన పనైపోతుందనే కారణంతోనే దొంగ పద్మావతిని హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు వినియోగించిన ఆయుధం కూడా అతనిదేనని పోలీసు లు అంచనాకు వచ్చినట్లు సమాచారం.
పక్క జిల్లాలకు పరారీ..
సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర సాంకేతిక అంశాల ఆధారంగా పోలీసులు నిందితుడి ఆచూకీని కనుగొన్నట్లు సమాచారం. అతనిది విజయవాడేననీ.. హత్య చేసి నగలు దోచుకున్న వెంటనే నగరాన్ని వీడి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతాల్లోనూ తలదాచుకున్నట్లు సమాచారం. ఆ తరువాత ఏలూరు తదితర ప్రాంతాల్లోనూ తిరిగినట్లు పోలీసులు గుర్తించారు.సాంకేతిక అంశాల ఆధారంగా చివరకు నిందితుడిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment