వడ్డీ వ్యాపారిపై ఏఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న తాహెరున్నీసా
కృష్ణాజిల్లా, కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : మచిలీపట్నంలో కాల్‌మనీ వ్యవహారం మరో మారు తెరపైకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో అప్పు చేసిన ఓ మహిళ నుంచి వ్యాపారి అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేయటమే కాకుండా ఆలస్యం అయితే తన కోరిక తీర్చమంటూ వేధింపులకు గురి చేశాడు. లేనిపక్షంలో వ్యభిచారం చేసైనా తన అప్పు తీర్చమంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో దిక్కుతోచని బాధితురాలు వడ్డీ వ్యాపారి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి వడ్డీ వ్యాపారిని అదుపులోకి తీసుకుని శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించాలని ఏఎస్పీ సోమంచి సాయికృష్ణ డీఎస్పీ మహబూబ్‌బాషాకు సూచించారు.
ఏం జరిగిందంటే..
బాధితురాలి కథనం ప్రకారం మచిలీపట్నం మాచవరానికి చెందిన తాహెరున్నీసా, కరీముల్లా భార్యాభర్తలు. వీరికి ఒక పాప ఉంది. కరీముల్లా 2013లో పనుల నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. ఒంటరిగా ఉంటున్న తాహెరున్నీసా ఏదో ఒక వ్యాపారం చేయాలన్న ఆలోచన తట్టటంతో ఫ్యాన్సీ షాపు పెట్టేందుకు నిర్ణయించుకుంది, తన వదిన ఉన్నీసా ద్వారా పట్టాభిపురానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద 2014లో రెండు దఫాలుగా రూ.1,30,000లను అప్పుగా తీసుకుంది. నూటికి రూ.7 ల చొప్పున వడ్డీ చెల్లిస్తూ వచ్చింది. వ్యాపారం నష్టపోవటంతో అప్పు తీర్చటం కష్టంగా మారింది. దీంతో తాహెరున్సీసా వదిన అప్పు నిమిత్తం ఆమె నుంచి ఆరు ఖాళీ చెక్కులతో పాటు ప్రామిసరీ నోటులు తీసుకుంది. ఇదిలా ఉండగా వడ్డీ వ్యాపారి ఒత్తిళ్ళు తట్టుకోలేని తాహెరున్నీసా అతని అప్పు తీర్చేందుకు నిర్ణయించుకుంది. అందుకోసం ఇంగ్లిష్‌పాలెంలోని తన ఆడ పడుచు కరీమున్నీసా, ఆమె భర్త షంషుద్దీన్‌ల ద్వారా చిలకలపూడికి చెందిన నూకల రామ్‌కుమార్ అనే వడ్డీ వ్యాపారి వద్ద 2015లో నూటికి రూ.10 వడ్డీ చొప్పున రూ.95,000 ను అప్పుగా తీసుకుంది.
మహిళకు రామ్‌కుమార్ వేధింపులు..
వడ్డీ వ్యాపారి నూకల రామ్‌కుమార్ వద్ద అప్పు తీసుకున్న తాహెరున్నీసా 2015 నవంబరు నుంచి దాదాపు 30 నెలల పాటు ప్రతి నెలా రూ.9,500 చొప్పున వడ్డీ కట్టుకుంటూ వచ్చింది. అయితే రెండు మూడు నెలలుగా వడ్డీ కట్టటం భారం కావటంతో తాహెరున్నీసా ప్రతి నెలా గడువు ప్రకారం వడ్డీ చెల్లించటం లేదు, దీంతో తాహెరున్నీసాను రామ్‌కుమార్ వేధింపులకు గురి చేయటం మొదలుపెట్టాడు. వడ్డీ కట్టటం కష్టమైతే తన కోర్కె తీర్చాలంటూ వేధించటం ప్రారంభించాడు. అలా కాని పక్షంలో వ్యభిచారం చేసైనా తన అప్పు తీర్చాలంటూ బెదిరిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం రామ్‌కుమార్ భార్య మరో యువకుడు కలిసి తాహెరున్నీసాను బెదిరించటంతో పాటు రామ్‌కుమార్‌తో ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడించారు.
రక్షణ కల్పించకుంటే ఆత్మహత్యే శరణ్యం..
రామ్‌కుమార్ వేధింపులతో హడలెత్తిపోయిన తాహెరున్నీసా బుధవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పోలీసు కార్యాలయానికి వెళ్ళింది. ఎస్పీ అందుబాటులో లేకపోవటంతో అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణను కలిసి తన ఆవేదనను వెల్లిబుచ్చుకుంది. అతని వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. రక్షణ కల్పించని పక్షంలో తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ కన్నీటి పర్యంతమైంది. అలాగే తన బంధువుల వేధింపుల నుంచి తప్పించాలంటూ కోరింది. దీంతో ఏఎస్పీ బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment