జరిగిన మోసాన్ని వివరిస్తున్న బాధితులు గీతామహాలక్ష్మీ, రమేష్‌బాబు దంపతులు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): టెక్నాలజీతోపాటు మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలకు మించిన మోసాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుండటంతో సామాన్య ప్రజలతో పాటు పోలీసులు కూడా నివ్వెర పోతున్నారు.
సింగ్‌నగర్ నందమూరినగర్ ప్రాంతంలో గంజాం గీతా మహాలక్ష్మీ, రాధాకృష్ణ రమేష్‌బాబులు నివాసం ఉంటున్నారు. ఇరిగేషన్ శాఖలో పనిచేసిన రమేష్‌బాబు కొన్నేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. వారికి తెలిసిన హైదరాబాద్ ప్రాంతానికి చెందిన తాడిశెట్టి ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి వ్యాపారం నిమిత్తం రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొంతకాలం తరువాత వడ్డీ కట్టకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. మే నెలలో తమ పిల్లల ఉన్నత చదువులకు డబ్బులు అవసరమని, మీకు ఇచ్చిన రూ.20 లక్షలు ఇవ్వమని కోరారు. దీనికి ప్రవీణ్‌కుమార్ నా దగ్గర మొత్తం ఇప్పుడు లేవని, ప్రస్తుతానికి రూ.10 లక్షలు చెక్ రాసి ఇస్తానని, దాన్ని ఆగస్టులో బ్యాంకులో వేసుకోవచ్చని చెప్పి వారి కళ్లముందే సంతకాలు పెట్టి ఇచ్చాడు. అతను అంతలా నమ్మకంగా చెప్పడంతో బాధితులు కూడా ఇంకా మూడు నెలలే కదా ఆ తరువాత చెక్ వేద్దామని ఇంటికి తిరిగి వచ్చారు.
అయితే ఆగస్టు 4న చెక్‌ను బ్యాంకులో వేయగా దానిపై సంతకం లేదని చెక్ రిటర్న్ వచ్చింది. సంతకం లేకపోవడం ఏమిటని చెక్‌ను పరిశీలించి చూడగా దానిపై ప్రవీణ్‌కుమార్ పెట్టిన సంతకం మాయమైంది. బాధితులు విషయాన్ని ప్రవీణ్‌కుమార్‌కు చెప్పగా నేను కావాలనే మాయమయ్యే పెన్నుతో సంతకం చేసి ఇచ్చానని, డబ్బులు కావాలంటే ఇంకొంతకాలం వేచిచూడాలని సమాధానం చెప్పాడు. దీంతో తాము మోసపోయామని గమనించిన బాధితులు జరిగిన మోసాన్ని వివరిస్తూ సింగ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment