దొంగలు దొరికారు | Police Arrested Gold Thieves In Vijayawada | Sakshi
Sakshi News home page

దొంగలు దొరికారు

Published Wed, Sep 4 2019 11:15 AM | Last Updated on Wed, Sep 4 2019 11:16 AM

Police Arrested Gold Thieves In Vijayawada - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్‌ ఇన్‌చార్జి డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌

సాక్షి, విజయవాడ, గుంటూరు : నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా చూపించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను బందరు సీసీఎస్‌  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు కొద్దిపాటి నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సీసీఎస్‌ బందరు ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ఎస్‌కే అబ్దుల్‌ అజీజ్‌ విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన డేరంగుల రాజేష్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. వ్యసనాలకు బానిసైన రాజేష్‌ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచన చేశాడు. భార్య లక్ష్మితో పాటు బంధువులైన మల్లెల సురేష్, తురక సురేష్, తురకా మమత, బత్తుల రేణు, తమ్మిశెట్టి బాలవీరాస్వామిలకు ఈజీ మనీ ఆశ చూపించి అతనితో కలుపుకున్నాడు. నేరాలు చేసేందుకు చేయి కలిపిన బంధువులతో కలిసి జనాన్ని మోసగించడం ప్రారంభించాడు.

నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా చిత్రీకరించి అమాయకులను అడ్డంగా దోచేయడం ప్రారంబించాడు. అలా జూన్‌ మాసంలో పెడన మండలం సింగరాయపాలెంలో బం«ధువులతో కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందరూ కూలి పనులు చేసుకుంటున్నట్లు గ్రామస్తులను నమ్మించారు. జూన్‌ 21న సింగరాయపాలెంకు చెందిన దుర్గాభవానీ అనే మహిళను కలిసి తనకు బంగారం బిస్కెట్‌ దొరికిందని నమ్మించాడు. అది అమ్మడం తనకు కష్టమని చెప్పి అతి తక్కువ ధరకు దొరికిన బిస్కెట్‌ అమ్మేస్తానంటూ అమాయకంగా నటించాడు. రాజేష్‌ మాటలు నమ్మిన దుర్గాభవానీ తన ఒంటిపై ఉన్న బంగారు నానుతాడు, చెవిదిద్దులతో పాటు రూ. 20వేల నగదును అప్పజెప్పి బిస్కెట్‌ను తీసుకుంది. అనుకున్న విధంగా పని ముగియడంతో రాజేష్, అతని బంధువులు ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. అసలు విషయం తెలుసుకున్న దుర్గాభవానీ జరిగిన ఘటనపై పెడన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా రాజేష్, అతని బంధువులు చిలకలపూడి రైల్వేస్టేషన్‌లో అదే తరహాలో ప్రయాణికులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా అందిన సమాచారం మేరకు సీసీఎస్‌ పోలీసులు దాడిచేశారు. నిందితుడు రాజేష్‌తో పాటు మరి కొందరిని అరెస్టు చేశారు. వీరిని విచారణ చేసి 24 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు. ఈ కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. ఈ ముఠాను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన సీసీఎస్‌ సీఐ సుబ్బారావు, ఎస్సైలు హబీబ్‌బాషా, వెంకటేశ్వరరావులను అబ్దుల్‌ అజీజ్‌ అభినందించారు.  విలేకరుల సమావేశంలో సీసీఎస్‌ ఎస్‌ఐ హనుమంతరావు, పెడన ఎస్‌ఐ మురళి, జి. సత్యనారాయణ, సీసీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement