విజయవాడ ,నూజివీడు : ట్రిపుల్ ఐటీకి వచ్చేందుకు బయలుదేరి నూజివీడు వరకు వచ్చి, కట్టుకథ అల్లి ఆ తర్వాత ప్రియుడితో కలిసి చెన్నై వరకు ఓ విద్యార్థిని వెళ్లిన ఘటన ట్రిపుల్ ఐటీలో సంచలనం కలిగించింది. తెలిసిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని (17) జూలై 29న ఇంటి నుంచి సోదరుడితో కలిసి నూజివీడుకు సాయంత్రం 4 గంటలకు వచ్చింది. నూజివీడు బస్టాండులో దిగాక సోదరుడిని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పింది. ఆ తర్వాత నాన్‌స్టాప్ బస్సులో విజయవాడకు చేరుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడి నుంచి ప్రియుడితో కలిసి చెన్నై వరకు వెళ్లి అక్కడ రైల్వే పోలీసులకు చిక్కింది.
దీంతో తమ బాబాయి ఇక్కడ ఉన్నాడంటూ చెప్పడంతో ఆయనకు అప్పగించారు. అయితే ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత విచారిస్తే తాను ఆటోలో ఎక్కానని, పక్కన కూర్చున్న వ్యక్తి ఏదో గుచ్చినట్లుగా ఉందని, అనంతరం ఏం జరిగిందో తెలియదని, తెలివి వచ్చేసరికి చూస్తే చెన్నై స్టేషన్‌లో ఉన్నానంటూ నమ్మశక్యం కాని కథను వినిపిస్తోంది. సోదరుడు నూజివీడు బస్టాండు వరకు రాగా, అక్కడి నుంచి ఎందుకు వెనక్కు వెళ్లిపొమ్మందో అడిగితే సమాధానం లేదు. నూజివీడు నుంచి చెన్నై వరకు బాలిక నిద్రమత్తులోనే ఉంటే రైల్వే స్టేషన్లోకి ఆగంతకులు ఎలా తీసుకెళ్లారు..
నిజంగా ఎవరైనా మత్తు ఇచ్చినా నూజివీడు చుట్టుపక్కల అన్ని తోటలు, అటవీ ప్రాంతం కాబట్టి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతారే గాని చెన్నై వరకు ఎందుకు తీసుకెళ్తారనే విషయం అంతుబట్టడం లేదు. అక్కడ వరకు వెళ్తే తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరు, వారు ఏమయ్యారు అనేది ప్రశ్నార్ధకం. బస్టాండు వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే కట్టు కథ అవునా, కాదా అనే విషయం వెలుగు చూస్తుంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ అధికారులు బాలికను కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి రమ్మని మంగళవారం పంపించి వేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment