చెవులు చిల్లులు పడేలా బైక్‌ రైడ్‌లు.. | Bike Rides On Vijayawada Roads | Sakshi
Sakshi News home page

రయ్‌.. రయ్‌ !

Published Mon, Aug 27 2018 12:44 PM | Last Updated on Mon, Aug 27 2018 12:44 PM

Bike Rides On Vijayawada Roads - Sakshi

విజయవాడలో రాత్రివేళ బైక్‌ పైæవిన్యాసాలు చేస్తున్న యువకులు

బెజవాడలో బైకర్లు బీభత్సం సృష్టిస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా రయ్‌..రయ్‌ మంటూ చెవులు చిల్లులు పడేలా బైకులపై దూసుకెళ్తూ ప్రజలను హడలెత్తిస్తున్నారు. సైలెన్సర్లు తొలగించి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ.. పొగలు విరజిమ్ముతూ నగర రహదారులపై నానా యాగీ చేస్తున్నారు. ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తున్న కొందరు యువకులు కనీస నిబంధనలు పాటించకుండా నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిజేస్తున్నారు. మిన్ను విరిగి మీద పడేలా శబ్దం చేస్తూ ధ్వని కాలుష్యానికి కారకులవుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తమకేమీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రమాదకరస్థాయిలో బైక్‌ రేస్‌లు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

సాక్షి, అమరావతిబ్యూరో : చెవిలో కర్ణభేరి సైతం పగిలిపోయేంతలా శబ్దాలు చేస్తూ జనం బెంబేలెత్తేలా మోటర్‌ సైకిళ్లపై కుర్రాళ్లు వాయువేగంతో దూసుకుపోతున్నారు. సంపన్న వర్గాలకు చెందిన కొందరు యువకులు రూ.లక్షలు వెచ్చించి అత్యాధునిక బైక్‌లు కొనుగోలు చేస్తున్నారు. 550 సీసీ సామర్థ్యం ఉన్న వాహనాలు నడుపుతూ నగరంలో హల్‌చల్‌ చేస్తున్నారు. నగరంలో ద్విచక్రవాహనాలు  5,05,424 ఉంటే.. వాటిలో 150 సీసీ కంటే  ఎక్కువ సామర్థ్యం కలిగినవి సగానికి పైగా ఉన్నాయని సమాచారం. బెంజ్‌సర్కిల్, బీఆర్‌టీఎస్‌ రోడ్డు, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు, రాఘవయ్యపార్కు, పంటకాలువ రహదారి ప్రాంతాల్లో అధిక శబ్దం చేసుకుంటూ ప్రయాణిస్తున్నారని ట్రాఫిక్‌ పోలీసులే చెబుతున్నారు. చాలా చోట్ల ఫంక్షన్‌హాళ్ల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ సమస్యపై స్థానికులు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు తీసుకుంటున్న చర్యలు లేవనే విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా బందరు, ఏలూరు, 65 జాతీయ రహదారులపై ఉదయం, రాత్రి వేళల్లో బైక్‌రేస్‌లు నిర్వహిస్తూ యువకులు రెచ్చిపోతున్నారు.

సైలెన్సర్లు మార్చేసి..
చాలామంది యువత తమ వాహనాలకు సైలెన్సర్లను మార్చేందుకు ఇష్టపడుతున్నారు. ద్విచక్రవాహనదారులు, కార్లు ఇతర వాహనదారులు కంపెనీతో వచ్చే సైలెన్సర్లను తొలగించి ప్రత్యేకంగా రూపొందించిన వాటిని అమర్చి ధ్వని కాలుష్యానికి పాల్పడుతున్నారు. నగరంలో ఇలాంటి వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నా ట్రాఫిక్‌ పోలీసులు వాటిని గుర్తించి పట్టుకొనే ప్రయత్నం చేయడం లేదు. ఒకవేళ ఏ పోలీసైనా అలాంటి వాహనదారులను నిలిపే ప్రయత్నం చేసినా.. వారు తేలిగ్గా తప్పించుకుంటున్నారు. వాస్తవానికి చట్టప్రకారం వారికి శిక్షపడేలా చేయాలన్నా.. శబ్ద కాలుష్యానికి పాల్పడే తీరును సాంకేతికంగా చూపాల్సి ఉంటుంది. ఆ సాంకేతిక పరికరాలు మన వద్ద లేకపోవడంతో పోలీసులకు ఇబ్బందిగా మారింది. అందుకే నిర్లక్ష్య డ్రైవింగ్‌ అంటూ కేసులు పెడుతున్నారు.

మోత మోగించినా...
కేవలం వాహనాలే కాకుండా సౌండ్‌ బాక్సులు పెట్టి పెద్దపెద్ద శబ్దాలు చేసే వాటిపైనా పోలీసులు దృష్టి సారించడం లేదు. ప్రస్తుతానికి వివిధ పండగ కార్యక్రమాల సమయంలో, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల విషయంలో ఉపయోగించే డీజేలపై మాత్రమే పోలీసులు షరతులు పెట్టి అనుమతులిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం.. వాణిజ్య సముదాయ ప్రాంతంలో 65 డెసిబుల్స్‌ కంటే ఎక్కువగా ధ్వని ఉండకూడదు. నివాస ప్రాంతాల్లో, ధ్వని రహిత ప్రాంతాల్లో 50 డెసిబుల్స్‌కు మించకుండా ఉండాలి. చెవులకు చిల్లులు పడేలా శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై చర్యలు  విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో దాదాపు లేవనే చెప్పొచ్చు.  

శబ్ద  కాలుష్య యంత్రాలేవి?
నగరంలో శబ్దరహిత ప్రాంతాలుగా ఇప్పటికే ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఉన్నతస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో శబ్ద కాలుష్య నమోదు యంత్రాలను ఏర్పాటుచేయాల్సి ఉంది. అలాంటి యంత్రాలు లేని కారణంగా ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులను పట్టుకున్నా కేసులు నమోదు చేయలేని పరిస్థితి ఉంది. పెద్దగా హారన్లు మోగించేవారిని గుర్తించి మోటారు వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశమున్నా ట్రాఫిక్‌ పోలీసులు ఆ దిశగా దృష్టి సారించకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement