అమెరికా ఆటల పోటీలో... మన మహిళా పోలీస్‌ | Vesupogu Shyamala Exclusive Interview: 2024 Pan American Masters Games | Sakshi
Sakshi News home page

అమెరికా ఆటల పోటీలో... మన మహిళా పోలీస్‌

Published Wed, Jul 3 2024 12:17 AM | Last Updated on Wed, Jul 3 2024 10:20 AM

Vesupogu Shyamala Exclusive Interview: 2024 Pan American Masters Games

వేసపోగు శ్యామల... హైదరాబాద్, సైఫాబాద్‌ ట్రాఫిక్‌ ఏ.ఎస్‌.ఐ. ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న ‘2024 పాన్‌ అమెరికన్‌ మాస్టర్స్‌ గేమ్స్‌’కి ఆహ్వానం అందుకున్నారామె. ఈ నెల 12 నుంచి 21 వరకు యూఎస్‌ఏలోని ఓహియో రాష్ట్రం, క్లీవ్‌ల్యాండ్‌లో జరగనున్న పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్‌ త్రోలలో పాల్గొంటున్న సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి నేటి వరకు తన ప్రస్థానాన్ని ‘సాక్షి’ ఫ్యామిలీతో పంచుకున్నారు.

‘‘నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్, కర్నూలు పట్టణంలోని సిమెంట్‌నగర్‌లో. నాన్న మిలటరీ ఆఫీసర్‌ అమ్మ స్టాఫ్‌నర్స్‌. ఏడుగురు అక్కలు, ఇద్దరు అన్నల గారాల చెల్లిని నేను. మా పేరెంట్స్‌ మమ్మల్నందరినీ బాగా చదివించారు. నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక అన్న మిలటరీలో ఉన్నారు. ఒక అక్క, నేను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చాం. నా ఫస్ట్‌ పోస్టింగ్‌ హైదరాబాద్‌ నగరంలోని గోపాల్‌పురం. విద్యార్థి దశ నుంచి మంచి క్రీడాకారిణిని. డిస్ట్రిక్ట్‌ లెవెల్‌లో ఖోఖో, కబడీ, త్రో బాల్, వాలీ బాల్, బ్యాడ్‌మింటన్‌లో లెక్కలేనన్ని పతకాలందుకున్నాను. షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో జాతీయస్థాయి పతకాలందుకున్నాను. కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ ఉంది. నేను ఇప్పుడు మీ ముందు ఇంత అడ్వెంచరస్‌గా కనిపిస్తున్నానంటే కారణం ఈ నేపథ్యమే.

ఈ ఉద్యోగం ఆడవాళ్లకెందుకు?
స్త్రీపురుష సమానత్వ సాధన కోసం ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. మాలాంటి ఎందరో పోలీసింగ్, దేశరక్షణ వంటి క్లిష్టమైన విధులను భుజాలకెత్తుకున్నాం. కానీ సమాజం మాత్రం అంత ముందు చూపుతో లేదన్న వాస్తవాన్ని మా డిపార్ట్‌మెంట్‌లోనే చూశాను. ‘ఆఫ్టరాల్‌ ఉమన్, జస్ట్‌ కానిస్టేబుల్, యూనిఫామ్‌ వేసుకుని డ్యూటీకి వస్తారు, వెళ్తారు. జీతం దండగ’ అనే మాటలు మేము వినాలనే అనేవాళ్లు. నాలో కసి ఎంతగా పెరిగిపోయిందంటే... వాహనం కొనేటప్పుడు చిన్నవి వద్దని 350 సీసీ బుల్లెట్‌ తీసుకున్నాను. ‘ఏ అసైన్‌మెంట్‌ అయినా ఇవ్వండి’ అన్నాను చాలెంజింగ్‌గా. నైట్‌ పెట్రోలింగ్‌ చేయమన్నారు.

అది కూడా సింగిల్‌గా. ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా వరుసగా 60రోజులు రాత్రి పది నుంచి రెండు గంటల వరకు బైక్‌ మీద హైదరాబాద్‌ సిటీ పెట్రోలింగ్‌ చేశాను. ఆ డ్యూటీతో వార్తాపత్రికలు, టీవీలు నన్ను స్టార్‌ని చేశాయి. ‘ఎంటైర్‌ ఆల్‌ ఇండియా చాలెంజింగ్‌ ఉమన్‌ ఆఫీసర్‌’ అని అప్పటి సీపీ అంజనీకుమార్‌ సత్కరించారు. బేగంపేట మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫైళ్లను త్వరితగతిన క్లియర్‌ చేసిన మహిళా కానిస్టేబుల్‌గా ఏసీపీ రంగారావు చేతుల మీదుగా సత్కారం అందుకున్నాను.

బుల్లెట్‌ పై వస్తా... ఆకతాయిల భరతం పడతా!
పోలీసులంటే శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ అడ్రస్‌ చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్, భరోసా, షీ టీమ్స్, తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ కౌన్సెలింగ్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్, కరోనా సమయంలో అనారోగ్యంతో ప్రయాణించవద్దు– వ్యాప్తికి కారణం కావద్దనే ప్రచారం, ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం, ఆత్మహత్యల నివారణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ... ‘మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. నిలబెట్టుకోవడం, కాలరాసుకోవడం రెండూ మన నిర్ణయాల మీదనే ఉంటాయ’ని చెప్పేదాన్ని. గణేశ్‌ ఉత్సవాల సమయంలో మహిళలను తాకుతూ విసిగించడం, మెడల్లో దండలు అపహరించే పోకిరీల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది మా డి΄ార్ట్‌మెంట్‌. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిల భరతం పట్టడం చాలా సంతోషాన్నిచ్చింది. 

సరదాకొద్దీ సోలో రైడ్‌లు
చిన్నప్పటి నుంచి టామ్‌బాయ్‌లా పెరిగాను. బైక్‌ అంటే నా దృష్టిలో డ్యూటీ చేయడానికి ఉపకరించే వాహనం కాదు. బైక్‌ కిక్‌ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్‌ జిల్లాలో మాగ్నెటిక్‌ హిల్స్‌కి రైడ్‌ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌సెప్టర్‌ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. ‘వరల్డ్‌ మోటార్‌సైకిల్‌ డే’ సందర్భంగా బైక్‌ రైడ్‌ చేశాను. బైకర్‌లీగ్‌ విజేతను కూడా. ‘ఉమన్‌ సేఫ్‌ రైడర్‌ ఇన్‌ తెలంగాణ’ పురస్కారం కూడా అందుకున్నాను. అడ్వెంచరస్‌ స్పోర్ట్స్‌ అంటే ఇష్టం.

గుర్‌గావ్‌లో ΄ారాషూట్‌ డైవింగ్, పారాగ్లైడింగ్‌ చేశాను. నా సాహసాలకు గాను సావిత్రిబాయి ఫూలే పురస్కారం, సోషల్‌ సర్వీస్‌కు గాను హోలీ స్పిరిట్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం అత్యంత సంతృప్తినిచ్చిన సందర్భాలు. మొత్తం నాలుగు మెడల్స్, మూడు అవార్డులు అందుకున్నాను.పాన్‌ ఇండియా మాస్టర్స్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఆటల పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్‌ త్రోలో పతకాలందుకున్నాను. 

దానికి కొనసాగింపుగానే ప్రస్తుతం యూఎస్‌లో జరిగే క్రీడలకు ఆహ్వానం అందింది. వీసా కూడా వచ్చింది. నా దగ్గరున్న డబ్బు ఖర్చయి పోయింది. యూఎస్‌ వెళ్లిరావడానికి స్పాన్సర్‌షిప్‌ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రపంచంలోని 50 దేశాల క్రీడాకారులు ΄ాల్గొనే ఈ పోటీలకు వెళ్లగలిగితే మాత్రం భారత్‌కు విజేతగా పతకాలతో తిరిగి వస్తాను’’ అన్నారు శ్యామల మెండైన ఆత్మవిశ్వాసంతో. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోర్ల అనిల్‌ కుమార్చ్ఠ్‌

బైక్‌ కిక్‌ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్‌ జిల్లాలో మాగ్నెటిక్‌ హిల్స్‌కి రైడ్‌ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌సెప్టర్‌ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement