హ్యాకింగ్‌.. ‘పోలీస్‌’ షేకింగ్‌! | Telangana Police TS Cop App Hacked | Sakshi
Sakshi News home page

హ్యాకింగ్‌.. ‘పోలీస్‌’ షేకింగ్‌!

Published Sat, Jun 8 2024 5:11 AM | Last Updated on Sat, Jun 8 2024 5:39 AM

Telangana Police TS Cop App Hacked

హ్యాకింగ్‌కు గురైన తెలంగాణ పోలీస్‌ టీఎస్‌ కాప్‌ యాప్‌ 

కీలక సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి?

ఇంతకుముందే హ్యాక్‌ అయిన హాక్‌ ఐ మొబైల్‌ యాప్‌ 

అందులోని సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు అమ్మకానికి పెట్టినట్టు చర్చ 

వరుస సైబర్‌ దాడులతో  అప్రమత్తమైన పోలీస్‌ శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: వారం రోజుల వ్యవధిలో తెలంగాణ పోలీసు శాఖకు చెందిన రెండు కీలక యాప్‌లు హ్యాకింగ్‌కు గురవడం కలకలం సృష్టిస్తోంది. సైబర్‌ నేరగాళ్లు తెలంగాణ పోలీస్‌కు చెందిన హాక్‌ ఐ యాప్‌తోపాటు పోలీస్‌ అంతర్గత విధుల్లో అత్యంత కీలకమైన టీఎస్‌కాప్‌ యాప్‌ను సైతం హ్యాక్‌ చేశారు. వీటి నుంచి హ్యాకర్లు పోలీస్‌ శాఖకు సంబంధించిన కీలక డేటాను, ఫొటోలను చేజిక్కించుకుని.. డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

సైబర్‌ నేరగాళ్లకు సంబంధించిన కేసులను పరిష్కరించే పోలీసులు తమ సొంత యాప్‌లు హ్యాక్‌ గురైన విషయాన్ని గుర్తించడంలో మాత్రం ఆలస్యం జరిగింది. హాక్‌ ఐ యాప్‌ హ్యాకింగ్‌ గురైన తర్వాత వారం రోజులకు టీఎస్‌కాప్‌ యాప్‌ హ్యాక్‌ అయిందని.. రెండింటి హ్యాకింగ్‌ ఒకే హ్యాకర్‌ కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు. 

హాక్‌ ఐ యాప్‌ హ్యాకింగ్‌కు గురవడంపై సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇప్పటికే ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌శాఖకు సంబంధించిన కీలక యాప్‌ల హ్యాకింగ్‌ నిజమేనని.. రెండింటిని హ్యాక్‌ చేసింది ఒకరేనా, వేర్వేరు వ్యక్తులా అన్నది తేల్చాల్సి ఉందని టీఎస్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

కీలక వ్యవహారాలన్నీ అందులోనే.. 
తెలంగాణ పోలీసుల రోజువారీ విధుల్లో టీఎస్‌కాప్‌ యా ప్‌ది ప్రధాన భూమిక. 2018లో ప్రారంభించిన ఈ యాప్‌లో పాత నేరస్తుల సమాచారం, క్షేత్రస్థాయిలో నిందితులను గుర్తించేందుకు అవసరమైన ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్, సీసీటీఎన్‌ఎస్‌ (క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌), రవాణాశాఖ సమాచారం వంటి మొత్తం 54 సర్విసులు పోలీసులకు క్షేత్రస్థాయి విధుల కోసం అందుబాటులో ఉంటాయి. 

లక్షలాది మంది నేర స్తుల ఫొటోలు, వేలిముద్రలు, ఇతర వివరాలు, గత కొన్నేళ్లలో నమోదైన నేరాల వివరాలు, రోడ్డు ప్రమాదాలు, ఆయా కేసులలో నిందితులు, బాధితుల ఫోన్‌ నంబర్లు, దర్యాప్తులో అవసరం మేరకు ఆధార్‌కార్డు, ఇతర ధ్రువపత్రాల వివరాలు, వాహనాల నంబర్లు, సీసీ టీవీ కెమెరాల జియో ట్యాగింగ్‌ వివరాలు, క్రైం సీన్‌ ఫొటోలు, వీడియో లు, సాక్షుల స్టేట్‌మెంట్‌ రికార్డులు, ట్రాఫిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వివరాలు ఇలా చాలా సమాచారాన్ని టీఎస్‌కాప్‌ యాప్‌ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇంత కీలమైన యాప్‌ హ్యాక అవడంపై పోలీస్‌శాఖలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. 

ఆన్‌లైన్‌లో డేటా అమ్మకం? 
టీఎస్‌కాప్‌ యాప్‌లోని యూజర్‌ డేటాను సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్‌ కోడాలి.. తన డిజిటల్‌దత్తా పేరిట ఉన్న ట్విట్టర్‌ అకౌంట్‌లో ‘టీఎస్‌కాప్‌ సహా మొత్తం తెలంగాణ కాప్‌ల నెట్‌వర్క్‌ను ఎవరో హ్యాక్‌ చేశారు.

ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన కంపెనీ.. యాప్‌లో పాస్‌వర్డ్‌లను ప్లెయిన్‌ టెక్ట్స్‌గా పొందుపర్చడం, యాప్‌ సీసీటీఎన్‌ఎస్‌కు కనెక్ట్‌ అయి ఉండటం వంటివి సులభంగా హ్యాక్‌ అవడానికి కారణాలై ఉండొచ్చు’’అని పేర్కొన్నారు. హ్యాకర్‌ కొనుగోలుదారులను ప్రలోభపెట్టడానికి ఆన్‌లైన్‌ ఫోరమ్‌లలో నమూనా డేటాను పోస్ట్‌ చేశాడని., నేరస్తుల రికార్డులు, తుపాకీ లైసెన్సులు, ఇతర డేటాను కూడా పొందుపర్చాడని తెలిపారు. 

హ్యాకింగ్‌ క్రైం ఫోరం అయిన బ్రీచ్‌ ఫోరమ్స్‌లో పేర్కొన్న ప్రకారం.. టీఎస్‌కాప్, హాక్‌ ఐ నుంచి లీకైన డేటాలో 2 లక్షల మంది యూజర్ల పేర్లు, ఈ–మెయిల్‌ ఐడీలు, ఫోన్‌ నంబర్లు , అడ్రస్‌లు 1,30,000   ౖ  రికార్డులు, 20 వేల ప్రయాణ వివరాల రికార్డులను డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. 

కీలక విభాగాలు, పోలీస్‌ అధికారుల వివరాలు కూడా..? 
హాక్‌ ఐ, టీఎస్‌కాప్‌ యాప్‌లు హ్యాకింగ్‌కు గురవడంతో.. సైబర్‌ నేరగాళ్ల చేతికి ఏసీబీ, యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో, సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్, సీసీఆర్‌బీ, సీసీఎస్, సీఐడీ, కంట్రోల్‌ రూమ్‌లు, సీపీ ఆఫీస్‌లు, డీసీఆర్‌బీలు, గ్రేహౌండ్స్, జీఆర్పీ, ఇంటెలిజెన్స్, ఐటీ కమ్యూనికేషన్స్, లా అండ్‌ ఆర్డర్, ఎస్పీ ఆఫీసులు, ఎస్‌ఓటీ, స్పెషల్‌ బ్రాంచ్‌లు, స్పెషల్‌ యూనిట్లు, టాస్‌్కఫోర్స్, ట్రాఫిక్, టీజీఎస్పీ ఇలా చాలా విభాగాల సమాచారం చిక్కి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్‌ కోడాలి కూడా.. ‘‘అధికారుల పేర్లు, పోలీసు స్టేషన్‌ అనుబంధాలు, హోదాలు, ఫొటోలతో సహా సమాచారం డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు, వందల మంది పోలీసు అధికారుల వివరాలు అందులో ఉన్నాయి’’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

అత్యుత్తమ టెక్నాలజీ ఉన్న టీఎస్‌కాప్‌ యాప్‌కు గతంలో నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నుంచి ‘సాధికార పోలీసు విత్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’విభాగంలో అవార్డు దక్కింది. అలాంటి టీఎస్‌కాప్‌ యాప్‌ హ్యాక్‌ అవడంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు సులువుగా ఉండే పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడంతో హ్యాకింగ్‌ సులువైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ డేటా బ్రీచ్‌పై ఇప్పటికే తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement