ఆ లింకులపై క్లిక్ చేయకండి
అలా చేస్తే మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయి
ఎవరు ఫోన్ చేసినా ఓటీపీలు, వివరాలు చెప్పవద్దు..
రాష్ట్ర పోలీస్ శాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ప్రక్రియ మొదలు కావటంతో సైబర్ మోసగాళ్లు సరికొత్త మోసానికి తెరతీసినట్టు తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. వివిధ బ్యాంకుల పేరుతో, వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలో బ్యాంకు గుర్తు (లోగో), పేరు.. బ్యాంకు అధికారుల ఫొటోలతో నకిలీ వాట్సాప్ అకౌంట్‌ని సృష్టించి వాటి నుంచి మోసపూరితమైన లింకులు (ఏపీకే ఫైల్స్) పంపుతున్నారని అప్రమత్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసులు గురువారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.
బ్యాంకుల పేరిట వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, వాటిని డౌన్‌లోడ్ చేస్తే మన మొబైల్‌ఫోన్ సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళుతుందని తెలిపారు. అదేవిధంగా మన ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లకు సైతం మనం పంపినట్టుగా ఈ మోసపూరితమైన లింకులు వెళతాయని హెచ్చరించారు. దీనివల్ల మీ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వాట్సాప్‌కు గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే బ్లూ కలర్ లింకులను గానీ, ఏపీకే ఫైళ్లనుకానీ డౌన్‌లోడ్ చేసుకుంటే, సైబర్ నేరగాళ్లు మీ గూగుల్ పే, ఫోన్‌పే నంబర్ల నుంచి డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఎవరు ఫోన్ చేసినా ఓటీపీలు, ఇతర వివరాలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఇలాంటి ఆన్‌లైన్ మోసానికి గురయితే వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment