
నాంచారమ్మకు కౌన్సెలింగ్ ఇస్తున్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి తదితరులు
కృష్ణాజిల్లా, పెడన : ఆర్థిక కారణాలతో పెంచలేక ఆ తల్లి తన కుమార్తెను కడతేర్చింది. భర్త చనిపోవడంతో పోషించే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ఆమె తన కుమార్తెకు విషమిచ్చి చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వివరాలిలా ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు విగతజీవులుగా మారిన చిన్నారుల ఘటన వెనుక కారణం ఆర్థిక పరిస్థితులేనని తెలుస్తోంది. చిన్నారి మోకా ప్రశాంతికి (5) మచిలీపట్నంలోని జిల్లా ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహంలోని కొన్ని శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అయితే, విషం ఇచ్చి చంపినట్లు పోస్టుమార్టంలో తేలినట్లు సమాచారం. నివేదిక వచ్చేందుకు నాలుగైదు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. పోస్టుమార్టం పూర్తయిన చిన్నారి ప్రశాంతి మృతదేహానికి స్థానికులు, బంధువులు ఘనంగా అంత్యక్రియలను నిర్వహించారు.
డీఎస్పీ మహబూబ్‌బాషా ఆరా...
మచిలీపట్నం డీఎస్సీ మహబూబ్‌బాషా బుధవారం పెడన పోలీస్ స్టేషన్‌కు వచ్చి చిన్నారుల మృతిపై ఆరా తీశారు. జరిగిన ఘటనలను ఎస్‌ఐ అభిమన్యు డీఎస్పీకి వివరించారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మచిలీపట్నం, పెడన అర్బన్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి, 15వ వార్డు అంగన్‌వాడీ ఆయాతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఉన్న చిన్నారుల తల్లి నాంచారమ్మకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నారులు ఏ విధంగా చనిపోయారనే దానిపై వారు ప్రశ్నలను అడిగి పలు విషయాలను రాబట్టినట్లు సమాచారం. చాలా సేపు నోరు విప్పని నాం చారమ్మ చివరికి పెంచుకోలేక పిల్లలను చంపుకున్నాననే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది.
ఆర్థిక పరిస్థితులే కారణమా..!
మోకా రామాంజనేయులు ఉరఫ్ సుబ్బారావు, నాంచారమ్మలది ప్రేమ వివాహం. రామాంజనేయులు స్వస్థలం బందరు మండలం పోలాటితిప్ప. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పట్టుబడిపోతుండటంతో ఆటోను నడుపుకుంటూ పెడనలో ఉండే నాంచారమ్మను వివాహం చేసుకున్నా డు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు... ప్రశాంతి (5), దివ్య (3). భర్త తాగుడుకు బానిస కావడంతో నాంచారమ్మ కూడా కలంకారీ పనికి వెళ్తోంది. మద్యానికి బానిసైన రామాంజనేయులు ఈ ఏడాది జనవరి ఒకటిన చనిపోయాడు. అంత్యక్రియలు పూర్తయ్యాక కలంకారీ పనికి వెళ్లేందుకు నాంచారమ్మ సిద్ధమైంది. అయితే భర్త చనిపోయిన భార్యకు మూడు నెలల వరకు వారి సంప్రదాయం ప్రకారం కలంకారీ పనికి రానీయలేదని సమాచారం. దీంతో ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతుండటంతో నాంచారమ్మ ఇద్దరు ఆడ పిల్లలతో తీవ్ర మానసిక వేదనకు గురైంది. అదీ కాకుండా పెద్ద పిల్ల ప్రశాంతి ఎప్పుడూ నాన్న ఏడీ, నాన్న ఏడి.. అంటూ కోరుతుండటంతో సమాధానం చెప్పలేని పరిస్థితిలో తల్లి మానసిక క్షోభను అనుభవించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మేం కూడా చనిపోతామనే విషయాన్ని చెప్పుకుని బంధువుల వద్ద వాపోయినట్లు సమాచారం.
ఉరేసుకునేందుకు ప్రయత్నించి విఫలం..
భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలను ఒంటరిగా వదిలి నాంచారమ్మ ఉరేసుకునేందుకు ప్రయత్నించి విఫలమైందని బంధువులు చెబుతున్నారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఏమైనా సాయం కావాల్సి వస్తే చేస్తామని నాంచరమ్మ సోదరీమణులు భరోసా ఇచ్చారు. అదీ కాకుండా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్‌వాడీ ఆయాలు సైతం కలిసి పిల్లలను ఇబ్బంది రాకుండా చూసుకోవాలని, లేనిపక్షంలో చిల్డ్రన్స్ హోంకు పంపించాలని కూడా సూచించారు. పిల్లలను చూసుకుంటానని చెప్పిన నాంచారమ్మ ఆ తర్వాత ఏం చేసిందనేది మిస్టరీగానే ఉంది. మానసిక పరిస్థితి బాగోలేక పిల్లలకు విషమిచ్చి చంపేసిందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment