అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
విజయనగరం క్రైం: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తాను. ముందుగా జిల్లాలో పరిస్థితులపై అవగాహన ఏర్పర్చుకునేందుకు కృషి చేస్తాను. భూదందాలు, సివిల్ తగాదాల్లో సంబంధమున్న పోలీసులపై, పోలీసు స్టేషన్‌ల వారీగా అక్రమ వసూలు చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోడానికి వెనుకాడను.
సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుంటే ఉపేక్షించం
సివిల్ తగాదాల్లో పోలీసు అధికారులు జోక్యం చేసుకుంటున్నారని, ఎక్కువగా భూదందాలు జరుగుతున్నాయని, ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని వస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎస్.కోట, భోగాపురం, కొత్తవలసప్రాంతాల్లోనే కాదు జిల్లా లో ఎక్కడైనా పోలీసులు, ఉద్యోగవిరమణచేసిన అధికారులు భూ వ్యవహారాల్లో, సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకుంటే బాధితులు, ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు, వెంటనే తగిన చర్యలు తీసుకుంటాను. అలాగే స్టేషన్ మామూళ్లని, ఇతర చందాలని పోలీసులెవరైనా చేయి చాపితే సహించేదిలేదు. భూముల విషయాల్లో ప్రజలను మోసగించడం వంటివి క్రైమ్ కిందకు వస్తాయి. అటువంటి విషయాల్లో మాత్రం పోలీసులు జోక్యం చేసుకుంటారు.
త్వరలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
అసాంఘిక శక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాను. దొంగతనాలు, పేకాట, వ్యభిచారం తదితర కార్యకలాపాల నివారణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాను. ప్రత్యేక గస్తీలు, దాడులు నిర్వహించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. వీటిని అరికట్టేం దుకు త్వరలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తాను. నెల్లూరులో పనిచేసిన కాలంలో తానీ వ్యవస్థను ఏర్పాటు చేశాను. మంచి ఫలితాలొచ్చాయి. అలాగే అనుమతి లేని దుకాణాలు, దాబాల్లో మద్యం అమ్మినా ఊరుకోం, మద్యం తాగి వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందువల్ల దాబాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం.
చిట్స్ విషయంలో జరభద్రం
అనధికార చిట్స్, గుర్తింపులేని బ్యాంకులు, బోగస్ ఫై నాన్స్ సంస్థల విషయంలో ప్రజలు అప్రమత్తంగా వ్య వహరించాలి. సంస్థల పూర్తి వివరాలను తెలుసుకుని, రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థల్లో మాత్రమే సభ్యులుగా చేరాలి. బోగస్ ఫైనాన్స్ సంస్థల విషయాల్లో పోలీసులు జోక్యం ఉంటే ఏమాత్రం సహించం.
అవగాహన ఏర్పర్చుకున్న తరువాతే...
జిల్లా పరిస్థితులపై ముందుగా అవగాహన పెంచుకుని, తరువాత నా ఆలోచనలు అమలు చేస్తాను. నేరాల నిరోధంతో పాటు ట్రాఫిక్ పై కూడా దృష్టి సారిస్తాను. ప్రస్తుతం జిల్లాలో ట్రాఫిక్ ఎలా ఉందో పరిశీలించి, ఆమేరకు చర్యలు తీసుకుంటాను. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం పోలీసుల విధి. సిగ్నల్స్ తదితర ఇంజినీరింగ్ పనులను మున్సిపల్ అధికారులు చూడాలి. మున్సిపల్ అధికారుల సహకారంతో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. అతివేగం వల్లే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని నిరోధించేందుకు ప్రత్యేకంగా దృష్టిసారిస్తాను. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇతరత్రా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రతిరోజూ ఫిర్యాదుల స్వీకరణ ఇకపై నుంచి ఒక్క సోమవారమే కాదు ప్రతిరోజూ ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తాం. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించి ప్రజల మన్ననలు పొందుతాం. అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం.