అదానీ గ్రూప్ ఇటీవల అమెరికాలో తనపై వచ్చిన ఆరోపణలను న్యాయబద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈమేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC), ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ దాఖలు చేసిన సివిల్, క్రిమినల్ కేసులను నిర్వహించడానికి కిర్‌క్లాండ్ & ఎల్లిస్, క్విన్ ఇమ్మాన్యుయేల్ ఉర్కహర్ట్ & సుల్లివాన్ ఎల్‌ఎల్‌పీ అనే న్యాయ సంస్థలను అదానీ గ్రూప్ నియమించింది.
అసలేం జరిగిందంటే..
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దాంతో అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఏజీఈఎల్‌లో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి యూఎస్‌లోని ఎస్‌ఈసీ, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ప్రాథమిక దర్యాప్తు జరిపి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టింది. వాటిని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ తాజాగా రెండు సంస్థలను నియమించింది. ఇవి కంపెనీపై వచ్చిన ఆరోపణలపై న్యాయబద్ధంగా అక్కడి కోర్టుల్లో సమాధానం చెప్పనున్నాయి.
కేసు నేపథ్యం
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుంచి కాంట్రాక్టులు పొందడానికి ఏజీఈఎల్‌కు అనైతికంగా సాయపడటానికి భారత అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ, ఇతర ఎగ్జిక్యూటివ్‌లపై 2024 నవంబర్ 21న అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఎస్ జైన్‌లపై యూఎస్ ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఏఫ్‌సీపీఏ) ఉల్లంఘనలకు సంబంధించి అభియోగాలు మోపలేదని ఎజీఈఎల్ నొక్కి చెప్పింది.
ఇదీ చదవండి: ఇళ్ల నిర్మాణ వ్యయంలో భారీ కోత..?
న్యాయ సంస్థల గురించి
షికాగోలో ప్రధాన కార్యాలయం ఉన్న కిర్‌క్టాండ్ & ఎల్లిస్ అధికంగా వాణిజ్య వివాదాలు, మేధో సంపత్తి వ్యాజ్యాలు, వైట్-కాలర్ కేసుల్లో ప్రత్యేకత కలిగి ఉంది. ఇప్పటికే జాన్సన్ & జాన్సన్, వోక్స్ వ్యాగన్ వంటి ప్రధాన సంస్థలకు ఈ సంస్థ సేవలందించింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన క్విన్ ఇమ్మాన్యుయేల్ సెక్యూరిటీస్ లిటిగేషన్, ప్రొడక్ట్ లయబిలిటీ, రెగ్యులేటరీ ఇన్వెస్టిగేషన్‌ల్లో ప్రసిద్ది చెందింది. ఈ కంపెనీకి గూగుల్, యాపిల్, ఉబెర్ వంటి క్లయింట్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment