సాక్షి, సిటీబ్యూరో: పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నా వారిలో మార్పు రావడం లేదు. అయితే పరిధుల పేరుతో పంచాయితీలు పెట్టుకోవడం, లేదా ఫిర్యాదుల విషయంలో తాత్సారం ప్రదర్శించడంతో పాటు సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. మంచిరేవులలోని ఓ స్థలానికి సంబంధించి ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరి«ధిలోని సరూర్‌నగర్ పోలీసులు జోక్యం చేసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) అధికారుల సాయంతో ఓ వ్యాపారిని నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్భంధించడంతో పాటు శారీకరంగా, మానసికంగా హింసించారు. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు లాక్కోవడమేగాక తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని అక్రమంగా కేసు నమోదు చేసి తనను అరెస్టు చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు అతను మంగళవారం రాష్ట్ర మానవహక్కుల సంఘంతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే..ఉప్పల్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. నార్సింగి పరిధిలోని మంచిరేవులలో 930 చదరపు గజాల స్థలాన్ని అభివృద్ధి చేయడానికి పోచంపల్లి మండలం, శివారెడ్డిగూడేనికి చెందిన మంజులా దేవితో 2016లో ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకుగాను తొలుత రూ.5 లక్షలు, ఆ తర్వాత ఏడాది మరో రూ.40 లక్షలు చెల్లించాడు. 2018 ఫిబ్రవరిలో ఆమె అదే స్థలాన్ని వరంగల్‌కు చెందిన మోహన్‌రావుకు అప్పగిస్తూ మరో ఒప్పందం చేసుకుంది. ఆ విషయం చంద్రశేఖర్‌రెడ్డికి తెలియకుండా అదే ఏడాది డిసెంబర్‌లో డాక్యుమెంట్ రిజిస్టర్ చేశారు. ఈ విషయం తెలియడంతో చంద్రశేఖర్‌రెడ్డి గత ఫిబ్రవరి నుంచి ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు.
అయితే ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న ఆమె బాధితుడిని బెదిరించేందుకుగాను ఆగస్టులో బెంగళూరులోని సంజయ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జూన్ 15న చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరు వచ్చి ఆమెను వేధించడమే కాకుండా బెదిరించాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. పూర్వాపరాలు పరిశీలించని సంజయ్‌నగర్ పోలీసులు సెప్టెంబర్ 3న కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధితుడు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు. దీంతో ఆమె సరూర్‌నగర్ పోలీసుల సాయంతో రంగంలోకి దిగా రు. గత అక్టోబర్ 18న చంద్రశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉంచుకుని శారీరకంగా, మానసికంగా వేధించారు. ఆపై బాధితుడిని సరూర్‌నగర్ పోలీసులకు అప్పజెప్పారు. వారు బాధితుడి నుంచి బలవంతంగా మంచిరేవుల స్థలానికి సంబంధించి ఒప్పందం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడమేగాక తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు. సదరు మహిళ సరస్వతీనగర్ కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఆమెను వేధించాడని, బెంగళూరులో ఇల్లు నిర్మించి ఇస్తానంటూ మోసం చేశాడనే ఆరోపణలపై నమోదు చేసిన పోలీసులు అక్టోబర్ 23న అతడిని అరెస్టు చేశారు. బెంగళూరులో, ఇక్కడా ఒకే మహిళ, ఒకే ఆరోపణలపై ఫిర్యాదు చేశారని బాధితుడు ఆ«ధారాలు చూపినా పట్టించుకోలేదు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, సంతకంతో కూడిన పేపర్లను ఆమెకు అప్పగించారు. మంచిరేవుల స్థలంపై ఆశలు వదులుకోవాలంటూ బెదిరించి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటికి వచ్చిన బాధితుడు పోలీసుల బెదిరింపులకు భయపడిన కొన్నాళ్లు మిన్నకుండిపోయాడు. ఎట్టకేలకు మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల సంఘంతో పాటు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అతను న్యాయం చేయాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment