Saroor Nagar Police station
-
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై సరూర్ నగర్ పోలీస్ స్టే కేసు నమోదైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ అర్వింద్ తెలంగాణ ప్రభుత్వంపై , సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ లీగల్ సెల్ కో కన్వీనర్, లాయర్ రవికుమార్ ఈనెల 17న సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వం, కేసీఆర్ ప్రతిష్టను కించపరిచే విదంగా పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు లీగల్ ఓపీనియన్‌కు పంపారు. న్యాయ నిపుణుల సలహా మేరకు బుధవారం ధర్మపురి అరవింద్‌పై 504 , 505(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం వెల్లడించారు. -
తాగి కొడుతున్నాడని ఒకరు.. నల్లగా ఉన్నావని మరొకరు
సాక్షి, హైదరాబాద్ : అదనపు కట్నం కోసం ఒకరు.. సరిగా చూడటం లేదని మరొకరు.. సంపాదన లేదని ఇంకొకరు.. తాగి కొడుతున్నాడని, నల్లగా ఉన్నావని మరొకరు.. ఇలా వివిధ కారణాలతో ఘర్షణ పడుతున్నారు. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన యువ జంటలు చిన్నచిన్న వివాదాలతో ఎడబాటు వరకు వెళ్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది సరూర్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో 2,246 ఫిర్యాదులు నమోదయ్యాయి. అరెస్ట్, రిమాండ్‌కు తరలించే ముందే పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. విడిపోదామనుకున్న వారు కౌన్సె లింగ్‌తో మనసు మార్చుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది 1,372 జంటలు ఒక్కటికావడం విశేషం. చిన్న విషయంలో సరూర్‌నగర్‌కు చెందిన ఓ యువజంట మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అవి కాస్తా పెరిగి పెద్దవై.. చివరికి విడాకుల వరకు వెళ్లింది. ఇద్దరూ సరూర్‌నగర్ మíహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు దంపతులిద్దరినీ కూర్చొబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు. శాశ్వతంగా విడిపోదామనుకున్న వారు ఒక్కటైపోయారు. వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు. పిల్లల పెంపకం విషయంలో గొడవ పడ్డారు. పెద్దలు నచ్చజెప్పినా విన్పించుకోలేదు. శాశ్వతంగా విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. భర్త వేధిస్తున్నాడని భార్య.. భార్యే వేధిస్తోందని భర్త ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఒక్కటయ్యారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 1,372 జంటలు ఏకమయ్యాయి. వినకపోతేనే కేసు నమోదు రోజుకు సగటున 40–50 ఫిర్యాదులు వస్తుంటాయి. వచ్చిన వారిలో అంతా యువ దంపతులే. పెళ్లైన రెండు మూడేళ్లకే చిన్నచిన్నవాటికి గొడవపడుతున్నారు. క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు జంటలను కలిపే ప్రయత్నం చేస్తున్నాం. కౌన్సెలింగ్‌తో 70 శాతం మంది కలిసిపోతున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చినా వినని వారిని మాత్రమే రిమాండ్‌కు పంపిస్తున్నాం. – జి.మంజుల, సీఐ, మహిళా పోలీస్‌స్టేషన్ -
బంధించి..హింసించారు..
సాక్షి, సిటీబ్యూరో: పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నా వారిలో మార్పు రావడం లేదు. అయితే పరిధుల పేరుతో పంచాయితీలు పెట్టుకోవడం, లేదా ఫిర్యాదుల విషయంలో తాత్సారం ప్రదర్శించడంతో పాటు సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. మంచిరేవులలోని ఓ స్థలానికి సంబంధించి ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరి«ధిలోని సరూర్‌నగర్ పోలీసులు జోక్యం చేసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) అధికారుల సాయంతో ఓ వ్యాపారిని నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్భంధించడంతో పాటు శారీకరంగా, మానసికంగా హింసించారు. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు లాక్కోవడమేగాక తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని అక్రమంగా కేసు నమోదు చేసి తనను అరెస్టు చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు అతను మంగళవారం రాష్ట్ర మానవహక్కుల సంఘంతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే..ఉప్పల్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. నార్సింగి పరిధిలోని మంచిరేవులలో 930 చదరపు గజాల స్థలాన్ని అభివృద్ధి చేయడానికి పోచంపల్లి మండలం, శివారెడ్డిగూడేనికి చెందిన మంజులా దేవితో 2016లో ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకుగాను తొలుత రూ.5 లక్షలు, ఆ తర్వాత ఏడాది మరో రూ.40 లక్షలు చెల్లించాడు. 2018 ఫిబ్రవరిలో ఆమె అదే స్థలాన్ని వరంగల్‌కు చెందిన మోహన్‌రావుకు అప్పగిస్తూ మరో ఒప్పందం చేసుకుంది. ఆ విషయం చంద్రశేఖర్‌రెడ్డికి తెలియకుండా అదే ఏడాది డిసెంబర్లో డాక్యుమెంట్ రిజిస్టర్ చేశారు. ఈ విషయం తెలియడంతో చంద్రశేఖర్‌రెడ్డి గత ఫిబ్రవరి నుంచి ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న ఆమె బాధితుడిని బెదిరించేందుకుగాను ఆగస్టులో బెంగళూరులోని సంజయ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జూన్ 15న చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరు వచ్చి ఆమెను వేధించడమే కాకుండా బెదిరించాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. పూర్వాపరాలు పరిశీలించని సంజయ్‌నగర్ పోలీసులు సెప్టెంబర్ 3న కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధితుడు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు. దీంతో ఆమె సరూర్‌నగర్ పోలీసుల సాయంతో రంగంలోకి దిగా రు. గత అక్టోబర్ 18న చంద్రశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉంచుకుని శారీరకంగా, మానసికంగా వేధించారు. ఆపై బాధితుడిని సరూర్‌నగర్ పోలీసులకు అప్పజెప్పారు. వారు బాధితుడి నుంచి బలవంతంగా మంచిరేవుల స్థలానికి సంబంధించి ఒప్పందం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడమేగాక తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు. సదరు మహిళ సరస్వతీనగర్ కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఆమెను వేధించాడని, బెంగళూరులో ఇల్లు నిర్మించి ఇస్తానంటూ మోసం చేశాడనే ఆరోపణలపై నమోదు చేసిన పోలీసులు అక్టోబర్ 23న అతడిని అరెస్టు చేశారు. బెంగళూరులో, ఇక్కడా ఒకే మహిళ, ఒకే ఆరోపణలపై ఫిర్యాదు చేశారని బాధితుడు ఆ«ధారాలు చూపినా పట్టించుకోలేదు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, సంతకంతో కూడిన పేపర్లను ఆమెకు అప్పగించారు. మంచిరేవుల స్థలంపై ఆశలు వదులుకోవాలంటూ బెదిరించి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటికి వచ్చిన బాధితుడు పోలీసుల బెదిరింపులకు భయపడిన కొన్నాళ్లు మిన్నకుండిపోయాడు. ఎట్టకేలకు మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల సంఘంతో పాటు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అతను న్యాయం చేయాలని కోరాడు. -
సీఐ మసాజ్ బాగోతంపై సీపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్ : సరూర్‌నగర్ సిఐ లింగయ్య తన స్టేషన్లో హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న బాగోతంపై రాచకొండ కమిషనర్ సీరియస్ అయ్యారు. కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీపీ మహేష్ భగవత్ దీనిపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని డీసీపీ(అడ్మిన్) ప్రకాష్‌రెడ్డిని సంఘటనపై విచారణ అధికారిగా నియమించారు. వివరాల్లోకి వెళితే... సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ సుందరి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. స్టేషన్లో పనిచేసే హోంగార్డుతో ఇంటి వద్ద బాడీ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు మీడియా ఛానెల్లో హల్చల్ చేశాయి. మన్సూరాబాద్‌లోని ఇంటివద్ద సీఐ లింగయ్య యూనిఫామ్‌లో ఉన్న హోంగార్డు సైదానాయక్తో బాడీ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే మీడియాలో ప్రసారం అయిన దృశ్యాల్లో ఉన్నది తాను కాదని, తనకు మసాజ్ చేయించుకోవటంకానీ, మద్యం సేవించే అలవాటు అసలే లేదని సీఐ లింగయ్య పేర్కొన్నారు. సైదానాయక్ అనే హోంగార్డు అక్టోబర్ 14న రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో సెలవులో ఉన్నాడని, అనంతరం ఇక్కడినుంచి బదిలీపై వెళ్ళాడని అన్నారు. మూడు నెలలుగా సరూర్‌నగర్‌లో హోంగార్డు లేడని ఆయన స్పష్టం చేశారు. తనపై గిట్టనివాళ్లే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసుల దాడి
హైదరాబాద్‌సిటీ: సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఓ క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.84 వేల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సరూర్ నగర్ పీఎస్ లో స్వామి స్వరూపానందపై కేసు
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతిపై సరూర్‌నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. షిర్డీ సాయిబాబా దేవుడు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో లక్షలాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అలాగే మత విశ్వాసాలను గాయపరిచారన్న వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురువారం సరూర్ నగర్లో ధర్నా నిర్వహించారు. అనంతరం భక్తులు ఊరేగింపుగా సరూర్ నగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాంతో స్వామి స్వరూపానందపై పోలీసులు కేసు నమోదు చేశారు.