ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : అదనపు కట్నం కోసం ఒకరు.. సరిగా చూడటం లేదని మరొకరు.. సంపాదన లేదని ఇంకొకరు.. తాగి కొడుతున్నాడని, నల్లగా ఉన్నావని మరొకరు.. ఇలా వివిధ కారణాలతో ఘర్షణ పడుతున్నారు. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన యువ జంటలు చిన్నచిన్న వివాదాలతో ఎడబాటు వరకు వెళ్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది సరూర్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో 2,246 ఫిర్యాదులు నమోదయ్యాయి. అరెస్ట్, రిమాండ్‌కు తరలించే ముందే పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. విడిపోదామనుకున్న వారు కౌన్సె లింగ్‌తో మనసు మార్చుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది 1,372 జంటలు ఒక్కటికావడం విశేషం.
చిన్న విషయంలో సరూర్‌నగర్‌కు చెందిన ఓ యువజంట మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అవి కాస్తా పెరిగి పెద్దవై.. చివరికి విడాకుల వరకు వెళ్లింది. ఇద్దరూ సరూర్‌నగర్ మíహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు దంపతులిద్దరినీ కూర్చొబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు. శాశ్వతంగా విడిపోదామనుకున్న వారు ఒక్కటైపోయారు.
వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు. పిల్లల పెంపకం విషయంలో గొడవ పడ్డారు. పెద్దలు నచ్చజెప్పినా విన్పించుకోలేదు. శాశ్వతంగా విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. భర్త వేధిస్తున్నాడని భార్య.. భార్యే వేధిస్తోందని భర్త ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఒక్కటయ్యారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 1,372 జంటలు ఏకమయ్యాయి.
వినకపోతేనే కేసు నమోదు
రోజుకు సగటున 40–50 ఫిర్యాదులు వస్తుంటాయి. వచ్చిన వారిలో అంతా యువ దంపతులే. పెళ్లైన రెండు మూడేళ్లకే చిన్నచిన్నవాటికి గొడవపడుతున్నారు. క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు జంటలను కలిపే ప్రయత్నం చేస్తున్నాం. కౌన్సెలింగ్‌తో 70 శాతం మంది కలిసిపోతున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చినా వినని వారిని మాత్రమే రిమాండ్‌కు పంపిస్తున్నాం.
– జి.మంజుల, సీఐ, మహిళా పోలీస్‌స్టేషన్
Comments
Please login to add a commentAdd a comment