ప్రతీకాత్మక చిత్రం
ఔను.. వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఏకమయ్యారు. వీరి పదేళ్ల దాంపత్య జీవితంలో ఇద్దరు కూతుర్లు జన్మించారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య అనుమానాలు తలెత్తాయి. దీంతో భార్యకు సంబంధించిన తప్పులు భర్త, భర్తకు సంబంధించిన తప్పులతో భార్య స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇక ఇద్దరం కలిసి ఉండలేమని నిర్ణయం తీసుకొని విడాకులు కావాలనుకున్నారు. పోలీస్ సిబ్బంది ఇరువురి కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో మూడు దఫాలుగా వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తిరిగి వారి తప్పులను తెలుసుకున్నారు. దీంతో వారు మళ్లీ కలిశారు. ఇలా జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి మే 15 వరకు 197 ఫిర్యాదులు రాగా అందులో 144 కేసులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు.
సాక్షి, మంచిర్యాలక్రైం: సర్దుకుపోతే సంస్కారం ఒక స్వర్గసీమ. కానీ ప్రస్తుతం పలువురు దంపతులు చిన్నచిన్న సమస్యలనే పెద్దగా చూస్తూ గొడవలు పడుతున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో పంచాయితీలు, ఆ తరువాత పోలీస్‌స్టేషన్ల వరకు చేరి విడిపోతున్నారు. పచ్చటి సంస్కారాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. వారికి పుట్టిన సంతానానికి తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తూ వారిలో మానసిక ఆందోళనకు కారణమవుతున్నారు. ఇలాంటి సంఘటనలకు కారణాలు ఏమైనా ఉమ్మడి కుటుంబంలో సర్ధిచెప్పేవారు ఉండేవారు. కానీ ప్రస్తుతం చిన్న చిన్న కుటుంబాల్లో చెప్పేవారు లేక భార్యాభర్తలు చిన్నచిన్న గొడవలకే పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లి పచ్చని సంసారాన్ని విచ్ఛినం చేసుకుంటున్నారు.
కౌన్సెలింగ్‌తో ఏకమవుతున్నారు...
క్షణికావేశంతో చిన్నచిన్న సమస్యలకే దంపతులు సమన్వయం కోల్పోతున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉంటే పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసేవారు. దీంతో కుటుంబంలో తగాదాలు రోడ్డున పడేవి కాదు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబం అనే ఊసే లేదు. కొందరు ఉద్యోగ రీత్యా, మరికొందరు వ్యాపారం ని మి త్తం, ఇంకొందరు అత్తమామ, కుటుంబ సభ్యులతో పడకపోవడం, కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబా లు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో కుటుంబా ల్లో చిన్నచిన్న సమస్యలు తలెత్తినప్పుడు ఇద్దరికి చె ప్పె వారు లేక కుటుంబాలు పోలీస్‌స్టేషన్ వరకు వస్తున్నాయి.
ఎందుకీ పరిస్థితి...
గతంలో పెళ్లైన కొంతకాలం పాటు ఉమ్మడి కుటుంబంతో కలిసిఉండే వారు. ఇంటి యజమాని చెప్పిందే వేదం అన్నట్లుగా కుటుంబమంత నడుచుకునేవారు. ఇది కాస్త రానురాను ఉమ్మడి కుటుంబం కాస్త ఒంటరి కుటుంబంగా తయారైంది. దీంతో చిన్న చిన్న సమస్యలతో భార్యాభర్తలు పంతాలకు పోయి కాపురాన్ని కూల్చుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్‌కు రోజుకు సుమారు 25నుంచి 30మంది వరకు కుటుంబ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, పది మంది ముందు చులకన చేసుకోవడంతో పాటు వారి గౌరవాన్ని కించపరుచుకుంటున్నారు.
సర్దుకుపోతేనే సమస్యకు పరిష్కారం
గతంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉండే వారు దీంతో ఎలాంటి గొడవలు వచ్చేవి కావు. ఒక వేల వచ్చిన ఇరుకుటుంబాల పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసి పంపించేవారు. అప్పుడు కుటుంబాల్లో విలువలు, మర్యాద, గౌరవం, భయం భక్తి ఉండేది. అవి ప్రస్తుతం లేకపోవడంతో కుటుంబాల్లో చిన్నచిన్న గొడువలకు, పంతాలకు వెళ్లి పెద్దగా చేసుకుంటున్నారు. మొదట క్షణికావేశంతోనే ఏవెవో మాట్లాడుతారు. కౌన్సెలింగ్ ద్వారా 80శాతం కుటుంబాలు కలిసి పోతున్నారు.
– బి.శ్రీనివాస్, సీఐ, మహిళా పోలీస్‌స్టేషన్, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment