సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు..కానీ ఏకంగా సివిల్ తాగాదాలే సృష్టించడం..కేసులు పెట్టించడం..ఆనక చర్చల పేరుతో బెదిరింపులకు,ఒత్తిళ్లకు పాల్పడటం.. వినకపోతే రౌడీషీట్లుతెరవడం.. జైలు పాల్జేయడం..ఇదీ ఆ పోలీసు అధికారి స్టైల్.. ఇటువంటి దందాలతో కోట్లు దండుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య..ఆ అధికారి మరెవరో కాదు.. రాష్ట్రవ్యాప్తంగాసంచలనం సృష్టించిన రౌడీషీటర్ గేదెలరాజుహత్య కేసులో ఏ1 నిందితుడిగా జైలుపాలైనఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబు!..మధురవాడ, గాజువాకల్లో ఏసీపీగా పని చేస్తున్నసమయంలో ఆయన చేసిన సెటిల్‌మెంట్లు, దందాలు..
ఆయన అరెస్టు అనంతరం వెలుగులోకి వస్తున్నాయి.మధురవాడ పరిధి రేవళ్లపాలేనికి చెందినపిళ్లా కుటుంబీకులను ఓ సివిల్ వివాదంలోరౌడీషీట్లతో వేధింపులకు గురిచేసిన రవిబాబు దురాగతం వెలుగులోకి వచ్చింది. వారసత్వహక్కుగా వారికి సంక్రమించిన రూ.4.5 కోట్ల విలువైన భూమిని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి అప్పగించేందుకు ఒప్పందం చేసుకొని పిళ్లా కుటుంబీకులపై ఆయన పోలీస్ పవర్ ప్రయోగించారు.
సాక్షి, విశాఖపట్నం: మధురవాడ శివారు రేవళ్లపాలెం గ్రామానికి చెందిన పిళ్లా అప్పారావుకు అదే గ్రామ పరిధిలో జాతీయ రహదారికి కూతవేటు దూరంలోని సర్వే నెం.211/1,2లలో 23.5 సెంట్ల భూమి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ విలువ గజం రూ.40 వేలు పలుకుతోంది. ఈ లెక్కన ఆ భూమి విలువ నాలుగున్నర కోట్ల పైమాటే. అప్పారావు తదనంతరం ఆ భూమి ఆయన సంతానమైన ఈశ్వరరావు, హిమాలయ, కనకరాజు, శ్రీనివాసరావు, రమేష్, భారతిలకు వారసత్వ హక్కుగా సంక్రమిచింది. వీరిలో శ్రీనివాసరావు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో అతని భార్య వెంకటలక్ష్మికు హక్కు లభించింది. అప్పారావు భూమిని ఆనుకొని నాగోతి అప్పలసూరి అనే వ్యక్తికి 24 సెంట్ల భూమి ఉండేది.
దాన్ని ఎప్పుడో ఆయన వేరొకరికి అమ్మేశాడు. అయితే అదే గ్రామానికి అతని వారసుడిగా చెప్పుకొంటున్న నాగోతి లక్ష్మణరావు అనే వ్యక్తి విజయవాడకు చెందిన నాగోతి మొగ్గయ్య సత్యనారాయణ, చలపతిరావు, తొత్తడి కనకలక్ష్మిలతో కలిసి ఈ భూమిని దస్తావేజు నెం.5053/2007తో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీగా రిజిస్ట్రీ చేయించుకున్నట్టు రికార్డులు సృష్టించారు. పనిలో పనిగా అదే సర్వే నెంబరులో ఉన్న పిళ్లా కుటుంబీకుల భూమిని కాజేయాలనుకున్నారు. ఆ భూమి వారసుల్లో ఒకడైన పిళ్లా రమేష్‌ను లోబర్చుకొని తప్పుడు దృవపత్రాలతో మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు నెం.609/2009తో జనరల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ పత్రాల ఆధారంతో ఆ భూమిని హైదరాబాద్‌కు చెందిన ఎస్‌పి సాప్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన సాగిరెడ్డి పుల్లారెడ్డి పేరిట అమ్మేసి దస్తావేజు నెం.716/2011గా రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు.
పిళ్లా కుటుంబీకుల అభ్యంతరం : ఆ భూమిని సొంతం చేసుకున్న సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధులు.. వెంటనే రంగంలోకి దిగారు. భూమిలో ఉన్న షెడ్లను తొలగించి చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. అప్పుటికి గానీ పిళ్లా వారసులకు విషయం తెలియలేదు. తమ ప్రమేయం లేకుండా తమ సోదరుడు రమేష్ ఉమ్మడి ఆస్తిని అమ్మేసినట్లు గుర్తించారు. తమ భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆస్తిని ఎలా కొనుగోలు చేస్తారని నిలయదీయడంతో వీరితో ఇబ్బంది తప్పదని గుర్తించిన సాప్ట్‌వేర్ కంపెనీ యజమాని ఆ భూమిని తనకు అమ్మిన వ్యక్తులను ఆశ్రయించారు. పిళ్లా వారసులతో కూడా హక్కు విడుదల పత్రాలపై సంతకాలు చేయించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పట్లో మధురవాడ ఏసీపీగా పని చేస్తున్న దాసరి రవిబాబుకు ఈ వివాదం గురించి తెలిసింది.
రవిబాబు రంగప్రవేశం : వెంటనే రంగంలోకి దిగిన రవిబాబు వివాదాన్ని సెటిల్ చేస్తానని సాప్ట్‌వేర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి పీఎంపాలెం సీఐ అప్పలరాజు, ఎస్సై దివాకర్‌లపై ఒత్తిడి తెచ్చి.. పిళ్లా వారసులపై వేధింపులు ప్రారంభించాడు. అంతేకాకుండా ఏసీపీ తరఫున దళారులుగా వ్యవహరించిన పట్నాయక్, శ్రీనులు కూడా రెచ్చిపోయారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏజెంట్లలో ఒకరైన కాటుపల్లి అప్పారావుతో పీఎంపాలెంలో తప్పుడు ఫిర్యాదు చేయించి కేసులు బనాయించారు. పిళ్లా వారసులైన ఈశ్వరరావు, హిమాలయ, కనకరాజుల ఇళ్లకు చీటికిమాటికి వెళ్లి బెదిరించడం.. స్టేషన్‌కు పిలిపించి చితకబాదడం చేసేవారు. అయినా సరే సంతకాలు పెట్టేందుకు వారు అంగీకరించలేదు.
లొంగకపోవడంతో కొత్త స్కెచ్ : వారసులు లొంగకపోవడం.. సాప్ట్‌వేర్ కంపెనీ నుంచి ఒత్తిడి పెరగడంతో రవిబాబు మరో స్కెచ్ వేశాడు. నాగోతి లక్ష్మణరావు చేయించుకున్న మొదటి రిజిస్ట్రేషన్ (దస్తావేజు. 5053 / 2007)ను 2015 ఏప్రిల్ 9న రద్దు చేయించి, మళ్లీ అదే వ్యక్తులతో విశాఖకు చెందిన కొల్లి కృష్ణచౌదరికి దస్తావేజు నెం.2487/ 2015తో జనరల్ పవర్ రిజిస్ట్రీ చేయించాడు. ఆయన ద్వారా సాప్ట్‌వేర్ కంపెనీకి కట్టబెట్టాలన్నది ఆయన ప్లాన్. ఈ దస్తావేజులో కనీసం సాక్షులుగానైనా సంతకాలు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. చివరికి భర్తలేని పిళ్లా వెంకటలక్ష్మిపై మూడు కేసులు బనాయించి జైలు పాల్జేశారు. పోతిన భారతిపై రెండు, పిళ్లా హిమాలయపై మూడు కేసులు నమోదు చేశారు. అయినా వారు బెదరలేదు. తన మాట చెల్లలేదన్న అక్కసుతో హిమాలయ, కనకరాజులపై రవిబాబు ఏకంగా రౌడీషీట్ తెరిచాడు.
బదిలీ అయినా ఆగని వేధింపులు : రవిబాబు బదిలీ అయిన తర్వాత కూడా వీరిపై వేధింపులు ఆగలేదు. తన అనుచరులైన పట్నాయక్, శ్రీనుల ద్వారా రవిబాబు వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రహరీ నిర్మించిన సాప్ట్‌వేర్ కంపెనీ కానీ, ఆ తర్వాత రవిబాబు ప్రోద్భలంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కొల్లి కృష్ణచౌదరి గానీ ఏనాడు ఈ స్థలంలో అడుగు పెట్టలేదు. కానీ పట్నాయక్ మాత్రం ఈ స్థలంలోకి చొరబడి ఏకంగా తన పేరిట విద్యుత్ మీటర్ కూడా వేయించేసేకున్నాడు. స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేకపోయినా మామూళ్లు ముట్టజెప్పి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ క నెక్షన్ వేయించుకున్నాడు. ఎప్పటికైనా ఈ స్థలం తమదేనన్న భావనతో తరచూ వీర్ని వేధింపులకు గురిచేస్తూనే ఉన్నాడు. హత్య కేసులో రవి బాబు అరెస్ట్ కావడంతో ఇప్పటికైనా తమకు విముక్తి క ల్పించాలని, తమ భూమి తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
హెచ్‌ఆర్‌సీని కూడా ఆశ్రయించాం
హక్కు విడుదల పత్రాలపై సంతకాలు పెట్టలేదన్న అక్కసుతో నాపైన, నా సోదరుడిపైన రౌడీషీట్ తెరిచారు. చిత్రహింసలకు గురి చేశారు. ఎన్నోసార్లు రవిబాబే నేరుగా మమ్మల్ని పిలిపించి వార్నింగ్‌లు ఇచ్చేవారు. సంతకాలు చేయకపోతే అంతు చూస్తానని బెదిరించేవారు. దాంతో ఏసీపీ, సీఐ, ఎస్సైలపై హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు కూడా చేశాం.– పిళ్లా హిమాలయ
నిద్రలేని రాత్రులెన్నో గడిపాం
కోట్ల విలువైన మా స్థలాన్ని కొట్టేయాలని రవిబాబు యత్నించాడు. సాప్ట్‌వేర్ కంపెనీ నుంచి రూ.కోటి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు తెలిసింది. ఎలాగైనా కాజేసి సాప్ట్‌వేర్ కంపెనీకి కాకపోతే మరో కంపెనీకి అమ్మేయాలని ప్రయత్నించాడు. ఆ ఒత్తిళ్లతో నిద్రలేని రాత్రులెన్నో గడిపాం. నిత్యం మానసిక క్షోభకు గురవుతున్నాం. – పిళ్లా కనకరాజు
Comments
Please login to add a commentAdd a comment