
అనంతపురం (శ్రీకంఠం సర్కిల్): అనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న భవ్యశ్రీ సోమవారం మధ్యాహ్నం కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. వన్‌టౌన్ సీఐ రవిశంకరరెడ్డి కథనం ప్రకారం.. కదిరి పట్టణానికి చెందిన జ్యోతి, సాంబశివుడు దంపతుల కుమార్తె భవ్యశ్రీ అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.
తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉండటంతో భవ్యశ్రీ స్థానిక అంబార్ వీధిలో అమ్మమ్మ వద్ద ఉంటూ కళాశాలకు వెళ్లి వస్తోంది. ఒంటరినైపోయానన్న ఆవేదన కొద్దిరోజులుగా భవ్యశ్రీలో నాటుకుపోయింది. మరోవైపు ఫీజుల విషయమై కళాశాల యాజ మాన్యం భవ్యశ్రీని మందలించినట్లు తెలిసింది. ఫీజు డబ్బు మొత్తం కడితేనే రికార్డులు ఇస్తామని బెదిరించింది. ఈ నేపథ్యంలో ఉదయాన్నే ఆ విద్యార్థిని కళాశాల భవనంపైకి చేరుకుంది.
మధ్యాహ్నం వరకు ఆమెను ఎవరూ గుర్తించలేదు. మధ్యాహ్నం 12.30 గంటలకు భవనంపై నుంచి కిందకు దూకింది. అది చూసిన విద్యార్థులు హుటాహుటిన 108 వాహనంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాలకు చేరుకుని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘం నేత ఆకుల రాఘవేంద్రతో పాటు పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment