నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సందీప్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరం బుధవారపేటలో నివాసం ఉంటున్న మహానంది, సరస్వతి దంపతుల కుమారుడు సందీప్ స్థానిక నారాయణ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లిన సందీప్‌ను తరగతి గదిలో మ్యాథ్స్ లెక్చరర్ మందలించినట్లు తెలిసింది.
తోటి విద్యార్థుల ఎదుట చోటు చేసుకున్న ఘటనతో విద్యార్థి తీవ్ర మనోవేదనకు లోనైనట్లు సమాచారం. రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి చేరుకోగా.. అప్పటికి ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంలో కళాశాల ప్రేమయం లేదని చెప్పించేందుకు పెద్ద ఎత్తున పైరవీలు జరిగినట్లు తెలుస్తోంది.
రాత్రి నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు మధ్యవర్తిగా ఈ పంచాయితీ జరిగినట్లు సమాచారం. చివరకు.. తమ కుమారుడు అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు తెలిపారు. ఇదిలాఉంటే గత ఏడాది నన్నూరు సమీపంలోని నారాయణ బ్రాంచ్‌లోనే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది సమయంలో చోటు చేసుకున్న రెండు ఘటనలు కార్పొరేట్ కళాశాలల్లో ఒత్తిళ్లకు అద్దం పడుతోంది.