ధనలక్ష్మిపురంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఉద్యోగులను నిలదీస్తున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు
నెల్లూరు రూరల్: హాస్టల్‌లో ఆహారం సరిగా లేదని బయట నుంచి పార్శిళ్లు తెచ్చుకున్న ఇంటర్ విద్యార్థులను నారాయణ జూనియర్ కాలేజీ సిబ్బంది చితకబాదారు. కాళ్లతో తన్ని కర్రలతో కొడుతూ విచక్షణా రహితంగా ప్రవర్తించడంతో ఇద్దరు విద్యార్థులు స్పృహ కోల్పోయారు. నెల్లూరులోని ధనలక్ష్మీపురం నారాయణ కళాశాల హాస్టల్‌లో ఈ దారుణం వెలుగులోకి రావడంతో కోపోద్రిక్తులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
ఆకలేస్తోందని వేడుకున్నా..
నారాయణ హాస్టల్‌లో ఎంసెట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న నెల్లూరు, కావలి, తిరుపతి ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు సోమవారం రాత్రి భోజనం సరిగా లేదని బయట నుంచి ఆహారాన్ని తేవడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. విద్యార్థుల వద్ద ఆహార పొట్లాలను లాక్కుని పక్కన పడేశారు.
ఈ విషయం తెలియడంతో మరికొందరు విద్యార్థులు అక్కడకు చేరుకుని ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో ఆకలిగా ఉన్నందున బయట నుంచి తెప్పించుకున్నామని, పార్శిళ్లు ఇవ్వాలని కోరారు. ఇందుకు నిరాకరించిన సెక్యూరిటీ సిబ్బంది కళాశాల ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న నారాయణ సిబ్బంది బయట నుంచి ఆహారం ఎలా తెప్పించుకుంటారంటూ విద్యార్థులపై రెచ్చిపోయారు.
కాళ్లతో తన్ని కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. కొందరు విద్యార్థులు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం అక్కడకు చేరుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పిల్లలను విచక్షణా రహితంగా చావబాదడం ఏమిటని నిలదీశారు.
అనంతరం అక్కడకు చేరుకున్న నారాయణ విద్యాసంస్థల ఉన్నత ఉద్యోగులు తప్పు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని బుజ్జగించారు.
విషయాన్ని గోప్యంగా ఉంచాలని వేడుకున్నారు. పది రోజుల్లో ఎంసెట్ పరీక్ష ఉన్నందున చేసేదేమీ లేక తల్లిదండ్రులు మెత్తబడ్డారు. దీనిపై నారాయణ విద్యాసంస్థల ఏజీఎం పద్మారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా బయట నుంచి ఆహారం తెస్తే ఫుడ్ పాయిజన్ అవుతుందనే ఉద్దేశంతో ఆహార పొట్లాలను పక్కన పెట్టిన మాట వాస్తవమేనన్నారు. విద్యార్థులపై ఎలాంటి దాడి జరగలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment