దివాన్‌చెరువు (రాజానగరం), న్యూస్‌లైన్ : ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ మహమ్మారి విజృంభించింది. సీనియర్ల ధాటికి సుమారు 20 మంది జూనియర్ విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజమండ్రి కేంద్రంగా నారాయణ జూనియర్ కాలేజి నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఎంఈసీ బ్రాంచిని దివాన్ చెరువులో ఏర్పాటు చేసిన రెండు భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఓ భవనంలో తరగతులు, మరో భవనాన్ని విద్యార్థుల హాస్టల్‌గా వాడుతున్నారు. హాస్టల్ పైఅంతస్తులో జూనియర్లు, గ్రౌండ్ ఫ్లోర్‌లో సీనియర్లు ఉంటున్నారు. కొందరు సీనియర్లు కొంతమంది జూనియర్లను ర్యాగింగ్ చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. అర్ధరాత్రి నీళ్లు తీసుకురావాలని, వారి ఎంగిలి కంచాలు కడగాలని, మోకాళ్లపై కుర్చోమని చెప్పి పిడిగుద్దులు కురిపించడం వంటి చేష్టలకు సీనియర్లు పాల్పడుతున్నారు.
ఒకరిద్దరు అధ్యాపకులు సీనియర్లను మందలించేందుకు ప్రయత్నించినప్పటికీ, వారిపై కూడా తిరగబడడంతో అధ్యాపకులు మిన్నకుండిపోయారు. దీంతో సీనియర్ల వేధింపులపై బాధితులు కళాశాల ప్రిన్సిపాల్‌కి, ఇతర అధ్యాపకులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల్లో కళాశాలను వదిలి వెళ్లనున్న సీనియర్ విద్యార్థులు.. సుమారు 60 మంది జూనియర్లపై శనివారం రాత్రి జులుం ప్రదర్శించారు. డూప్లికేట్ తాళంతో గేటు తెరిచి, పైఅంతస్తులో ఉన్న జూనియర్లను నిద్ర లేపి, గోడ కుర్చీలు, మోకాళ్లపై నిలబడాలంటూ హుకుం జారీ చేశారు. సీనియర్లంటే చులకనగా ఉందా అంటూ దుర్భాషలాడుతూ.. జూనియర్లపై పిడిగుద్దులు కురిపించి, కాళ్లతో తన్నారు. అంతటితో ఆగకుండా తెల్లారిన తర్వాత కూడా గొడవకు రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సుమారు 20 మంది జూనియర్ విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో.. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.
ఇంటర్ సెకండియర్ చదువుతున్న సీనియర్లు తమపై అమానుషంగా ప్రవర్తించేవారని జూనియర్లు ఆరోపించారు. ‘ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేస్తే ఏం చేస్తారు, హాల్ టికెట్ ఇవ్వరు, అంతేకదా!’ అంటూ కాళ్లతో తన్నేవారన్నారు. పరీక్షలు వస్తున్నాయని, కొట్టకండని జూనియర్లు ప్రాథేయపడినా, వైద్య చేయించుకుని పరీక్షలు రాయవచ్చులే అని సీనియర్లు దౌర్జన్యం చేసే వారన్నారు. ఐదు, పది రూపాయలు అప్పు తీసుకోవడం, తిరిగి అడిగితే దుర్భాషలాడి, కొట్టేవారన్నారు. విషయం తెలుసుకున్న బొమ్మూరు పోలీసులు సంఘటన ప్రాంతానికి వచ్చి, ఐదుగురు విద్యార్థులను తమ వెంట తీసుకువెళ్లినట్టు తెలిసింది.
ఈ కళాశాల ప్రాంగణంలో ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందనడానికి నిదర్శనంగా.. హాస్టల్‌లోని కొన్ని గదుల్లో రక్తపు మరకలు, చెల్లాచెదురైన పుస్తకాలు, దుస్తులు, సామగ్రి దర్శనమిచ్చాయి. విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి కళాశాలకు, హాస్టల్‌కు చేరుకుని, తమ పిల్లల యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కళాశాలను నిర్వహించాలని, లేకుంటే వేరే కళాశాలలో తమ పిల్లలను చేర్పించాల్సి వస్తుందని ప్రిన్సిపాల్‌ని హెచ్చరించి నట్టు తెలిసింది.
ర్యాగింగ్ కాదు.. అల్లరే.. : ప్రిన్సిపాల్
ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ వెంకట్రామరెడ్డిని వివరణ కోరగా, ఇది ర్యాగింగ్ కాదంటూ కొట్టివేశారు. విద్యార్థుల మధ్య ఉన్న శత్రుత్వమే ఈ అల్లరికి కారణమన్నారు. ర్యాగింగ్‌పై విద్యార్థులను చైతన్యపరుస్తూ సదస్సులు నిర్వహించే అవసరం తమకు రాలేదన్నారు. దీనిపై బొమ్మూరు సీఐ సాయిరమేషన్‌ను వివరణ కోరగా కళాశాల వార్షికోత్సవం రోజున విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణే ఇందుకు కారణమని, ఇది పెద్ద విషయం కాదన్నారు. ఎన్నికల హడావుడిలో తాము బిజీగా ఉన్నామన్నారు.
జూనియర్లపై రెచ్చిపోయిన సీనియర్లు
Published Mon, Mar 17 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
Advertisement
Advertisement