మీసాలు, గెడ్డాలు పెంచుకోవద్దు... బూట్లు వేసుకోవద్దు
మేం చెప్పిన యాప్‌లే డౌన్‌లోడ్ చేసుకోవాలి
జూనియర్లను వేధిస్తున్న సీనియర్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఇటీవల కళాశాలలో చేరిన జూనియర్ (ఫ్రెషర్స్)ను సీనియర్లు వేధించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు కొందరు తమ తల్లిదండ్రుల ద్వారా కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. దీనిపై అధికారులు అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
కర్నూలు మెడికల్ కాలేజీలో ఈ నెల 14వ తేదీ నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. తరగతి గదుల్లోకి కొందరు సీనియర్ విద్యార్థులు గుంపులుగా వచ్చి ర్యాగింగ్ చేస్తున్నట్లు సమాచారం. ‘జూనియర్ విద్యార్థులు బూట్లు వేసుకురాకూడదు. మీసాలు, గెడ్డాలు పెంచుకోవద్దు. మేం చెప్పిన యాప్‌లనే స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మేము చెప్పినట్లు నడుచుకోవాలి...’ అని వివిధ రకాలుగా బెదిరించినట్లు తెలిసింది. కళాశాలలోని హాస్టల్‌లో సైతం మెస్‌కు వెళ్లి తమకు భోజనం తీసుకురావాలని, ప్లేట్లు కడగాలని హుకుం జారీ చేస్తున్నట్లు సమాచారం. కొందరు సీనియర్ వైద్య విద్యార్థులు హాస్టల్‌లోనే సిగరెట్లు, మద్యం తాగుతున్నారని తెలిసింది. ఈ విషయాలపై విచారణ చేసేందుకు అధికారులు హాస్టల్ గేటు వద్దకు వెళ్లగానే వారికి సమాచారం అందుతుందని, అప్రమత్తం అవుతున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment