72 కి.మీ. 75 స్పీడ్‌బ్రేకర్లు | - | Sakshi
Sakshi News home page

72 కి.మీ. 75 స్పీడ్‌బ్రేకర్లు

Published Fri, Oct 25 2024 2:08 AM | Last Updated on Fri, Oct 25 2024 3:00 PM

-

ఆత్మకూరు – కర్నూలు మార్గంలో స్పీడ్‌బ్రేకర్లతో బేజారు

నిత్యం 28 వేల మంది బస్సుల్లో ప్రయాణం

ప్రయాణమంతా కుదుపులతో అవస్థలు

వెన్నునొప్పులతో ఆస్పత్రిపాలు కావాల్సిందే

రహదారులపై ప్రమాదాలకు అతి వేగమే కారణం. అలాంటి వేగాన్ని నిరోధించడానికి ప్రధాన రహదారుల్లో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడు ఆ స్పీడు బ్రేకర్లే ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న స్పీడ్‌బ్రేకర్ల కారణంగా ప్రయాణం నరకప్రాయంగా మారడంతో పాటు ప్రయాణికులకు వెన్నునొప్పి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.

పాములపాడు: ఆత్మకూరు నుంచి కర్నూలు పట్టణానికి 72 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలో దాదాపు 75 స్పీడ్‌బ్రేకర్లను ఏర్పాటుచేశారు. వేగ నిరోధకాలైన ఈ స్పీడుబ్రేకర్లు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. స్పీడ్‌బ్రేకర్ల వల్ల ఏర్పడే కుదుపులతో వెన్నునొప్పుల బారిన పడుతున్నారు.

ప్రతి రోజు 35 సర్వీసులు
ఆత్మకూరు ఏపీఎస్‌ ఆర్టీసీ డిపో నుంచి 15 బస్సు సర్వీసులు, నందికొట్కూరు డిపో నుంచి 20 బస్సు సర్వీసులు ప్రతి రోజు కర్నూలుకు నడుస్తున్నాయి. అలాగే కర్నూలు డిపోతో పాటు డోన్‌, ఆదోని, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం డిపోల నుంచే గాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి ప్రతిరోజు 25కు పైగా బస్సు సర్వీసులు, అలాగే శ్రీశైలం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులు కొనసాగుతున్నాయి. ఆత్మకూరు నుంచి ఆర్డినరీ 26 సింగిల్స్‌, ఎక్స్‌ప్రెస్‌ 10 సింగిల్స్‌ చొప్పున ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. 

నందికొట్కూరు నుంచి 14 సింగిల్స్‌ చొప్పున సర్వీసులు నడుస్తున్నాయి. ప్రతి రోజు సుమారు 28 వేలకు పైగా ప్రయాణికులు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆత్మకూరు నుంచి కర్నూలుకు ఆర్డినరీ 26 చోట్ల, ఎక్స్‌ప్రెస్‌ 10 చోట్ల స్టేజీలున్నాయి. ఈ స్టేజీల్లో బస్సులను తప్పనిసరిగా నిలపాల్సిందే. అలాగే ప్రయాణికులు చేయిఎత్తిన చోట బస్సులను నిలపాల్సిందే. ప్రస్తుతం నేషనల్‌ హైవే పనులు జరుగుతున్న నేపథ్యంలో స్పీడు బ్రేకర్లతో పాటు పలు చోట్ల మలుపుల వల్ల సమయానికి చేరుకోలేకపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.

ప్రయాణమంతా కుదుపులే!
72 కిలోమీటర్ల ప్రయాణంలో రోడ్డుపై గుంతలతోపాటు 75 స్పీడు బ్రేకర్లు ఉండటంతో బస్సులో కుదుపులు తప్పనిసరి. వెనక సీట్లలో కూర్చున్న వారి పరిస్థితి దయనీయం. ఈ కుదుపులకు కూర్చోలేక కొందరు నిలబడి ప్రయాణం చేయడం మేలని భావిస్తున్నారు. వృద్ధులు, అనారోగ్యం బారిన పడిన వారు, గర్భిణుల పరిస్థితి అగమ్యగోచరం. ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్లు, డ్రైవర్ల పరిస్థితి కూడా అంతే. ప్రయాణికులు ఒకసారి వెళ్లి రావడానికే ఇలాంటి పరిస్థితులు ఉంటే రోజు 26 సార్లు తిరిగే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల పరిస్థితి చెప్పనలివికానిది. 

కుదుపుల వల్ల చాలా మంది వెన్నునొప్పుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న వారు కార్లలో ప్రయాణాలు చేస్తున్నారు. సామాన్యులకు మాత్రం ఆర్టీసీ బస్సే శరణ్యం. ఉన్నతాధికారులు ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి రోజు కర్నూలు నుంచి వందల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు విధుల నిమిత్తం ఈ మార్గంలో ప్రయాణాలు సాగిస్తున్నారు. వారి భాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి.

నెలకు ఒకసారి వెళ్లడానికే నరకం చూస్తున్నాం
నేను ప్రతి నెలా ఆసుపత్రి చికిత్స కోసం కర్నూలుకు వెళ్తాను. ఒక్కసారి వెళ్లిరావడానికే స్పీడు బ్రేకర్లతో అవస్థలు పడుతున్నాను. బస్సులో కూ ర్చుంటే ముందు సీట్లో కూర్చోవాలి, ఖాళీ లేకుంటే నిలబడి వెళ్లాల్సిందే. వెనక సీట్లో కూర్చుంటే ప్రస్తుతం ఉన్న రోగంతో పాటు మరో రోగం బారిన పడాల్సిందే. 
– గఫూర్‌, పాములపాడు

కర్నూలుకు పోకున్నా బాగుంటుంది
బస్సులో వెళ్లేదాని కంటే కర్నూలుకు పోకపోయినా బాగుంటుంది. అదెక్కడి స్పీడు బ్రేకర్లు దారి పొడవునా కుదుపులే. ఏదో ప్రమాదకరమైన చోటంటే సరే. కర్నూలకు పోయి వస్తే నొప్పుల మాత్రలు వేసుకోవాల్సిందే. బస్సులో బాలింతలు, గర్భిణులను చూస్తుంటే బాధగా ఉంటోంది. స్పీడు బ్రేకర్లను తగ్గిస్తే మంచిది. 
– రమాదేవి, బానకచెర్ల

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement