speed brakes
-
72 కి.మీ. 75 స్పీడ్‌బ్రేకర్లు
రహదారులపై ప్రమాదాలకు అతి వేగమే కారణం. అలాంటి వేగాన్ని నిరోధించడానికి ప్రధాన రహదారుల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడు ఆ స్పీడు బ్రేకర్లే ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న స్పీడ్‌బ్రేకర్ల కారణంగా ప్రయాణం నరకప్రాయంగా మారడంతో పాటు ప్రయాణికులకు వెన్నునొప్పి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.పాములపాడు: ఆత్మకూరు నుంచి కర్నూలు పట్టణానికి 72 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలో దాదాపు 75 స్పీడ్‌బ్రేకర్లను ఏర్పాటుచేశారు. వేగ నిరోధకాలైన ఈ స్పీడుబ్రేకర్లు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. స్పీడ్‌బ్రేకర్ల వల్ల ఏర్పడే కుదుపులతో వెన్నునొప్పుల బారిన పడుతున్నారు.ప్రతి రోజు 35 సర్వీసులుఆత్మకూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుంచి 15 బస్సు సర్వీసులు, నందికొట్కూరు డిపో నుంచి 20 బస్సు సర్వీసులు ప్రతి రోజు కర్నూలుకు నడుస్తున్నాయి. అలాగే కర్నూలు డిపోతో పాటు డోన్, ఆదోని, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం డిపోల నుంచే గాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి ప్రతిరోజు 25కు పైగా బస్సు సర్వీసులు, అలాగే శ్రీశైలం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులు కొనసాగుతున్నాయి. ఆత్మకూరు నుంచి ఆర్డినరీ 26 సింగిల్స్, ఎక్స్‌ప్రెస్ 10 సింగిల్స్ చొప్పున ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. నందికొట్కూరు నుంచి 14 సింగిల్స్ చొప్పున సర్వీసులు నడుస్తున్నాయి. ప్రతి రోజు సుమారు 28 వేలకు పైగా ప్రయాణికులు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆత్మకూరు నుంచి కర్నూలుకు ఆర్డినరీ 26 చోట్ల, ఎక్స్‌ప్రెస్ 10 చోట్ల స్టేజీలున్నాయి. ఈ స్టేజీల్లో బస్సులను తప్పనిసరిగా నిలపాల్సిందే. అలాగే ప్రయాణికులు చేయిఎత్తిన చోట బస్సులను నిలపాల్సిందే. ప్రస్తుతం నేషనల్ హైవే పనులు జరుగుతున్న నేపథ్యంలో స్పీడు బ్రేకర్లతో పాటు పలు చోట్ల మలుపుల వల్ల సమయానికి చేరుకోలేకపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.ప్రయాణమంతా కుదుపులే!72 కిలోమీటర్ల ప్రయాణంలో రోడ్డుపై గుంతలతోపాటు 75 స్పీడు బ్రేకర్లు ఉండటంతో బస్సులో కుదుపులు తప్పనిసరి. వెనక సీట్లలో కూర్చున్న వారి పరిస్థితి దయనీయం. ఈ కుదుపులకు కూర్చోలేక కొందరు నిలబడి ప్రయాణం చేయడం మేలని భావిస్తున్నారు. వృద్ధులు, అనారోగ్యం బారిన పడిన వారు, గర్భిణుల పరిస్థితి అగమ్యగోచరం. ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్లు, డ్రైవర్ల పరిస్థితి కూడా అంతే. ప్రయాణికులు ఒకసారి వెళ్లి రావడానికే ఇలాంటి పరిస్థితులు ఉంటే రోజు 26 సార్లు తిరిగే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల పరిస్థితి చెప్పనలివికానిది. కుదుపుల వల్ల చాలా మంది వెన్నునొప్పుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న వారు కార్లలో ప్రయాణాలు చేస్తున్నారు. సామాన్యులకు మాత్రం ఆర్టీసీ బస్సే శరణ్యం. ఉన్నతాధికారులు ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి రోజు కర్నూలు నుంచి వందల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు విధుల నిమిత్తం ఈ మార్గంలో ప్రయాణాలు సాగిస్తున్నారు. వారి భాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి.నెలకు ఒకసారి వెళ్లడానికే నరకం చూస్తున్నాంనేను ప్రతి నెలా ఆసుపత్రి చికిత్స కోసం కర్నూలుకు వెళ్తాను. ఒక్కసారి వెళ్లిరావడానికే స్పీడు బ్రేకర్లతో అవస్థలు పడుతున్నాను. బస్సులో కూ ర్చుంటే ముందు సీట్లో కూర్చోవాలి, ఖాళీ లేకుంటే నిలబడి వెళ్లాల్సిందే. వెనక సీట్లో కూర్చుంటే ప్రస్తుతం ఉన్న రోగంతో పాటు మరో రోగం బారిన పడాల్సిందే. – గఫూర్, పాములపాడుకర్నూలుకు పోకున్నా బాగుంటుందిబస్సులో వెళ్లేదాని కంటే కర్నూలుకు పోకపోయినా బాగుంటుంది. అదెక్కడి స్పీడు బ్రేకర్లు దారి పొడవునా కుదుపులే. ఏదో ప్రమాదకరమైన చోటంటే సరే. కర్నూలకు పోయి వస్తే నొప్పుల మాత్రలు వేసుకోవాల్సిందే. బస్సులో బాలింతలు, గర్భిణులను చూస్తుంటే బాధగా ఉంటోంది. స్పీడు బ్రేకర్లను తగ్గిస్తే మంచిది. – రమాదేవి, బానకచెర్ల -
యే భాయ్!.. జర దేఖ్కే సెలో!
తోటి మనిషి కంటే చేతిలో ఫోన్ మంచి కంపెనీ అనుకునే జనాభాకేం తక్కువ లేదు. దాదాపు ఓ ఏడాది కిందట అమీర్‌పేట్ మెయిన్‌రోడ్‌పై డ్రైవ్ చేస్తుంటే ఉన్నట్టుండి ఓ మనిషి ప్రపంచంతో సంబంధం లేకుండా రోడ్డు దాటుతున్నాడు. ముందు వెనుక వాహనాలున్నాయన్న స్పృహ ఏ మాత్రం లేదు. పళ్లు బిగబట్టి బ్రేకు తొక్కిపట్టి చూద్దును కదా..! కళ్లకు నిజం కనబడింది. సారు ఫోన్ పట్టుకుని మాట్లాడుతూ తాపీగా రోడ్డు దాటుతున్నాడు. మన మహానగరంలో మామూలు రోడ్డు దాటడమే కష్టమనుకుంటే.. ఇక ప్రధాన రహదారులు దాటడం అంటే గమనంలో కదనం కంపల్సరీ. ఒకదాని వెనుక ఒకటి బారులు తీరిన వాహనాల మధ్య సందు వెతక్కోవడం ఒక కష్టం. చిన్న ఖాళీ దొరికిందని అడుగు ముందుకేస్తే, ఆ సందులోకి దూసుకుచ్చే వాహనాలు మనకు స్పీడ్ బ్రేకులు వేస్తాయి. వాహనదారులను నొప్పింపక.. మనం నొవ్వక నడవడం అనేది ఓ కళ. రోడ్డు దాటడం అనే ఈ 65వ కళలో ప్రవేశం లేని వ్యక్తి సిటీ రోడ్డులో బిక్కచచ్చి ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అంతటి బ్రహ ్మవిద్యలాంటి ట్రాఫిక్ ఛేదనను ఇంత తేలిగ్గా తీసుకున్న ఈ మహానుభావుణ్ని చూసి జాలి, కోపం అన్నీ కలిగాయి. తమ ప్రాణాలకంటే ఫోన్‌కాల్‌కు అంత విలువిస్తున్నారని ఆశ్చర్యపోయాను. రాస్తా పే హల్‌సెల్.. ఆ రోజు నుంచి గమనించడం మొదలుపెట్టాను. రోడ్డు దాటుతున్న పది మందిలో కనీసం ఆరుగురు ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. ఈ సారి మీరూ చూడండి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మధ్యలో ఎంత మంది కనిపిస్తారో ! ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలరు. అవతల మాట్లాడుతున్న వ్యక్తి ఓ నిమిషం ఆగలేరా..? వాహన చోదకులకు మనం ఇబ్బంది కలిగిస్తున్నామన్న విషయం పక్కన పెడితే మన ప్రాణానికే ముప్పు ఉందని అర్థం కావడం లేదా..? ఒక్కోసారి అలాంటి వారిని ఆపి మరీ చెప్పాలనిపిస్తుంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఎలా వాడొద్దని హెచ్చరిస్తున్నామో..! అలా రోడ్డు దాటే టప్పుడు పాదచారులు కూడా ఫోన్ వాడొద్దని ప్రచారం మొదలుపెట్టాలి. ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ గురించిన ప్రచారం చేసే సమయం వచ్చేసింది. రోడ్డుపై నడుస్తున్నప్పుడు, బస్‌స్టాప్‌లో, బస్సులో, షాప్‌లో.. ఎక్కడపడితే అక్కడ చెవిలో ఇయర్ ఫోన్స్‌తో యువత దర్శనమిస్తోంది. పాటలు వింటూనో, రేడియో వింటూనో చుట్టూ ఏం జరుగుతుందో అన్న స్పృహ లేకుండా ఉంటున్నారు. హియర్.. హియర్.. మన పరిసరాలకు తగ్గట్టుగా అలెర్ట్‌గా ఉండటం చాలా ముఖ్యం. ప్రధానంగా అమ్మాయిలకు తమ చుట్టూ ఏం జరుగుతుందో అన్న అవగాహన ఉండాలి. వేధింపులకు గురయ్యే అవకాశాన్ని అన్యమనస్కంగా ఉంటే గుర్తించడం కష్టం. ఫోన్‌ను కేవలం వినోద సాధనంగా మార్చకుండా మన రక్షణకు ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు. ఇబ్బందికర సన్నివేశాల్లో ఫోన్లోని కెమెరా మనకు కొండంత అండగా నిలుస్తుంది. కొత్త కొత్త యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే ఈ తరంలో ఎంత మంది దగ్గర సిటీ పోలీస్ యాప్, హ్యాక్ ఐ ఉంది. ఫోన్లో ఉండే టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే ఈ తరంలో మనవంతు బాధ్యతను కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. రోడ్ దాటుతున్నప్పుడే కాదు బిల్ పే చేస్తున్నప్పుడు, వస్తువులు కొనేటప్పుడు.. చివరకు మనని ఎదుటి వ్యక్తి పలకరిస్తున్నప్పుడు కూడా చెవిలో జోరీగ మోగుతుండటం ఏం సంప్రదాయం. మన ఫోన్ వల్ల మనకే కాదు పక్కవాడికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. సెల్ హెల్ ఇటీవల ముంబైలో, ఇయర్ ఫోన్స్ మ్యూజిక్ హోరులో రోడ్డు దాటుతున్న యువతికి మృత్యు శక టం ఘంటికలు వినిపించక.. తన ప్రాణాలను ఆ వాహనానికి బలివ్వాల్సి వచ్చింది. అదేవిధంగా వస్తున్న రైలు కూత వినబడక చెవిలో ఇయర్ ఫోన్స్‌తో పాటే పరలోకానికి చేరుకున్న సంఘటనలు ఉత్తరభారతంలో చాలా జరిగాయి. పాటలైనా, మాటలైనా వినోదం వినోదమే. ప్రయాణం ప్రయాణమే, ప్రాణం ప్రాణమే. మన ఫోన్ మన చేతిలో ఉన్నట్టు మన భద్రత కూడా మన చేతిలోనే ఉంది. ‘హలో రోడ్ దాటుతున్నా మళ్లీ చేస్తా’ అనడం చాలా తేలిక. ట్రై చేయండి. -
‘ఆమ్నీ’స్పీడుకు బ్రేకులు
సాక్షి, చెన్నై : ఆమ్నీ బస్సుల అతివేగానికి బ్రేక్ వేయడానికి రవాణా శాఖ చర్యలు చేపట్టింది. మితి మీరిన వేగానికి పంచ సూత్రాల ఆంక్షలు విధిం చింది. ప్రతి 150 కి.మీ దూరానికి ఒక డ్రైవర్ మారాలన్న షరతు పెట్టింది. రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో అతి పెద్ద బస్ టెర్మినల్‌గా కోయంబేడు ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు నిత్యం ఉరకలు తీస్తుంటాయి. ఈ టెర్మినల్‌కు కూత వేటు దూరంలో ఆమ్నీ(ప్రైవేటు) బస్టాండ్ ఉంది. రాష్ట్రంలోని అన్ని నగరాలకు, పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు, పక్క రాష్ట్రాలైన బెంగళూరు, మైసూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కర్నూలు వంటి నగరాలకు ముంబై వంటి ఉత్తరాది నగరాలకు ఇక్కడి నుంచి ప్రతి రోజు బస్సులు వెళుతుంటాయి. ఓల్వో, హైటెక్, డీలక్స్, సూపర్, సెమి డీలక్స్ ఇలా ప్రైవేటు హంగులతో ఉండే ఈ బస్సుల్లో చార్జీలు వసతులకు తగ్గట్టుగానే ఉంటాయి. ఈ బస్సుల్ని ఆశ్రయించే వారి సంఖ్యా ఎక్కువే. మితిమీరిన వేగం సాయంత్రం సరిగ్గా ఏడు గంటలు దాటితే చాలు ఆమ్నీ బస్సులు రోఢ్డెక్కుతాయి. దక్షిణాది జిల్లాల వైపుగా వెళ్లే బస్సులు వండలూరు దాటితే చాలు వేగానికి అడ్డూ అదుపూ ఉండ దు. బెంగళూరు, పూందమల్లి హైవే మీద ఈ బస్సులు మెరుపు తీగల్లాగా ప్రయూణిస్తుంటా యి. ఉదయాన్నే గమ్యస్థానాలకు ప్రయాణికుల్ని చేర్చడం లక్ష్యంగా దూసుకెళ్లే ఈ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో ప్రయాణికులకు భద్రత కరువు అవుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ వద్ద, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలో ఓల్వో బస్సులు ప్రమాదానికి గురి కావడంతో అందులోని ప్రయాణికులు సజీవ దహనం అయ్యూరు. దీంతో రాష్ట్ర రవాణా శాఖ ముందస్తు చర్యల్లో పడింది. ప్రమాదాల నివారణా లక్ష్యంగా ఆమ్నీ యాజమాన్యాలతో చర్చలు జరిపింది. బస్సుల్లో, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. స్పీడ్‌కు బ్రేక్ ఆమ్నీ వేగాన్ని కట్టడి చేస్తూ ప్రధానంగా నిర్ణ యం తీసుకున్నారు. పంచ సూత్రాలతో కూడిన చిట్టాను రవాణా శాఖ వర్గాలు ప్రకటించాయి. గంటకు 80 కి.మీ మించి వేగంతో బస్సును నడిపేందుకు వీలు లేదు. బస్సు బయలు దేరేందు కు ముందుగా బస్సులోని సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్ల గురించి లఘు చిత్రాన్ని ప్రయాణికులకు ప్రదర్శించాలి. బస్సుల్లో ఎమర్జన్సీ డోర్లు ఎక్కడున్నాయో, అగ్నినిరోధక పరికరాలు ఉన్న ప్రదేశాలు, ఏ డోర్‌ను సుల భంగా పగుల కొట్టవచ్చో ప్రయాణికులకు వివరించాలి. ప్రమాదం జరిగిన పక్షంలో ఎలా తప్పించుకోవాలో తెలి యజేయూలి. డ్రైవర్లు మద్యం తాగి ఉన్నారా లేదా..? అని టోల్ ప్లాజాలు, చెక్ పోస్టుల్లో తని ఖీలు చేయించుకుని, అక్కడి సిబ్బంది సంతకం తీసుకోవాలి. ప్రతి 150 కి.మీ దూరానికి ఒక డ్రైవర్ మారాలి. 150 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయూణించే ప్రతి బస్సులోనూ ఇద్దరు డ్రైవర్లు తప్పని సరిగా ఉండాలి. రవాణా శాఖ నిబంధనల్ని ఏ ఒక్క ట్రావెల్స్ ఉల్లంఘించినా, బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. ఓల్వో బస్సులకు ప్రత్యేక ఆంక్షలు విధించారు. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో డీజిల్ ట్యాంక్ పేలడం ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు స్పష్టం చేస్తున్నారుు. దీంతో ఓల్వో బస్సుల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయాణికుల భద్రతకు తగ్గట్టుగా బస్సుల్ని తీర్చిదిద్దాలని సూచించారు. అమలు సాధ్యమే రవాణా శాఖ నిబంధనల్లో కొన్నింటిని ఇది వరకు ఆమ్నీ బస్సుల్లో పాటిస్తూ వస్తున్నామని ఆ బస్సుల యజమానుల సమాఖ్య నాయకుడు అఫ్జల్ పేర్కొన్నారు. మూడు నుంచి నాలుగు నిమిషాలతో కూడిని వీడియో టేపును అధికారులు తమకు ప్రదర్శించారన్నారు. ఇందులో భద్రతా చర్యల్ని వివరించారని, వీటిని తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. అన్ని బస్సుల్లో ఇద్దరు చొప్పున డ్రైవర్లు ఇప్పటికే ఉన్నారని పేర్కొంటూ, ఇక అన్ని బస్సుల్లోనూ ప్రభుత్వ నిబంధనలు పాటించి తీరుతామన్నారు.