యే భాయ్!.. జర దేఖ్‌కే సెలో!
తోటి మనిషి కంటే చేతిలో ఫోన్ మంచి కంపెనీ అనుకునే జనాభాకేం తక్కువ లేదు. దాదాపు ఓ ఏడాది కిందట అమీర్‌పేట్ మెయిన్‌రోడ్‌పై డ్రైవ్ చేస్తుంటే ఉన్నట్టుండి ఓ మనిషి ప్రపంచంతో సంబంధం లేకుండా రోడ్డు దాటుతున్నాడు. ముందు వెనుక వాహనాలున్నాయన్న స్పృహ ఏ మాత్రం లేదు. పళ్లు బిగబట్టి బ్రేకు తొక్కిపట్టి చూద్దును కదా..! కళ్లకు నిజం కనబడింది. సారు ఫోన్ పట్టుకుని మాట్లాడుతూ తాపీగా రోడ్డు దాటుతున్నాడు.
మన మహానగరంలో మామూలు రోడ్డు దాటడమే కష్టమనుకుంటే.. ఇక ప్రధాన రహదారులు దాటడం అంటే గమనంలో కదనం కంపల్సరీ. ఒకదాని వెనుక ఒకటి బారులు తీరిన వాహనాల మధ్య సందు వెతక్కోవడం ఒక కష్టం. చిన్న ఖాళీ దొరికిందని అడుగు ముందుకేస్తే, ఆ సందులోకి దూసుకుచ్చే వాహనాలు మనకు స్పీడ్ బ్రేకులు వేస్తాయి. వాహనదారులను నొప్పింపక.. మనం నొవ్వక నడవడం అనేది ఓ కళ. రోడ్డు దాటడం అనే ఈ 65వ కళలో ప్రవేశం లేని వ్యక్తి సిటీ రోడ్డులో బిక్కచచ్చి ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అంతటి బ్రహ ్మవిద్యలాంటి ట్రాఫిక్ ఛేదనను ఇంత తేలిగ్గా తీసుకున్న ఈ మహానుభావుణ్ని చూసి జాలి, కోపం అన్నీ కలిగాయి. తమ ప్రాణాలకంటే ఫోన్‌కాల్‌కు అంత విలువిస్తున్నారని ఆశ్చర్యపోయాను.
రాస్తా పే హల్‌సెల్..
ఆ రోజు నుంచి గమనించడం మొదలుపెట్టాను. రోడ్డు దాటుతున్న పది మందిలో కనీసం ఆరుగురు ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారు. ఈ సారి మీరూ చూడండి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మధ్యలో ఎంత మంది కనిపిస్తారో ! ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలరు. అవతల మాట్లాడుతున్న వ్యక్తి ఓ నిమిషం ఆగలేరా..? వాహన చోదకులకు మనం ఇబ్బంది కలిగిస్తున్నామన్న విషయం పక్కన పెడితే మన ప్రాణానికే ముప్పు ఉందని అర్థం కావడం లేదా..? ఒక్కోసారి అలాంటి వారిని ఆపి మరీ చెప్పాలనిపిస్తుంది.
డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఎలా వాడొద్దని హెచ్చరిస్తున్నామో..! అలా రోడ్డు దాటే టప్పుడు పాదచారులు కూడా ఫోన్ వాడొద్దని ప్రచారం మొదలుపెట్టాలి. ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ గురించిన ప్రచారం చేసే సమయం వచ్చేసింది. రోడ్డుపై నడుస్తున్నప్పుడు, బస్‌స్టాప్‌లో, బస్సులో, షాప్‌లో.. ఎక్కడపడితే అక్కడ చెవిలో ఇయర్ ఫోన్స్‌తో యువత దర్శనమిస్తోంది. పాటలు వింటూనో, రేడియో వింటూనో చుట్టూ ఏం జరుగుతుందో అన్న స్పృహ లేకుండా ఉంటున్నారు.
హియర్.. హియర్..
మన పరిసరాలకు తగ్గట్టుగా అలెర్ట్‌గా ఉండటం చాలా ముఖ్యం. ప్రధానంగా అమ్మాయిలకు తమ చుట్టూ ఏం జరుగుతుందో అన్న అవగాహన ఉండాలి. వేధింపులకు గురయ్యే అవకాశాన్ని అన్యమనస్కంగా ఉంటే గుర్తించడం కష్టం. ఫోన్‌ను కేవలం వినోద సాధనంగా మార్చకుండా మన రక్షణకు ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు. ఇబ్బందికర సన్నివేశాల్లో ఫోన్‌లోని కెమెరా మనకు కొండంత అండగా నిలుస్తుంది.
కొత్త కొత్త యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునే ఈ తరంలో ఎంత మంది దగ్గర సిటీ పోలీస్ యాప్, హ్యాక్ ఐ ఉంది. ఫోన్‌లో ఉండే టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకునే ఈ తరంలో మనవంతు బాధ్యతను కూడా అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉంది. రోడ్ దాటుతున్నప్పుడే కాదు బిల్ పే చేస్తున్నప్పుడు, వస్తువులు కొనేటప్పుడు.. చివరకు మనని ఎదుటి వ్యక్తి పలకరిస్తున్నప్పుడు కూడా చెవిలో జోరీగ మోగుతుండటం ఏం సంప్రదాయం. మన ఫోన్ వల్ల మనకే కాదు పక్కవాడికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత.
సెల్ హెల్
ఇటీవల ముంబైలో, ఇయర్ ఫోన్స్ మ్యూజిక్ హోరులో రోడ్డు దాటుతున్న యువతికి మృత్యు శక టం ఘంటికలు వినిపించక.. తన ప్రాణాలను ఆ వాహనానికి బలివ్వాల్సి వచ్చింది. అదేవిధంగా వస్తున్న రైలు కూత వినబడక చెవిలో ఇయర్ ఫోన్స్‌తో పాటే పరలోకానికి చేరుకున్న సంఘటనలు ఉత్తరభారతంలో చాలా జరిగాయి. పాటలైనా, మాటలైనా వినోదం వినోదమే. ప్రయాణం ప్రయాణమే, ప్రాణం ప్రాణమే. మన ఫోన్ మన చేతిలో ఉన్నట్టు మన భద్రత కూడా మన చేతిలోనే ఉంది. ‘హలో రోడ్ దాటుతున్నా మళ్లీ చేస్తా’ అనడం చాలా తేలిక. ట్రై చేయండి.