గ్రేట్ వే టూ అమెరికా.. ఐటీకి ‘మైత్రీ’వనమ్ | IT hub mythrivanam great way to USA | Sakshi
Sakshi News home page

గ్రేట్ వే టూ అమెరికా.. ఐటీకి ‘మైత్రీ’వనమ్

Published Wed, Jul 23 2014 1:15 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

గ్రేట్ వే టూ అమెరికా.. ఐటీకి ‘మైత్రీ’వనమ్ - Sakshi

గ్రేట్ వే టూ అమెరికా.. ఐటీకి ‘మైత్రీ’వనమ్

ఓ ఐటీ ఉద్యోగి గర్వంగా ఫీలవుతాడు తాను మైత్రీవనం బ్రీడ్‌నని. ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి నమ్మకం.. మైత్రీవనం వెళ్తే యూఎస్ స్టాంపింగ్‌కు డేట్ ఫిక్స్ చేసుకోవచ్చని. సిటీకి సంబంధించినంత వరకూ యునెటైడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్‌పేట్ యూఎస్‌ఏ అయితే.. అందులో ఓ ఆరంతస్తుల బిల్డింగ్.. గేట్ వే ఆఫ్ అమెరికాగా నిలిచింది. పాతికేళ్ల కిందట నగరానికి సైబర్ కనెక్టివిటీ అంటే ఏంటో తెలియని రోజుల్లో అది పురుడు పోసుకుంది. అదే.. మైత్రీవనం! లక్షలాది మంది కలలను నిజం చేస్తున్న భవనం!!
 
 పాతికేళ్ల కిందట చుట్టూ పచ్చదనం పరుచుకుని.. ఓ చెరువు నిండుగా కళకళలాడుతుండేది. ఆ పచ్చని పరిసరాల్లో వెలసిన ఓ భవంతికి అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులు ‘మైత్రీవనం’గా నామకరణం చేశారు. కొత్త భవిష్యత్తుకు నేనున్నానని ఊతమిచ్చే ఆ భవంతి చుట్టూ కాంక్రీట్ మేటలు పరుచుకున్నా.. ఆ మైత్రి మాత్రం చెక్కుచెదరలేదు. అమీర్‌పేటలోనే కాదు.. అమెరికాలోనూ తెలుగువారు సగర్వంగా చెప్పుకునే ఐటీ హబ్‌గా విరాజిల్లుతోంది.
 
ఫస్ట్ టర్న్ ఆన్ ఇక్కడే
 హైదరాబాద్‌లో మొదట కంప్యూటర్ ఆపరేట్ అయ్యింది ‘మైత్రీవనం’లోనే. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ (ఎస్టీపీ) పుట్టింది ఇక్కడే.  ఇప్పటి వరకు ఈ వనం నుంచి బయటకు వచ్చిన విద్యార్థుల సంఖ్య పది లక్షలకు పైమాటే. ఈ బిల్డింగ్‌లో దాదాపు యాభై ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఐటీ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకున్న ప్రతిఒక్కరూ ఇక్కడ అక్షరాభ్యాసం చేయాల్సిందే. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులకు మైత్రీవనం భరోసా ఇస్తుంది. కొత్త మిత్రులను పరిచయం చేస్తుంది. ఉదయం పదిన్నర సమయంలో ఈ బిల్డింగ్ లోనికి వెళ్లాలంటే ఓ పావుగంట వెయిట్ చేయాల్సిందే. క్లాసులు ముగించుకొని బయటకు వచ్చే విద్యార్థులతో బిల్డింగ్ పరిసరాలు తిరునాళ్లను తలపిస్తాయి. ఇక్కడ శిక్షణతో ఐటీ హబ్‌లో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.
 
అమీర్‌పేట్ టు అమెరికా
 ‘అమీర్‌పేట్ టు అమెరికా’ అనే మాట మైత్రీవనం వల్లే అంటారు ఇక్కడి వారు. ‘ ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు బిల్డింగ్ మొత్తం విద్యార్థులతో కిటకిటలాడుతుంటుంది. ఇక్కడే మూడు క్యాంటీన్లు, చిన్న సైజు షాపింగ్ మాల్స్, రైల్వే, ఎల్‌ఐసీ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి.  ఈ భవనంలో స్థలం లేక చుట్టుపక్కల సందుల్లో కూడా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వందలాదిగా వచ్చేశాయి’ అని చెప్పారు ‘మైత్రీవనం’ మెయింటెనెన్స్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ ఇంజనీర్ సరోజ.
 
 విదేశీ విద్యార్థులతో మైత్రి
మైత్రీవనం హైదరాబాదీలకో, ఇతర రాష్ట్రాల విద్యార్థులకో మాత్రమే నేస్తం కాదు.. ఇక్కడ ట్రైనింగ్ కోసం విదేశీ విద్యార్థులూ ఆసక్తి కనబరుస్తున్నారు. దాదాపు తొంభై దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారు. కోర్సుల ఫీజులు తక్కువగా ఉండటం, సౌకర్యవంతంగా ఉండటంతో ఇంజనీరింగ్ విద్యార్థులు మైత్రీవనానికి క్యూ కడుతున్నారు.  ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వడంలో మైత్రీవనం ఇన్‌స్టిట్యూట్లు నంబర్ వన్. అమెరికాలో ఏ కొత్త సాఫ్ట్‌వేర్ రిలీజ్ అయినా.. రోజుల వ్యవధిలోనే ఇక్కడికి వచ్చేస్తుంది. ‘ మార్కెట్ డిమాండ్‌ను బట్టి దూసుకెళ్లే ఇన్‌స్టిట్యూట్లకు మైత్రీవనం కేరాఫ్ అడ్రస్’ అని జూమ్ టెక్నాలజీకి చెందిన శివ చెప్పారు. ఇక కొండపల్లి శేషగిరిరావు వేసిన కళాఖండాలు ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణ.
 
 ఈ చెట్లూ కొట్టేస్తారట
మైత్రీవనం భవనం నిర్మించిన తొలినాళ్లలో ఇక్కడ ఇన్ని భవనాలు, ట్రాఫిక్ ఉండేది కాదు. దీని వెనుక ఒక చెరువు ఉండేది. బోలెడన్ని చెట్లుండేవి. ఇప్పుడు చెట్ల మాట దేవుడెరుగు.. అడుగు పెడదామంటే జానెడు భూమి కూడా లేదు. మెట్రో రైలు మార్గం పనులతో ఇప్పుడున్న నాలుగు చెట్లకూ కాలం చెల్లే పరిస్థితి ఏర్పడింది. మెట్రో గుర్తులు చూస్తున్నారుగా.. అదిగో ఆ తాటిచెట్టును కూడా కొట్టేస్తారట. దాని చుట్టూ అందంగా లాన్‌లా అలంకరించుకున్నాం. రేపో మాపో కూలిపోతుందంటే బాధగా ఉంది.‘మైత్రీ’ జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు కొందరు ఆ భవనం పరిధిలోని తాటిచెట్టు వద్దకొచ్చి ఫొటోలు తీయించుకుంటున్నారు.     
 - ఎన్.రామకోటేశ్వరరావు, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకుడు
 
 వానొచ్చెనంటే వరదే
 ఇన్ని ప్రత్యేకతలున్న మైత్రివనానికి ఓ మచ్చ. భవనం చుట్టూ కాంక్రిట్ జంగిల్ పెరిగిపోవడంతో నీటి బొట్టు ఇంకే దారిలేదు. వర్షాకాలంలో వరద నీరు చేరి సెల్లార్‌లోని వాహనాలు పడవల్లా మారిపోతుంటాయి. బిల్డింగ్ బయట రోడ్లు నాలాలను తలపిస్తాయి. ఈ ఇబ్బందులు పక్కన పెడితే మైత్రీవనం విద్యార్థుల కలలు తీర్చే చక్కటి వేదిక.
 -  భువనేశ్వరి
  ఫొటోలు: సృజన్ పున్నా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement