మీ శ్రేయోభిలాషి | Lake view police save their life | Sakshi
Sakshi News home page

మీ శ్రేయోభిలాషి

Published Tue, Dec 30 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

మీ శ్రేయోభిలాషి

మీ శ్రేయోభిలాషి

ఒక్క క్షణంలో కలిగే నమ్మకం జీవితాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తుంది. ఒక బలహీన క్షణంలో కలిగే అపనమ్మకం జీవితాన్ని బలవన్మరణం వైపు నడిపిస్తుంది. చావే పరిష్కారం అని ఆత్మహత్యకు యత్నించిన వారిలో చాలామందికి మృత్యువును చేరే దారిలో ఆ చావు ఎంత దుర్భరమో తెలుస్తుంది. బతకాలనే కోరికా పుడుతుంది. ఆఖరి క్షణం వరకూ ఆదుకునే చేయి అందకపోతుందా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి క్షణాల్లో మేమున్నాం అంటూ వస్తున్నారు సాగర్ లేక్ వ్యూ పోలీసులు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆదుకోవడమే కాదు.. వారికి బతుకుపై భరోసా కూడా కల్పిస్తున్నారు.
 - భువనేశ్వరి
 
 పోరాడుతాం..
 గత నెల 29న కొత్తగా పెళ్లయిన ఓ జంట ఆత్మహత్య చేసుకోవడానికి సాగర్‌కు వచ్చింది. ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి ఇద్దరూ నీళ్లలో దూకేశారు. వీరిని గమనించిన లేక్ వ్యూ పోలీసులు వెంటనే రెస్పాండయ్యారు. ఇద్దరినీ కాపాడారు. రమేష్, భానుప్రియ కులాంతర వివాహం చేసుకున్నారు. ఇంట్లో వాళ్లకు దూరంగా భద్రాచలం వెళ్లి ఉద్యోగం చేసుకుని బతుకుతున్నా పెద్దల పెత్తనం వీరిని వదిలిపెట్టలేదు. కలసి జీవించలేమనుకున్న ఈ జంట కలసి చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే లేక్ వ్యూ పోలీసుల పుణ్యాన వీరిద్దరూ బతికి బట్టకట్టారు. ‘పోలీసులు రక్షించిన తర్వాత చావలేకపోయామే అని బాధపడ్డాను. కానీ వారు కౌన్సెలింగ్ చేసిన తర్వాత మా ఆలోచన తీరులో మార్పు వచ్చింది. ఆత్మహత్య కంటే హీనమైన పని మరొకటి లేదని అర్థమైంది. మా సమస్యలపై పోరాటం చేస్తూ నిజమైన ప్రేమికుల్లా జీవిస్తున్నాం ఇప్పుడు’ అంటున్న రమేష్ మాటల్లో ధైర్యం, భానుప్రియ ముఖంలో ఆనందం కనిపించాయి.
 
 అవగాహన పెంచేందుకు...
హుస్సేన్‌సాగర్ ఆత్మహత్యలకు నెలవుగా మారిపోయింది. వారిని రక్షించడంతో పాటు, ఇలాంటి పనులు మళ్లీ చేయకుండా అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మాదే అని భావించి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నాం. వీరిని రక్షించడంలో భాగంగా మా పోలీసులు కూడా గాయాలపాలైన సందర్భాలున్నాయి. ఆత్మహత్య నేరమనే విషయాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తూ.. వాటి నివారణకు కావాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
 - జానకమ్మ, లేక్ వ్యూ పోలీస్ ఇన్‌స్పెక్టర్
 
 బతుకుపై భరోసా కోల్పోయిన వారికి ఎనీ టైం సూసైడ్ స్పాట్.. హుస్సేన్‌సాగర్. నగరం నడిబొడ్డున ఉన్న ఈ తటాకం లవ్ ఫెయిల్యూర్స్‌కు, చితికిపోయిన బతుకులకూ ప్రాణాలు తీసుకునే కాసారంగా మారింది. అర్ధాంతరంగా ప్రాణాలు వదులుకోవడానికి వచ్చిన వారి ప్రయత్నాన్ని అడ్డుకుని ఆయుష్షుపోస్తున్నారు సాగర్ లేక్‌వ్యూ పోలీసులు. ఇందు కోసం సాగర్ చుట్టూ 40 మంది లేక్ వ్యూ పోలీసులు పహారా కాస్తుంటారు. ఈ ఒక్క ఏడాదే 85 మందిని రక్షించారు. వీరందరినీ పిలిచి ట్యాంక్‌బండ్ ప్రాంతంలోనే ఒక బోట్‌లో అవగాహన సదుస్సు నిర్వహించారు.

 ఇప్పుడు హ్యాపీ..
 ఎంబీఏ ఫైనాన్స్ చేసిన స్వర్ణలతది మరో కథ. ఉన్నతంగా చదువుకున్నా.. అల్పంగా ఆలోచించి చనిపోవాలని సాగర్ తీరానికి వచ్చింది. చదువు, ఉద్యోగం తప్ప మరో మాట ఎత్తకూడదన్న తల్లిదండ్రుల ఆజ్ఞకు చావుతో సమాధానం చెప్పాలనుకుంది స్వర్ణలత. ఈ ఏడాది మే 19న సాగర్‌లో దూకింది. వెంటనే పోలీసులు రక్షించారు. ఆమె కష్టాన్ని విన్నారు. ఎలా బతకాలో చెప్పారు. ‘నాకు సామాజిక విషయాలపై ఆసక్తి ఎక్కువ. పది మందికి సాయం చేయాలనుకునే తత్వం. ఉద్యోగం కేవలం నా కోసమే కాదని అనుకునేదాన్ని. నా కన్నవారే నా ఆలోచనను వ్యతిరేకించడంతో భరించలేకపోయాను. కౌన్సెలింగ్ తర్వాత నా ఆలోచన ధోరణిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను’ అని వివరించింది స్వర్ణలత.
 
 పట్టుదల పెరిగింది..
 అత్తింటి వేధింపులు భరించలేక చావు తలుపు తట్టిన ఎందరో మహిళల్లో ముషీరాబాద్‌కు చెందిన భవాని ఒకరు. అనుక్షణం అనుమానించే తాగుబోతు భర్త, ఆడపిల్ల పుట్టిందని తన కొడుక్కు విడాకులు ఇవ్వాలన్న అత్త.. ఈ సమస్యలు భవానీకి చావే మార్గం అనుకునేలా చేశాయి. విడాకులు ఇవ్వకుంటే తనను, బిడ్డనూ చంపేస్తానని భర్త బెదిరించడంతో.. బిడ్డను తన తల్లిదండ్రులకు అప్పగించి చనిపోవాలని అనుకుంది. ‘గత నెల 26న సాగర్‌కు వచ్చి నీళ్లలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాను. కానీ పోలీసులు చూసి నన్ను రక్షించారు. ప్రాణాలు దక్కాయి కానీ నా సమస్య మాత్రం అలాగే ఉంది’ అంటూ వాపోయింది భవాని. అయితే కౌన్సెలింగ్ తర్వాత బతికి సాధించాలనే పట్టుదల కలిగిందని చెబుతోంది.
 
 మరెందరిలోనో..
 ప్రభుత్వం ఇచ్చిన స్థలం కబ్జాపాలై, అధికారులతో మొరపెట్టుకున్నా లాభం లేకపోవడంతో మెదక్ జిల్లాకు చెందిన షేక్ మహబూబ్, తోటి మహిళకు పూచీకత్తు ఇచ్చి.. అప్పులు మెడకు చుట్టుకుని పాలుపోక జీవకళ, బస్తీ లీడర్ వేధింపులు భరించలేక.. ఇంట్లో వారితో చెప్పుకోలేక అనిత.. వీరంతా సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్న వాళ్లే. వీరందరినీ రక్షించిన లేక్ వ్యూ పోలీసులు.. వారికి పునర్జన్మ ప్రసాదించారు. కౌన్సెలింగ్ నిర్వహించి బతుకు పోరులో ముందుకు సాగే విశ్వాసాన్ని ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement