సర్‌ప్రైజ్ బ్యాగ్ | Surprise bags... | Sakshi
Sakshi News home page

సర్‌ప్రైజ్ బ్యాగ్

Published Thu, Dec 18 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

సర్‌ప్రైజ్ బ్యాగ్

సర్‌ప్రైజ్ బ్యాగ్

తన గారాలపట్టి అన్నప్రాశనను అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనే ఓ తల్లి ఆలోచన నయా ట్రెండ్‌గా సెట్ అయింది. ఆ రోజు ఇంటికొచ్చిన బంధువులకు రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చింది. గిఫ్ట్‌ల సంగతి ఎలా ఉన్నా.. బహుమతులు ఉంచిన బ్యాగులపైనే అందరి దృష్టి పడింది. కొంగొత్తగా ఉన్న ఆ బ్యాగులను చూసిన అందరి ముఖాల్లో ఆశ్చర్యాన్ని చూసి.. అంతకు పదిరెట్ల ఆనందాన్ని పొందింది ఆ తల్లి. తాను పొందిన అనుభూతినే అందరు తల్లులకు అందించాలనుకుంది. అప్పటికే పేపర్ బ్యాగుల తయారీలో ఉన్న ఆ వనిత.. డిఫరెంట్ థీమ్స్‌తో కస్టమైజ్డ్ బ్యాగుల తయారీకి శ్రీకారం చుట్టింది.
 - భువనేశ్వరి

 
బర్త్ డే ఇన్విటేషన్ కార్డుపై మీ బుజ్జాయి ఫొటోను చూసి ముచ్చటపడి సరిపెట్టుకునే పేరెంట్స్‌కు సరికొత్త ఆనందాన్ని పంచుతున్నారు వసంత చిగురుపాటి. మీ చిట్టి పాపాయి పుట్టిన రోజు వేడుకకు గుర్తుగా ఇచ్చే బహుమతుల బ్యాగులపై కూడా ఆ బంగారు తల్లి ఫొటోను చూసి మురిసి పోయేలా చేస్తున్నారామె. పిల్లలపై ఉన్న ప్రేమను, మీ దర్పాన్ని ప్రతిబింబించే విధంగా నయా బ్యాగులు డిజైన్ చేస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చిన వసంత ఇక్కడ నయా కాన్సెప్ట్‌తో సక్సెస్‌ఫుల్ రిజల్ట్స్ సాధిస్తున్నారు.
 
న్యూ థీమ్..
బర్త్‌డే పార్టీ థీమ్‌ను బట్టి బ్యాగుల రంగు, డిజైన్ ఉంటుంది. థీమ్ ఏంటి? డిజైన్ ఏంటి అని కన్‌ఫ్యూజ్ కాకండి. ఈవెంట్ మేనేజర్లు బర్తెడే పార్టీలను ఒక థీమ్ ప్రకారం డిజైన్ చేస్తున్నారు. వేడుక కోసం ఉపయోగించే పూలు, బెలూన్లు.. వాటి రంగులు ఇతర అలంకరణ.. అంతా ఒక కాన్సెప్ట్ ప్రకారం చేస్తారు. అందుకు సూటయ్యే డిజైన్‌నే బ్యాగుపై ముద్రించడం వసంత ప్రత్యేకత. అబ్బాయి బర్త్ డే డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలానో.. బొమ్మలతో కలిసున్న ఫొటోనో బ్యాగ్‌పై వేసి టాక్ ఆఫ్ ది ఈవెంట్‌గా తీర్చిదిద్దుతున్నారు.
 
ప్రమోషన్ అదుర్స్..
‘నేను మొదలుపెట్టింది మామూలు బ్యాగుల కంపెనీనే. మా పాప పుట్టాక తన కోసం పర్సనలైజ్డ్ బ్యాగులను తయారు చేశాను. పాప ఫొటో, నాకు నచ్చిన కొటేషన్‌తో అందమైన డిజైన్‌తో బ్యాగ్ తయారు చేశాను. మా చిట్టితల్లి అన్నప్రాశన రోజు రిటర్న్ గిఫ్ట్స్ ఆ బ్యాగుల్లో పెట్టి ఇచ్చాను. వచ్చినవారంతా ఆ గిఫ్ట్‌ని పక్కనపెట్టి బ్యాగ్ గురించే మాట్లాడుకున్నారు. వారి వారి ఇళ్లల్లో పిల్లల వేడుకలకు అలాంటి బ్యాగులు కావాలని ఆర్డర్ చేశారు. అందరూ నాలాంటి తల్లులే.. బిడ్డ ఆనందం కోసం ఇలాంటివి చేయడానికి అసలు వెనుకాడరు. అదే నా బ్యాగుల ప్రమోషన్‌కు సహకరించింది’ అని చెప్పారు వసంత చిగురుపాటి.
 
కామిక్ బ్యాగ్స్..
ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఉద్యోగం చేసిన వసంత తర్వాత యూకేలోని విప్రో కంపెనీలో కూడా కొంతకాలం పని చేసి ఇండియాకు వచ్చేశారు. పెళ్లయిన తర్వాత ఏదైనా కొత్త కాన్సెప్ట్‌తో వ్యాపారం చేయాలని భావించారామె. భర్త వంశీ కూడా వసంత ఆలోచనకు ఓటేయడంతో ప్లాస్టిక్ రహిత ఇండియా నినాదానికి పునాదిగా 2010లో పేపర్ బ్యాగుల కంపెనీని స్థాపించారు. రెండేళ్ల కిందట బిజినెస్ ట్రెండ్ మార్చేశారు.

‘ఈ బ్యాగుల తయారీకి ఆర్డర్లు వచ్చిన కొత్తలో చాలా వరకూ బర్త్‌డే పిల్లల ఇష్టానికి అనుగుణంగా డిజైన్లు చేశాను. వారి ఫొటోలతో పాటు టెడ్డిబేర్లు, బెన్‌టెన్ బొమ్మలు.. వారు చూసే కార్టూన్ చానెల్స్ కనుక్కొని అందులోని క్యారెక్టర్లను వారి ఫొటో పక్కన ఉండేలా ప్రింట్ చేశాను. ఈ మధ్య ధనికుల ఇళ్లలో బర్త్‌డేలకు కస్టమైజ్డ్ కేకులను తయారు చేయించుకుంటున్నారు. ఆ కేక్ నేపథ్యాన్ని బట్టే మా బ్యాగులు డిజైన్ ఉంటుందన్నమాట’ అని వివరించారు వసంత. సిటీలోనే కాదు విదేశాల్లో జరిగే ఈవెంట్లకూ ఈ బ్యాగులను పంపిస్తున్నారు.
 
నేను సైతం....
వైజాగ్ హుద్‌హుద్ బాధితుల కోసం నిర్వహించిన ‘మేము సైతం’ కార్యక్రమం గురించి తెలుసు కదా! దాని కోసం వసంత తయారు చేసిన బ్యాగులు ఫుల్ పాపులర్ అయ్యాయి. టాలీవుడ్‌లోని ప్రముఖ నటుల ఫొటోలతో తయారు చేసిన బ్యాగులు ‘మేము సైతం’ కార్యక్రమం ప్రచారానికి బాగా ఉపయోగపడింది కూడా. టాప్ కంపెనీల నుంచి కూడా ఆర్డర్లు కూడా సంపాదిస్తున్నారు.  కెనాన్, కోకాకోలా ఇండియా, సోనీ, హ్యుందయ్ మోటర్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్.. వంటి ప్రముఖ కంపెనీలకు వసంత కస్టమైజ్డ్ బ్యాగులు తయారు చేసి ఇస్తున్నారు. ఫేస్‌బుక్ ద్వారా బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ ఆన్‌లైన్‌లో దూసుకుపోతున్నారు. మరిన్ని ప్రాంతాల్లో విస్తరించడానికి సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement