Wipro Company
-
జర్మనీలో విప్రో సైబర్ డిఫెన్స్ సెంటర్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో తాజాగా జర్మనీలోని డుసెల్డార్ఫ్లో సైబర్ డిఫెన్స్ సెంటర్ ప్రారంభించింది. క్లయింట్లకు ఈ కేంద్రం ద్వారా సైబర్ సెక్యూరిటీ పర్యవేక్షణ, ఏదైనా సంఘటన జరిగితే ప్రతిస్పందన, సమస్య పరిష్కారానికి మద్దతు వంటి సేవలు అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులను విప్రో వినియోగిస్తుంది. -
ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ .. విప్రో నుంచి 120 మంది
గత కొన్ని రోజులుగా మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీల దగ్గర నుంచి చిన్న కంపెనీల వరకు తమ కంపెనీలలోని ఉద్యోగులను వివిధ రకాల కారణాల వల్ల తొలగిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు విప్రో కంపెనీ రీలైన్‌మెంట్ ఆఫ్ బిజినెస్ (Realignment of Business Needs) కారణంగా USలోని ఫ్లోరిడాలో 120 మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కంపెనీ, ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీకి అందించిన వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) నోటీసులో తొలగింపులను గురించి వివరించినట్లు తెలిసింది. టంపాలోని ఒక ప్రదేశంలో మాత్రమే ఉద్యోగుల తొలగింపు జరిగినట్లు సమాచారం. కంపెనీ తొలగించిన 120 మంది ఉద్యోగులలో వందమందికి పైగా ప్రాసెసింగ్ ఏజెంట్లు ఉన్నారు. మిగిలిన వారిలో టీమ్ లీడర్లు, టీమ్ మేనేజర్లు ఉన్నారు. అయితే ఇతర విప్రో ఉద్యోగులందరూ అలాగే ఉద్యోగాలలో కొనసాగుతున్నారని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా ఈ నెల ప్రారంభంలో న్యూజెర్సీలోని ఈస్ట్ బ్రున్స్విక్లో అమెరికా ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించింది. (ఇదీ చదవండి: Top Car News of The Week: మారుతి బ్రెజ్జా సిఎన్జి నుంచి టయోటా హైలెక్స్ వరకు..) విప్రో కంపెనీ యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాల్లో దాదాపు 20,500 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కాగా ఇటీవలే ఇండియాలో సరైన పనితీరుని కనపరచని దాదాపు 400 మంది ఫ్రెషర్ ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీలో ఉద్యోగం పొందేవారు సగం జీతానికే పనిచేయాలని చెబుతున్నట్లు సమాచారం. -
కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న విప్రో!
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ ఫుడ్, మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రయివేట్ రంగ కంపెనీ విప్రో కన్జూమర్ కేర్ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా సుగంధ ద్రవ్యాల కంపెనీ నిరాపరాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. కేరళలో అత్యధికంగా విక్రయమవుతున్న సంప్రదాయ ఆహార బ్రాండ్ల సంస్థ నిరాపరాను సొంతం చేసుకునేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు డాబర్, ఇమామీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఐటీసీ సరసన చేరనున్నట్లు పేర్కొంది. 1976లో ప్రారంభమైన నిరాపరా మిశ్రమ మసాలా దినుసులకు పేరొందింది. ఈ బ్రాండు పలు రకాల మిశ్రమ దిసుసులతోపాటు.. విభిన్న అప్పడాల తయారీలో వినియోగించే బియ్యపు పిండినీ రూపొందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ బిజినెస్ కేరళలో 63 శాతం, గల్ఫ్ దేశాల నుంచి 29 శాతం నమోదవుతున్నట్లు విప్రో ఎంటర్ప్రైజెస్ ఈడీ వినీత్ అగర్వాల్ వెల్లడించారు. ఈ వార్తల నేపథ్యంలో విప్రో షేరు యథాతథంగా రూ. 390 వద్ద ముగిసింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
మానవ సంబంధాలపై ‘గ్యాస్ లైటింగ్’.. అసలు ఏంటి ఇది?
దొడ్డ శ్రీనివాసరెడ్డి: ఒకరంటే మరొకరికి పడదు.. లేదా ఒకరి నుంచి మరొకరు ఏదో కూడని దాన్ని ఆశిస్తున్నాంటారు. దగ్గరివారిగా నటిస్తారు, ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తారు. కానీ అదే సమయంలో మీ నిర్ణయాలు తప్పని మీకే అనిపించేలా వ్యవహరిస్తారు. మెల్లగా మీలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. అవతలివారు ఏం చెప్పినా.. అది తప్పు అని మీకు అనిపిస్తున్నా కూడా తు.చ. తప్పకుండా చేసే పరిస్థితి కల్పిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే.. పూర్తిగా లొంగదీసుకుంటారు. ఇదే ‘గ్యాస్ లైటింగ్’. పేరులోని పదాలకు సంబంధం లేకున్నా.. నమ్మకమే పెట్టుబడిగా ప్రస్తుతం సమాజంలో అంతటా, అన్ని రంగాల్లో గ్యాస్ లైటింగ్‌కు పాల్పడటం కనిపిస్తోంది. విప్రో సంస్థ ఇటీవల అకస్మాత్తుగా 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న కారణంగా వారిని తొలగించినట్టు సంస్థ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ప్రకటించారు. దీనితో మూన్ లైటింగ్ అనే పదం విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఇంకో పదం ప్రపంచ ప్రజానీకాన్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. అదే గ్యాస్ లైటింగ్. మెరియం వెబ్‌స్టర్ డిక్షనరీ 2022లో అత్యధికంగా అన్వేషించిన పదంగా గ్యాస్ లైటింగ్‌ను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆ పదం కోసం వెదికినవారి సంఖ్య 1,740 శాతం పెరిగినట్టు మెరియం వెబ్‌స్టర్ ఎడిటర్ పీటర్ సాకోలోవిస్కీ తెలిపారు. ఈ పదం పట్ల ప్రజల ఆసక్తికి ఏ సంఘటనో, పరిణామమో కారణం కాకపోయినా.. ఏడాది పొడవునా ఔత్సాహికులు డిక్షనరీలో దీనికోసం వెదకడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. మెరియం వెబ్‌స్టర్ నిఘంటువును ఆన్లైన్లో ప్రతినెలా పదికోట్ల మంది వీక్షిస్తారు. 2020లో పాండమిక్, గత ఏడాది వాక్సిన్ పదాలను అత్యధికంగా శోధించారు. మరి ఏమిటీ గ్యాస్ లైటింగ్? వెబ్‌స్టర్ డిక్షనరీ ప్రకారం.. ఎవరైనా సుదీర్ఘకాలంపాటు వారి వాదనలు, వక్రీకరణలతో మనల్ని గందరగోళపర్చడం, మనపై మనకే నమ్మకం కోల్పోయేలా చేయడం, వాస్తవికతపట్ల సందేహం కల్పించడం, మానసికంగా మనల్ని ఆత్మన్యూనతలోకి నెట్టడమే ‘గ్యాస్ లైటింగ్’. సులువుగా చెప్పుకోవాలంటే అవతలివారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మనల్ని తప్పుదోవ పట్టించడం అన్నమాట. ఫేక్‌న్యూస్, వాట్సాప్‌లో అవాస్తవాల ప్రచారం, ప్రజలను ప్రభుత్వాధినేతలు మభ్యపెట్టడం, కుట్ర సిద్ధాంతాల వంటివాటి నేపథ్యంలో ఇటీవలి కాలంలో ‘గ్యాస్ లైటింగ్’ పదం విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. గ్యాస్ లైటింగ్‌కు మూలం ఇదీ! తొలుత ఎక్కువగా మానసిక నిపుణులు గ్యాస్ లైటింగ్ పదాన్ని వాడేవారు. తర్వాత సాహిత్యంలో, పత్రికా రచనల్లో అప్పుడప్పుడూ కనిపించేది. ఇప్పుడు దీన్ని అన్ని రంగాల్లో ప్రస్తావిస్తున్నారు. అయితే గ్యాస్ లైటింగ్ పదానికి మూలం 84 ఏళ్ల క్రితం లండన్‌లో అదే పేరుతో ప్రదర్శితమైన నాటకం. 1938లో పాట్రిక్ హమిల్టన్ రాసిన నాటకం ‘గ్యాస్ లైట్’ అప్పట్లో విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఆ నాటకం ఆధారంగా 1944లో గ్యాస్ లైట్ పేరుతో ప్రముఖ నటీనటులు ఇంగ్రిడ్ బెర్గ్మన్, చార్లెస్ బోయెర్ నటించిన సినిమా విడుదలయింది. కథానాయిక బెల్లా పాత్రను బెర్గ్మన్, ఆమె భర్త జాన్ పాత్రను బోయర్ పోషించారు. భార్య బెల్లాకు మానసిక స్థిమితం లేదనే భావనను ఆమెలో కలిగించడానికి భర్త జాక్ చేసే ప్రయత్నాలే దీనిలో ప్రధానాంశం. భార్య ఆత్మన్యూనతకు లోనయ్యేలా భర్త ప్రయత్నించేటప్పుడు ఇంట్లో గ్యాస్‌తో వెలిగేలైట్లు మసకబారుతూ ఉంటాయి. మన చుట్టూ గ్యాస్ లైటింగ్.. తరచిచూస్తే మన చుట్టూ ఈ గ్యాస్ లైటింగ్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అబద్ధాలు, వక్రీకరణలు, తిమ్మిని బమ్మిని చేయడం వంటివాటిని మానవ సంబంధాల్లో, వ్యాపారం, రాజకీయం వంటి అన్నిరంగాల్లో చూస్తూనే ఉంటాం. నమ్మకం ఉన్నచోటే గ్యాస్ లైటింగ్ పనిచేస్తుంది. భార్యాభర్తలు, ప్రేమికులు, స్నేహితుల మధ్య, యజమాని–ఉద్యోగి మధ్య, రాజకీయ నేతలు–ఓటర్ల మధ్య నిరంతరాయంగా ఇదిసాగుతూ ఉండటం గమనిస్తున్నాం ►లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాను ఓడిపోలేదని, కుట్ర జరిగిందని అనుయాయులను నమ్మించి పార్లమెంట్ భవనం కాపిటల్హిల్పై దాడికి కారణమయ్యారు. ప్రత్యర్థి బరాక్ ఒబామా అమెరికాలో పుట్టలేదని దేశప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు ట్రంప్. ఒబామా తన బర్త్ సర్టిఫికెట్ చూపించి ట్రంప్ చెప్పింది అబద్ధమని నిరూపించుకోవాల్సి వచ్చింది. ►కరోనా ముట్టడిస్తున్నప్పుడు అన్నిదేశాల ప్రభుత్వాలు తేలిగ్గా తీసుకుని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశాయి. వైద్య సంస్థలు మొదట్లో అదే పనిచేశాయి. మహమ్మారి పంజా విసిరి లక్షల మందిని పొట్టనపెట్టుకున్నాక చర్యలు తీసుకోవడం మొదలుపెట్టా యి. కరోనా సమయంలో ప్రభుత్వాలు, వైద్య సంస్థలు వాస్తవాలను దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నాలకు ‘మెడికల్ గ్యాస్ లైటింగ్’ అని పేరుపెట్టారు. ►నల్లధనాన్ని అరికట్టడానికి నోట్ల రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించినప్పుడు అందరూ నమ్మారు. గంటలు, రోజుల తరబడి క్యూలలో నిలబడి నగదు మార్చుకున్నారు భారతీయ బడుగుజీవులు. తీరా చూస్తే రద్దు ముందు చెలామణిలో ఉన్న నగదు కన్నా ఎక్కువ శాతం నగదు చెలామణిలోకి వచ్చింది. తర్వాత ప్రధానిగానీ, ప్రభుత్వంగానీ నోట్లరద్దు ప్రస్తావన చేయలేదు. ఇలా ప్రభుత్వాధినేతలు, రాజకీయ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడాన్ని ‘పొలిటికల్ గ్యాస్ లైటింగ్’గా పిలుస్తున్నారు. శ్రద్ధావాకర్ హత్య కేసులోనూ ఇదే తీరు! సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధావాకర్ హత్యకేసులో కూడా గ్యాస్ లైటింగ్ జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. అఫ్తాబ్ పూనావాలా తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధను హత్యచేసి, దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పడేసిన ఉదంతం గురించి విస్తృతమైన చర్చ జరిగింది. మరి అంతకుముందు శ్రద్ధావాకర్ చేసిన పోలీస్ ఫిర్యాదు, స్నేహితులతో పంచుకున్న తన అనుమానాలు, ఆందోళనలను పరిశీలిస్తే.. అఫ్తాబ్ ప్రవర్తన గురించి, అతడి దుశ్చర్యల గురించి తెలిసినా శ్రద్ధావాకర్ అఫ్తాబ్‌ను ఎందుకు వదిలి వెళ్లలేదన్నది సమాధానం లేని ప్రశ్న. శ్రద్ధపై అఫ్తాబ్ ‘గ్యాస్ లైటింగ్’ ప్రయోగించడమే దీనికి కారణమనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రముఖ క్లినికల్ సైకాలజిస్టు డాక్టర్ ప్రాచీ వైష్ను ఇదే సందేహం అడిగితే.. ‘‘ఇలాంటి కేసుల్లో నిందితులు సుదీర్ఘకాలం పాటు బాధితులను మానసికంగా గందరగోళపర్చి, ఆత్మన్యూనతకు లోనుచేసి, మానసిక స్థితిపై పూర్తి నియంత్రణ సాధిస్తారు. దీనితో బాధితులు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితికి చేరుకుంటారు. తప్పించుకుని వెళ్లే సాహసం చేయరు..’’ అని చెప్పారు. బయటపడేదెలా? గ్యాస్ లైటింగ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కావాల్సింది ప్రధానంగా ఆత్మ నిబ్బరాన్ని కోల్పోకపోవడమేనని మానసిక నిపుణులు చెప్తున్నారు. మనపై గ్యాస్ లైటింగ్ జరుగుతుందని ఏమాత్రం అనుమానం వచ్చినా.. తక్షణమే ఎలాంటి నిర్ణయాలు, అభిప్రాయాలకు రాకుండా మౌనంగా పరిస్థితిని పరిశీలించుకోవాలని.. వాస్తవాలను ఒకటికి రెండుసార్లు పరిక్షించుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైన ఆధారాలను సేకరించాలని.. ఇతరులతో అనుమానాలను పంచుకోవాలని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకుండా పరిస్థితిని ఎదుర్కొని, ప్రత్యామ్నాయాలను యోచించాలని.. అవసరమైతే నిపుణులను సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు. -
విప్రో పోటీల్లో ‘కృష్ణా’ విద్యార్థుల సత్తా
మచిలీపట్నం: విప్రో సంస్థ నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో కృష్ణాజిల్లా గూడూరు మండలం మల్లవోలు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. గైడ్, టీచర్ అరుణ పర్యవేక్షణలో విద్యార్థులు ఈ. వరలక్ష్మి, కే యశశ్విని, టీ శ్రీదేవి, జీ మనోజ్ఙ, కే లోకేష్‌లు రూపొందించిన ‘జీవవైవిధ్య పరిరక్షణ’ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. దేశవ్యాప్తంగా 20 అత్యుత్తమ ప్రాజెక్టులను సంస్థ ఎంపిక చేయగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మల్లవోలు విద్యార్థులు మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పాఠశాలకు రూ.50 వేలు నగదు బహుమతి అందజేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారులకు సమాచారం అందించారు. అంతరించిపోతున్న జీవరాశులను ఎలా కాపాడుకోవాలనే దానిపై పాఠశాల విద్యార్థులు క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రాజెక్టు రూపొందించారు. బయాలజీ టీచర్ నాదెండ్ల అరుణ ప్రధానోపాధ్యాయులు వి. పాండురంగారావు సహకారంతో సైన్సు క్లబ్ ఏర్పాటుచేసి జీవ వైవిధ్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టారు. వ్యర్థ పదార్థాలతో వస్తువుల తయారీ (రీ సైకిల్), ప్లాస్టిక్ నిర్మూలన, ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే వాటిని వినియోగించి వస్తువులు తయారుచేయటం వంటి అంశాలపై ప్రాజెక్టులను సిద్ధంచేశారు. దీనిని పుస్తక రూపంలో తీర్చిదిద్ది ఫిజికల్ డైరెక్టర్ సిద్ధినేని శ్రీనివాసరావు సాంకేతిక సహకారంతో విప్రో సంస్థకు ఆన్లైన్ ద్వారా పంపించారు. గ్రామస్తుల సహకారంతో చేపట్టిన కార్యక్రమాలు, విద్యార్థులు చూపిన జీవ వైవిధ్య పరిరక్షణ అంశాలకు మెచ్చిన సంస్థ ప్రతినిధులు మల్లవోలు పాఠశాలకు బహుమతి ప్రకటించారు. విద్యార్థులు, పాఠశాల విద్యార్థులను డీఈఓ తాహెరా సుల్తానా, మచిలీపట్నం డెప్యూటీ డీఈఓ యూవీ సుబ్బారావు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ నైపుణ్యత చాటుకుంటూ జాతీయ స్థాయిలో రాణిస్తుండటం అభినందనీయమన్నారు. -
దాతృత్వంలో మేటి.. అజీం ప్రేమ్‌జీ!!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ దాతృత్వంలోనూ మేటిగా నిల్చారు. రోజుకు సుమారు రూ. 22 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 7,904 కోట్లు విరాళమిచ్చారు. తద్వారా 2019–20 సంవత్సరానికి గాను హురున్ రిపోర్ట్ ఇండియా, ఎడెల్‌గివ్ ఫౌండేషన్ రూపొందించిన దానశీలుర జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రేమ్‌జీ రూ. 426 కోట్లు విరాళమిచ్చారు. ఇక తాజా లిస్టులో సుమారు రూ. 795 కోట్ల విరాళంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ నాడార్ రెండో స్థానంలో నిలవగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ. 458 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో శివ నాడార్ రూ. 826 కోట్లు, అంబానీ రూ. 402 కోట్లు విరాళమిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలతో కార్పొరేట్ల విరాళాల తీరు కొంత మారింది. కరోనాపై పోరాటానికి టాటా సన్స్ అత్యధికంగా రూ. 1,500 కోట్లు, ప్రేమ్‌జీ రూ. 1,125 కోట్లు ప్రకటించారు. కార్పొరేట్లు అత్యధిక మొత్తం విరాళాలను పీఎం–కేర్స్ ఫండ్కే ప్రకటించడం గమనార్హం. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 400 కోట్లు, టాటా గ్రూప్ రూ. 500 కోట్లు ప్రకటించాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం విరాళాల పరిమాణం సుమారు 175 శాతం పెరిగి రూ. 12,050 కోట్లకు పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది. రూ. 10 కోట్లకు మించి దానమిచి్చన వ్యక్తుల సంఖ్య స్వల్పంగా 72 నుంచి 78కి పెరిగింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు ముగ్గురు.. నందన్ నీలేకని (రూ. 159 కోట్లు), ఎస్ గోపాలకృష్ణన్ (రూ. 50 కోట్లు), ఎస్డీ శిబులాల్ (రూ. 32 కోట్లు) ఎడెల్‌గివ్ జాబితాలో ఉన్నారు. విద్యా రంగానికి ప్రాముఖ్యం.. విద్యారంగానికి అత్యధికంగా విరాళాలు అందాయి. ప్రేమ్‌జీ, నాడార్ల సారథ్యంలో సుమారు 90 మంది సంపన్నులు దాదాపు రూ. 9,324 కోట్లు ప్రకటించారు. ఆ తర్వాత స్థానంలో హెల్త్‌కేర్, విపత్తు నివారణ విభాగాలు ఉన్నాయి. భారీ విరాళాలు ఇచి్చన వారిలో అత్యధికంగా ముంబైకి చెందిన వారు 36 మంది ఉండగా, ఢిల్లీ వాసులు 20 మంది, బెంగళూరుకు చెందిన వారు 10 మంది ఉన్నారు. రూ. 5 కోట్లకు పైగా విరాళమిచి్చన 109 మంది సంపన్నులతో రూపొందించిన ఈ జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. మహిళల జాబితాలో నందన్ నీలేకని సతీమణి రోహిణి నీలేకని అత్యధికంగా రూ. 47 కోట్లు విరాళమిచ్చారు. -
విప్రోకు ఉజ్వల భవిష్యత్: ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతోందని, కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ అజీం ప్రేమ్‌జీ చెప్పారు. ఇందుకోసం కొత్త వ్యూహాలు అమలు చేయనుందని ఆయన తెలిపారు. డిజిటల్, క్లౌడ్, ఇంజనీరింగ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ విభాగాలపై భారీగా ఇన్వెస్ట్ చేయనుందని మంగళవారం కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వివరించారు. ‘సామర్ధ్యాలను పెంచుకునేందుకు విప్రో భారీగా పెట్టుబడులు పెడుతుంది. మారే ప్రపంచానికి అనుగుణంగా తనను తాను మల్చుకుంటూ, విలువలకు కట్టుబడి ఇకపైనా ప్రస్థానం కొనసాగిస్తుంది. కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విప్రో భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది‘ అని ప్రేమ్‌జీ చెప్పారు. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు, షేర్హోల్డర్లు ఆమోదముద్ర వేశారని, సెబీ అనుమతుల మేరకు ఆగస్టునాటికి ఈ ప్రక్రియ పూర్తి కాగలదని ఆయన తెలిపారు. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న ప్రేమ్‌జీ చివరిసారిగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో ఇందులో పాల్గొన్నారు. సుమారు 53 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విప్రోకు సారథ్యం వహించిన ప్రేమ్‌జీ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేసి, కంపెనీ పగ్గాలను కుమారుడు రిషద్ ప్రేమ్‌జీకి అందించనున్నారు. ప్రస్తుతం చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్‌గా ఉన్న రిషద్ ప్రేమ్‌జీ జూలై 31న ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. చైర్మన్‌గా ప్రేమ్‌జీకి ఆఖరు ఏజీఎం కావడం తో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైర్మెంట్ తర్వాత ఆయన విప్రో బోర్డులో నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగనున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలపై పూర్తి సమయం వెచ్చించనున్నారు. అసాధారణ ప్రయాణం..: ఏజీఎం సందర్భంగా కంపెనీ ప్రస్థానాన్ని ప్రేమ్‌జీ గుర్తు చేసుకున్నారు. ఒక చిన్నపాటి వంటనూనెల సంస్థగా మొదలెట్టిన కంపెనీ.. 8.5 బిలియన్ డాలర్ల భారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగిన తీరును ప్రస్తావించారు. ‘నా వరకూ ఇది ఒక అసాధారణ ప్రయాణం. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ, విప్రో తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగుతోంది. విలువలకు కట్టుబడి ఉండటం, ఉద్యోగుల నిబద్ధత, శ్రమతోనే ఇదంతా సాధ్యమైంది. ఇదే విప్రో స్ఫూర్తి‘ అని ప్రేమ్‌జీ చెప్పారు. రిషద్ సారథ్యంలో మరింత వృద్ధిలోకి..: కొత్త ఆలోచనలు, విస్తృత అనుభవం, పోటీతత్వంతో తన వారసుడైన రిషద్ .. విప్రోను మరింతగా వృద్ధిలోకి తేగలరని ప్రేమ్‌జీ ఆకాంక్షించారు. ‘2007 నుంచి లీడర్షిప్ టీమ్‌లో రిషద్ భాగంగా ఉన్నారు. కంపెనీ గురించి, వ్యాపార వ్యూహాలు, సంస్కృతి గురించి తనకు పూర్తి అవగాహన ఉంది‘ అని ఆయన చెప్పారు. ఎండీగా ఆబిదాలి..: ప్రస్తుతం సీఈవోగా ఉన్న ఆబిదాలి నీముచ్వాలా జూలై 31 నుంచి విప్రో ఎండీ బాధ్యతలు కూడా చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. నారాయణన్ వాఘుల్, అశోక్ గంగూలీ విప్రో బోర్డు నుంచి పదవీ విరమణ చేయనున్నారు. నాన్–ఎగ్జిక్యూటివ్ స్వతంత్ర డైరెక్టరుగా ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య విప్రో బోర్డులో చేరతారు. -
రాష్ట్రంలో విప్రో ‘సౌందర్య’ పరిశ్రమ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘విప్రో’సంస్థ.. సబ్బులు, ఇతర సౌందర్య సాధనాల ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. విప్రో కన్జ్యూమర్స్ కేర్ ప్రోడక్ట్స్ విభాగం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ చీఫ్ స్ట్రేటజీ ఆఫీసర్ రిషద్ ప్రేమ్‌జీ ప్రకటించారు. రూ.220 కోట్ల పెట్టుబడితో 401 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 200 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ రంగ వ్యాపార కార్యకలాపాలను విప్రో సంస్థ నిర్వహిస్తోంది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం ఇక్కడ రిషద్ ప్రేమ్‌జీతో సమావేశమై రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ చర్చలు ఫలించడంతో రాష్ట్రంలో సబ్బులు, ఇతర సౌందర్య సాధనాల యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని రిషద్ ప్రకటించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ: కేటీఆర్ కాగా సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చిన విప్రో సంస్థకు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో అనేక మెగా పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతిచ్చామని, మరో మెగా ప్రాజెక్టు రావడంతో రాష్ట్రం పెట్టుబడుల అనుకూల వాతావరణానికి అద్దంపడుతోందన్నారు. రాష్ట్రంలో ఇతర రంగాల్లో సైతం పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా రిషద్‌కు వివరించారు.ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని, ఇందుకు ఇప్పటికే పలు జిల్లాల్లో ఐటీ టవర్ల నిర్మాణంతో పాటు టాస్క్ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వరంగల్ పట్టణంలో సైయంట్ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని, తాజాగా టెక్ మహీంద్రా సైతం అక్కడ తన క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. వరంగల్‌లో విప్రో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. టీ–హబ్, టీ–వర్క్స్ ఇంక్యుబేటర్ల ఏర్పాటు ద్వారా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న వీ–హబ్ ఇంక్యూబేటర్‌తో విప్రో భాగస్వామ్యం వహించాలని మంత్రి కోరారు. -
ఈఎస్‌ఐల్లో పనికిరాని కంప్యూటర్లు
రూ.కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ రాజ్య బీమా(ఈఎస్ఐ) ఆస్పత్రులలో కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన కంప్యూటర్లు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతున్నాయి. ఈఎస్ఐ డిస్పెన్సరీ వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యంతో పాటు కాగితరహిత కార్యకలాపాల కోసం రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో అధికశాతం నాలుగేళ్లుగా పని చేయకపోయినా పట్టించుకునేవారే లేరు. వీటి నిర్వహణ బాధ్యతను తీసుకున్న విప్రో సంస్థ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఫలితంగా ఈఎస్ఐ కార్డుదారులు నాణ్యమైన వైద్యసేవలు పొందలేకపోతున్నారు. 2012లో రాష్ట్రంలోని 70డిస్పెన్సరీలు, 8 డయాగ్నోస్టిక్ సెంటర్లలో కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఐదేళ్ల పాటు వీటి నిర్వహణ కోసం విప్రోకు కాంట్రాక్టు ఇచ్చారు. కానీ నిర్వహణలో చిత్తశుద్ధి కొరవడంతో కేవలం 32 డిస్పెన్సరీలలో మాత్రమే కంప్యూటర్లు తూతూ మంత్రంగా పనిచేస్తున్నాయి. అరకొరగా ఇంటర్నెట్... చాలా చోట్ల డిస్పెన్సరీలకు ఇంటర్నెట్ సదుపాయం కూడా లేదు. కొన్ని చోట్ల లైన్లు వేసి నా అతితక్కువ సామర్థ్యంతోనే ఏర్పాటు చేశారు. సనత్‌నగర్‌లో ఉన్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికీ 1ఎంబీ మాత్రమే ఇచ్చారు. దీనివల్ల డిస్పెన్సరీలకు వచ్చే రోగుల వివరా లు ఆన్లైన్లో నమోదు చేయడం కష్టంగా మారింది. ఒక్కొక్కరి వివరాలు నమోదు చేయడానికి చాలా సమయం పడుతుండటం తో పేషెంట్లు ఆందోళన చేస్తున్నారు. దాంతో అధికారులు ఆన్లైన్ విధానానికి స్వస్తి పలికి యధావిధిగా రిజిస్టర్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కార్డుదారులు కోరుతున్నారు. -
సర్ప్రైజ్ బ్యాగ్
తన గారాలపట్టి అన్నప్రాశనను అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనే ఓ తల్లి ఆలోచన నయా ట్రెండ్‌గా సెట్ అయింది. ఆ రోజు ఇంటికొచ్చిన బంధువులకు రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చింది. గిఫ్ట్‌ల సంగతి ఎలా ఉన్నా.. బహుమతులు ఉంచిన బ్యాగులపైనే అందరి దృష్టి పడింది. కొంగొత్తగా ఉన్న ఆ బ్యాగులను చూసిన అందరి ముఖాల్లో ఆశ్చర్యాన్ని చూసి.. అంతకు పదిరెట్ల ఆనందాన్ని పొందింది ఆ తల్లి. తాను పొందిన అనుభూతినే అందరు తల్లులకు అందించాలనుకుంది. అప్పటికే పేపర్ బ్యాగుల తయారీలో ఉన్న ఆ వనిత.. డిఫరెంట్ థీమ్స్‌తో కస్టమైజ్డ్ బ్యాగుల తయారీకి శ్రీకారం చుట్టింది. - భువనేశ్వరి బర్త్ డే ఇన్విటేషన్ కార్డుపై మీ బుజ్జాయి ఫొటోను చూసి ముచ్చటపడి సరిపెట్టుకునే పేరెంట్స్‌కు సరికొత్త ఆనందాన్ని పంచుతున్నారు వసంత చిగురుపాటి. మీ చిట్టి పాపాయి పుట్టిన రోజు వేడుకకు గుర్తుగా ఇచ్చే బహుమతుల బ్యాగులపై కూడా ఆ బంగారు తల్లి ఫొటోను చూసి మురిసి పోయేలా చేస్తున్నారామె. పిల్లలపై ఉన్న ప్రేమను, మీ దర్పాన్ని ప్రతిబింబించే విధంగా నయా బ్యాగులు డిజైన్ చేస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చిన వసంత ఇక్కడ నయా కాన్సెప్ట్‌తో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ సాధిస్తున్నారు. న్యూ థీమ్.. బర్త్‌డే పార్టీ థీమ్‌ను బట్టి బ్యాగుల రంగు, డిజైన్ ఉంటుంది. థీమ్ ఏంటి? డిజైన్ ఏంటి అని కన్ఫ్యూజ్ కాకండి. ఈవెంట్ మేనేజర్లు బర్తెడే పార్టీలను ఒక థీమ్ ప్రకారం డిజైన్ చేస్తున్నారు. వేడుక కోసం ఉపయోగించే పూలు, బెలూన్లు.. వాటి రంగులు ఇతర అలంకరణ.. అంతా ఒక కాన్సెప్ట్ ప్రకారం చేస్తారు. అందుకు సూటయ్యే డిజైన్‌నే బ్యాగుపై ముద్రించడం వసంత ప్రత్యేకత. అబ్బాయి బర్త్ డే డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలానో.. బొమ్మలతో కలిసున్న ఫొటోనో బ్యాగ్‌పై వేసి టాక్ ఆఫ్ ది ఈవెంట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రమోషన్ అదుర్స్.. ‘నేను మొదలుపెట్టింది మామూలు బ్యాగుల కంపెనీనే. మా పాప పుట్టాక తన కోసం పర్సనలైజ్డ్ బ్యాగులను తయారు చేశాను. పాప ఫొటో, నాకు నచ్చిన కొటేషన్‌తో అందమైన డిజైన్‌తో బ్యాగ్ తయారు చేశాను. మా చిట్టితల్లి అన్నప్రాశన రోజు రిటర్న్ గిఫ్ట్స్ ఆ బ్యాగుల్లో పెట్టి ఇచ్చాను. వచ్చినవారంతా ఆ గిఫ్ట్‌ని పక్కనపెట్టి బ్యాగ్ గురించే మాట్లాడుకున్నారు. వారి వారి ఇళ్లల్లో పిల్లల వేడుకలకు అలాంటి బ్యాగులు కావాలని ఆర్డర్ చేశారు. అందరూ నాలాంటి తల్లులే.. బిడ్డ ఆనందం కోసం ఇలాంటివి చేయడానికి అసలు వెనుకాడరు. అదే నా బ్యాగుల ప్రమోషన్‌కు సహకరించింది’ అని చెప్పారు వసంత చిగురుపాటి. కామిక్ బ్యాగ్స్.. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఉద్యోగం చేసిన వసంత తర్వాత యూకేలోని విప్రో కంపెనీలో కూడా కొంతకాలం పని చేసి ఇండియాకు వచ్చేశారు. పెళ్లయిన తర్వాత ఏదైనా కొత్త కాన్సెప్ట్‌తో వ్యాపారం చేయాలని భావించారామె. భర్త వంశీ కూడా వసంత ఆలోచనకు ఓటేయడంతో ప్లాస్టిక్ రహిత ఇండియా నినాదానికి పునాదిగా 2010లో పేపర్ బ్యాగుల కంపెనీని స్థాపించారు. రెండేళ్ల కిందట బిజినెస్ ట్రెండ్ మార్చేశారు. ‘ఈ బ్యాగుల తయారీకి ఆర్డర్లు వచ్చిన కొత్తలో చాలా వరకూ బర్త్‌డే పిల్లల ఇష్టానికి అనుగుణంగా డిజైన్లు చేశాను. వారి ఫొటోలతో పాటు టెడ్డిబేర్లు, బెన్‌టెన్ బొమ్మలు.. వారు చూసే కార్టూన్ చానెల్స్ కనుక్కొని అందులోని క్యారెక్టర్లను వారి ఫొటో పక్కన ఉండేలా ప్రింట్ చేశాను. ఈ మధ్య ధనికుల ఇళ్లలో బర్త్‌డేలకు కస్టమైజ్డ్ కేకులను తయారు చేయించుకుంటున్నారు. ఆ కేక్ నేపథ్యాన్ని బట్టే మా బ్యాగులు డిజైన్ ఉంటుందన్నమాట’ అని వివరించారు వసంత. సిటీలోనే కాదు విదేశాల్లో జరిగే ఈవెంట్లకూ ఈ బ్యాగులను పంపిస్తున్నారు. నేను సైతం.... వైజాగ్ హుద్‌హుద్ బాధితుల కోసం నిర్వహించిన ‘మేము సైతం’ కార్యక్రమం గురించి తెలుసు కదా! దాని కోసం వసంత తయారు చేసిన బ్యాగులు ఫుల్ పాపులర్ అయ్యాయి. టాలీవుడ్‌లోని ప్రముఖ నటుల ఫొటోలతో తయారు చేసిన బ్యాగులు ‘మేము సైతం’ కార్యక్రమం ప్రచారానికి బాగా ఉపయోగపడింది కూడా. టాప్ కంపెనీల నుంచి కూడా ఆర్డర్లు కూడా సంపాదిస్తున్నారు. కెనాన్, కోకాకోలా ఇండియా, సోనీ, హ్యుందయ్ మోటర్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్.. వంటి ప్రముఖ కంపెనీలకు వసంత కస్టమైజ్డ్ బ్యాగులు తయారు చేసి ఇస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ ఆన్లైన్లో దూసుకుపోతున్నారు. మరిన్ని ప్రాంతాల్లో విస్తరించడానికి సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు.