న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతోందని, కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ అజీం ప్రేమ్‌జీ చెప్పారు. ఇందుకోసం కొత్త వ్యూహాలు అమలు చేయనుందని ఆయన తెలిపారు. డిజిటల్, క్లౌడ్, ఇంజనీరింగ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ విభాగాలపై భారీగా ఇన్వెస్ట్ చేయనుందని మంగళవారం కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వివరించారు. ‘సామర్ధ్యాలను పెంచుకునేందుకు విప్రో భారీగా పెట్టుబడులు పెడుతుంది. మారే ప్రపంచానికి అనుగుణంగా తనను తాను మల్చుకుంటూ, విలువలకు కట్టుబడి ఇకపైనా ప్రస్థానం కొనసాగిస్తుంది. కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విప్రో భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది‘ అని ప్రేమ్‌జీ చెప్పారు. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు, షేర్‌హోల్డర్లు ఆమోదముద్ర వేశారని, సెబీ అనుమతుల మేరకు ఆగస్టునాటికి ఈ ప్రక్రియ పూర్తి కాగలదని ఆయన తెలిపారు.
ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న ప్రేమ్‌జీ చివరిసారిగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో ఇందులో పాల్గొన్నారు. సుమారు 53 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విప్రోకు సారథ్యం వహించిన ప్రేమ్‌జీ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేసి, కంపెనీ పగ్గాలను కుమారుడు రిషద్ ప్రేమ్‌జీకి అందించనున్నారు. ప్రస్తుతం చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్‌గా ఉన్న రిషద్ ప్రేమ్‌జీ జూలై 31న ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. చైర్మన్‌గా ప్రేమ్‌జీకి ఆఖరు ఏజీఎం కావడం తో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైర్మెంట్ తర్వాత ఆయన విప్రో బోర్డులో నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగనున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలపై పూర్తి సమయం వెచ్చించనున్నారు.
అసాధారణ ప్రయాణం..: ఏజీఎం సందర్భంగా కంపెనీ ప్రస్థానాన్ని ప్రేమ్‌జీ గుర్తు చేసుకున్నారు. ఒక చిన్నపాటి వంటనూనెల సంస్థగా మొదలెట్టిన కంపెనీ.. 8.5 బిలియన్ డాలర్ల భారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగిన తీరును ప్రస్తావించారు. ‘నా వరకూ ఇది ఒక అసాధారణ ప్రయాణం. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ, విప్రో తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగుతోంది. విలువలకు కట్టుబడి ఉండటం, ఉద్యోగుల నిబద్ధత, శ్రమతోనే ఇదంతా సాధ్యమైంది. ఇదే విప్రో స్ఫూర్తి‘ అని ప్రేమ్‌జీ చెప్పారు.
రిషద్ సారథ్యంలో మరింత వృద్ధిలోకి..: కొత్త ఆలోచనలు, విస్తృత అనుభవం, పోటీతత్వంతో తన వారసుడైన రిషద్ .. విప్రోను మరింతగా వృద్ధిలోకి తేగలరని ప్రేమ్‌జీ ఆకాంక్షించారు. ‘2007 నుంచి లీడర్‌షిప్ టీమ్‌లో రిషద్ భాగంగా ఉన్నారు. కంపెనీ గురించి, వ్యాపార వ్యూహాలు, సంస్కృతి గురించి తనకు పూర్తి అవగాహన ఉంది‘ అని ఆయన చెప్పారు.
ఎండీగా ఆబిదాలి..: ప్రస్తుతం సీఈవోగా ఉన్న ఆబిదాలి నీముచ్‌వాలా జూలై 31 నుంచి విప్రో ఎండీ బాధ్యతలు కూడా చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. నారాయణన్ వాఘుల్, అశోక్ గంగూలీ విప్రో బోర్డు నుంచి పదవీ విరమణ చేయనున్నారు. నాన్–ఎగ్జిక్యూటివ్ స్వతంత్ర డైరెక్టరుగా ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య విప్రో బోర్డులో చేరతారు.
Comments
Please login to add a commentAdd a comment