రూ.కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ రాజ్య బీమా(ఈఎస్‌ఐ) ఆస్పత్రులలో కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన కంప్యూటర్లు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతున్నాయి. ఈఎస్‌ఐ డిస్పెన్సరీ వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యంతో పాటు కాగితరహిత కార్యకలాపాల కోసం రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో అధికశాతం నాలుగేళ్లుగా పని చేయకపోయినా పట్టించుకునేవారే లేరు. వీటి నిర్వహణ బాధ్యతను తీసుకున్న విప్రో సంస్థ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
ఫలితంగా ఈఎస్‌ఐ కార్డుదారులు నాణ్యమైన వైద్యసేవలు పొందలేకపోతున్నారు. 2012లో రాష్ట్రంలోని 70డిస్పెన్సరీలు, 8 డయాగ్నోస్టిక్ సెంటర్లలో కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఐదేళ్ల పాటు వీటి నిర్వహణ కోసం విప్రోకు కాంట్రాక్టు ఇచ్చారు. కానీ నిర్వహణలో చిత్తశుద్ధి కొరవడంతో కేవలం 32 డిస్పెన్సరీలలో మాత్రమే కంప్యూటర్లు తూతూ మంత్రంగా పనిచేస్తున్నాయి.
అరకొరగా ఇంటర్‌నెట్...
చాలా చోట్ల డిస్పెన్సరీలకు ఇంటర్‌నెట్ సదుపాయం కూడా లేదు. కొన్ని చోట్ల లైన్లు వేసి నా అతితక్కువ సామర్థ్యంతోనే ఏర్పాటు చేశారు. సనత్‌నగర్‌లో ఉన్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికీ 1ఎంబీ మాత్రమే ఇచ్చారు. దీనివల్ల డిస్పెన్సరీలకు వచ్చే రోగుల వివరా లు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కష్టంగా మారింది. ఒక్కొక్కరి వివరాలు నమోదు చేయడానికి చాలా సమయం పడుతుండటం తో పేషెంట్లు ఆందోళన చేస్తున్నారు. దాంతో అధికారులు ఆన్‌లైన్ విధానానికి స్వస్తి పలికి యధావిధిగా రిజిస్టర్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కార్డుదారులు కోరుతున్నారు.
ఈఎస్‌ఐల్లో పనికిరాని కంప్యూటర్లు
Published Wed, Sep 14 2016 1:50 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
Advertisement