రిషద్ ప్రేమ్‌జీతో కేటీఆర్ సెల్ఫీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘విప్రో’సంస్థ.. సబ్బులు, ఇతర సౌందర్య సాధనాల ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. విప్రో కన్జ్యూమర్స్ కేర్ ప్రోడక్ట్స్ విభాగం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ చీఫ్ స్ట్రేటజీ ఆఫీసర్ రిషద్ ప్రేమ్‌జీ ప్రకటించారు. రూ.220 కోట్ల పెట్టుబడితో 401 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 200 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ రంగ వ్యాపార కార్యకలాపాలను విప్రో సంస్థ నిర్వహిస్తోంది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం ఇక్కడ రిషద్ ప్రేమ్‌జీతో సమావేశమై రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ చర్చలు ఫలించడంతో రాష్ట్రంలో సబ్బులు, ఇతర సౌందర్య సాధనాల యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని రిషద్ ప్రకటించారు.
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ: కేటీఆర్
కాగా సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చిన విప్రో సంస్థకు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో అనేక మెగా పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతిచ్చామని, మరో మెగా ప్రాజెక్టు రావడంతో రాష్ట్రం పెట్టుబడుల అనుకూల వాతావరణానికి అద్దంపడుతోందన్నారు. రాష్ట్రంలో ఇతర రంగాల్లో సైతం పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా రిషద్‌కు వివరించారు.ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని, ఇందుకు ఇప్పటికే పలు జిల్లాల్లో ఐటీ టవర్ల నిర్మాణంతో పాటు టాస్క్ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వరంగల్ పట్టణంలో సైయంట్ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని, తాజాగా టెక్ మహీంద్రా సైతం అక్కడ తన క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు.
వరంగల్‌లో విప్రో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. టీ–హబ్, టీ–వర్క్స్ ఇంక్యుబేటర్ల ఏర్పాటు ద్వారా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న వీ–హబ్ ఇంక్యూబేటర్‌తో విప్రో భాగస్వామ్యం వహించాలని మంత్రి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment