world it congress
-
ముగిసిన ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు
-
సాంకేతికతో అనేక సమస్యలకు పరిష్కారం
-
మనసు విప్పి బాధను పంచుకోవాలి
-
ముగిసిన సంబురం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఐటీ సమ్మేళన సంబురం ముగిసింది. రాష్ట్ర పారిశ్రామిక యవనికపై ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలియెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ప్రపంచ ఐటీ కాంగ్రెస్ బుధవారం ఘనంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆతిథ్యం.. ప్రపంచ ఐటీ పరిశ్రమల సీఈఓలు, ఎగ్జిక్యూటివ్‌లు, మేధావులను సమ్మోహనపరిచింది. పరిశ్రమల ఒలంపిక్స్‌గా పేరుగాంచిన వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌కు 40 ఏళ్ల చరిత్ర ఉండగా, 22వ సదస్సును దేశంలో నిర్వహించారు. గత సదస్సులతో పోల్చితే ఈసారి అత్యధిక మంది ఐటీ రంగ ప్రతినిధులు హాజరయ్యారని, అత్యంత ఘనంగా నిర్వహించారని సదస్సు ముగింపు కార్యక్రమంలో వక్తలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు మాట్లాడుతూ, సదస్సు విజయవంతానికి కృషి చేసిన డబ్ల్యూఐటీఎస్‌ఏ, నాస్కామ్ ప్రతినిధి బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు. సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేసిన పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు కూడా ఐటీ రంగంలో వృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అర్మేనియాలో తదుపరి సదస్సు వచ్చే ఏడాది అక్టోబర్ 6వ తేదీ నుంచి 9 వరకు అర్మేనియాలో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ 23వ సదస్సును నిర్వహిస్తామని డబ్ల్యూఐటీఎస్‌ఏ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ఐటీ, పరిశ్రమల ప్రతినిధులు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బాటన్‌ను అందుకున్నారు. కార్యక్రమంలో డబ్ల్యూఐటీఎస్‌ఏ చైర్మన్ ఇవాన్ చియు, ప్రధాన కార్యదర్శి జిమ్ పైసంట్, నాస్కామ్ చైర్మన్ రమణ్ రాయ్, అధ్యక్షులు ఆర్.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు 30 దేశాల నుంచి ఐటీ రంగానికి చెందిన 2 వేల మంది దార్శనికులు, పరిశ్రమలు, ప్రభుత్వాల సారథులు, విద్యావేత్తలు హాజరయ్యారు. టాప్ 500 ఐటీ కంపెనీల నుంచి కనీసం 20 మంది సీఈఓలు, మరో 100 మంది ఎగ్జిక్యూటివ్‌లు వీరిలో ఉన్నారు. ఈ సదస్సులో 50కి పైగా చర్చాగోష్టిలు (సెషన్లు), మరో 50కి పైగా అత్యాధునిక ఐటీ రంగ ఉత్పత్తులపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈనెల 20న మానవ రూప రోబో సోఫియా చేసిన ప్రసంగం, ఇంటర్వ్యూ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తైవాన్‌తో ఒప్పందం సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు తైవాన్‌లోని టాయుఆన్ (Taoyuan) నగరంతో రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. పెట్టుబడులను ఆకట్టుకోవడం, పరిపాలనలో సాంకేతిక సహకారం, సార్టప్‌లకు మద్దతు, విద్యా సంస్థలతో ఒప్పందాలు, అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులపై ప్రదర్శనల ఏర్పాటు విషయంలో పరస్పర సహకారం కోసం మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. -
ఏ మూలకైనా ‘వల’ వేస్తాం!
సాక్షి, హైదరాబాద్: గూగుల్.. సంచలనాలకు పెట్టింది పేరు. టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తూ అందరికీ నిత్యావసరంగా మారిన ఈ సంస్థ ఇంకో అద్భుత విజయం సాధించింది. ప్రపంచంలో ఏమూలలో ఉన్న వారికైనా.. చిటికెలో మొబైల్, ఇంటర్నెట్ కనెక్షన్లను అందించేందుకు వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో భాగంగా బుధవారం ‘కనెక్టింగ్ ద నెక్ట్స్ బిలియన్’పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో గూగుల్ అనుబంధ సంస్థ ‘ఎక్స్’డైరెక్టర్ టామ్ మూర్ స్వయంగా వెల్లడించిన ఈ కొత్త టెక్నాలజీ వివరాలు.. ‘ప్రపంచంలో వీలైనంత ఎక్కువ మందికి ఇంటర్నెట్ను అందుబాటులోకి తేవాలని గూగుల్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండేళ్ల క్రితం మేం భారీసైజు గాలి బుడగల్లో కొన్ని పరికరాలను ఉంచి ఇంటర్నెట్ను ప్రసారం చేయాలని ఒక ప్రాజెక్టు చేపట్టాం. ప్రయోగాలన్నీ విజయవంతం గానే సాగాయి. అయితే ఈ ప్రాజెక్టుల్లో భాగంగా మేం గాలి బుడగల్లో వాడిన ఓ పరికరం మా ఆలోచనలకు పదును పెట్టింది. ఒక బెలూన్ ఇంకోదాన్ని గుర్తించేందుకు, సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వాడే ఈ పరికరం లేజర్ల సాయంతో పని చేస్తుంది. ఆకాశంలో విజయవంతంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పించిన ఈ ‘ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ (ఎఫ్ఎస్ఓసీ) టెక్నాలజీని భూమ్మీద వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలు మొదలయ్యా యి. పరీక్షించి చూద్దామని శాన్ఫ్రాన్సిస్కో బేలో గతేడాది చిన్న ప్రయోగం చేశాం. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు ఎల్తైన భవనాలపై రెండు ఎఫ్ఎస్ఓసీలు బిగించి పరీక్షించాం. సెకనుకు కొన్ని గిగాబైట్ల సమాచారం ప్రసారం చేయవచ్చని, అందుకోవచ్చని తేలింది. ఈ పరికరాలకు బదులు గా ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను వాడాల్సి వస్తే.. భారీగా కేబుల్ వేయాల్సి వచ్చేది. గోతు లు తవ్వడం, కేబుల్ వేయడం వంటి అన్ని పనులకు బోలెడంత ఖర్చయ్యేది. నెలల సమయం పట్టేది. ఇవేవీ లేకుండానే 2 గంటల సమయంలోనే మేం ఆ పని చేయగలిగాం. తర్వా తి కాలంలో ప్యూర్టారికోలో ప్రకృతి విపత్తు కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ నాశనమైనప్పుడు ఈ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షిం చి చూశాం. 2 వారాల సమయంలోనే అక్కడ విద్యుత్ టవర్లపై ఎఫ్ఎస్ఓసీలను ఏర్పాటు చేసి 90 వేల మందికి నెట్ సౌకర్యం కల్పించాం. చాపరాయిలోనూ సక్సెస్ ఎఫ్ఎస్ఓసీలతో అతితక్కువ సమయంలో ఎక్కడైనా ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించవచ్చని స్పష్టమైన తర్వాత ఆ సంస్థ ఉన్నతోద్యోగి ఒకరు.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా చాపరాయిలోనూ డిజిటల్ వెలుగులు పంచేందుకు దీన్ని ఉపయోగించారు. అడవి మధ్యలో అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ గ్రామానికి నాలుగంటే నాలుగు వారాల్లో పూరిస్థాయిలో కనెక్టివిటీ సాధించగలిగాం. ఈ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు వేల ఎఫ్ఎస్ఓసీల కొనుగోలుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి గత నెలలోనే ఒప్పందం కుదిరింది. అన్నీ సవ్యంగా సాగితే సమీప భవిష్యత్తులో భారత్‌లోని మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం’. -
రాష్ట్రంలో విప్రో ‘సౌందర్య’ పరిశ్రమ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘విప్రో’సంస్థ.. సబ్బులు, ఇతర సౌందర్య సాధనాల ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. విప్రో కన్జ్యూమర్స్ కేర్ ప్రోడక్ట్స్ విభాగం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ చీఫ్ స్ట్రేటజీ ఆఫీసర్ రిషద్ ప్రేమ్‌జీ ప్రకటించారు. రూ.220 కోట్ల పెట్టుబడితో 401 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 200 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ రంగ వ్యాపార కార్యకలాపాలను విప్రో సంస్థ నిర్వహిస్తోంది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం ఇక్కడ రిషద్ ప్రేమ్‌జీతో సమావేశమై రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ చర్చలు ఫలించడంతో రాష్ట్రంలో సబ్బులు, ఇతర సౌందర్య సాధనాల యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని రిషద్ ప్రకటించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ: కేటీఆర్ కాగా సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చిన విప్రో సంస్థకు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో అనేక మెగా పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతిచ్చామని, మరో మెగా ప్రాజెక్టు రావడంతో రాష్ట్రం పెట్టుబడుల అనుకూల వాతావరణానికి అద్దంపడుతోందన్నారు. రాష్ట్రంలో ఇతర రంగాల్లో సైతం పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా రిషద్‌కు వివరించారు.ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని, ఇందుకు ఇప్పటికే పలు జిల్లాల్లో ఐటీ టవర్ల నిర్మాణంతో పాటు టాస్క్ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వరంగల్ పట్టణంలో సైయంట్ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని, తాజాగా టెక్ మహీంద్రా సైతం అక్కడ తన క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. వరంగల్‌లో విప్రో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. టీ–హబ్, టీ–వర్క్స్ ఇంక్యుబేటర్ల ఏర్పాటు ద్వారా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న వీ–హబ్ ఇంక్యూబేటర్‌తో విప్రో భాగస్వామ్యం వహించాలని మంత్రి కోరారు. -
ఒంటరిననే భావన వద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒంటరిననే భావననే దరిచేరనీయవద్దని, అది మానసిక కుంగుబాటు (డిప్రెషన్)కు దారితీస్తుందని బాలీవుడ్ నటి దీపికా పదుకొనె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానసిక కుంగుబాటు అంటువ్యాధిలా మారుతోందని, ప్రతి ఐదుగురిలో ఒకరు తీవ్ర మానసిక వ్యధను ఎదుర్కొంటున్నారని చెప్పారు. సామాజిక చైతన్యమే కుంగుబాటుకు పరిష్కారమన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో బుధవారం ‘మానసిక దృఢత్వం’అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చలో ఆమె మాట్లాడారు. గతంలో స్వయంగా మానసిక కుంగుబాటుకు లోనై బయటపడ్డానని తన అనుభవాన్ని సభికులతో పంచుకున్నారు. ‘‘నా సినీ కెరీర్ మంచిస్థాయిలో ఉన్న 2014లో కుంగుబాటుకు, మనోవేదనకు గురయ్యా. ఒంటరితనంతో నాలో నేనే కుమిలిపోయా. బాధను తట్టుకోలేక ఏడ్చేదాన్ని. ఆ సమయంలో నా వద్దకు వచ్చిన మా అమ్మ నాకు అండగా నిలిచారు. మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు. కుంగుబాటు నుంచి బయటపడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు..’’అని దీపికా పదుకొనె వెల్లడించారు. మనతో ఉండేవారిని గమనించండి.. తన పరిస్థితిని పసిగట్టి తల్లి అడిగాకే.. తనను ఇబ్బందిపెట్టిన విషయాలను వేరేవారితో పంచుకోవడానికి తనకు అవకాశం లభించిందని దీపిక చెప్పారు. నిత్యం మనతో కలిసి ఉండేవారు ఏం చెబుతున్నారో, వాళ్లలో వస్తున్న మార్పులేమిటో గమనిస్తూ ఉండాలని, వారిలోని చిరాకును గమనించాలని సూచించారు. వారిలో కుంగుబాటు లక్షణాలను గుర్తించి అండగా నిలవాలన్నారు. తనకు ఏమైందో తెలియని మనోవేదన అనుభవించానని, అది కుంగుబాటు (డిప్రెషన్) అని మానసిక వైద్యులు నిర్ధారించిన మరుక్షణమే సగం విజయం సాధించానని చెప్పారు. వారి కౌన్సెలింగ్, ధాన్యం, జీవన శైలిలో మార్పులు, సకాలంలో నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడంతో పాటు తల్లి అందించిన సహకారంతో కుంగుబాటు నుంచి బయటపడ్డానని తెలిపారు. మానసిక ఆందోళన, ఆవేదన, వ్యధను కలిగించే అంశాలను మన శ్రేయస్సు కోరే వారితో పంచుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఎవరో ఏదో అనుకుంటారన్న ఆలోచన వద్దు కుంగుబాటుకు ఎన్నో కారణాలు ఉంటాయని, అపరాధ భావం అందులో ఒకటని దీపిక చెప్పారు. తన గురించి ఎవరో ఏదో అనుకుంటారనే, జడ్జ్ చేస్తారనే భయంతోనే తాను కుంగుబాటుకు లోనయినట్లు తెలిపారు. మనోవేదనకు లోనైనప్పుడు ఏడవడం, మనసు విప్పి ఇతరులతో బాధను పంచుకోవడం, వైద్య సహాయం పొందడం మంచిదని సూచించారు. ప్రతి సంస్థ మానసిక నిపుణులతో తమ ఉద్యోగులకు తరచూ కౌన్సెలింగ్ ఇప్పించాలని కోరారు. తనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ‘ది లైవ్ లవ్ లాఫ్’అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విప్రో సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సంధానకర్తగా వ్యవహరించారు. -
టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలకు భారత్ చిరునామా
-
ప్రజలే సారథులు
సాక్షి, హైదరాబాద్ : ‘‘డిజిటల్ విధానాల్లో ప్రజలకు సేవలందించేందుకు ప్రారంభించిన ప్రయాణమే డిజిటల్ ఇండియా. ప్రజల భాగస్వామ్యంతో మూడున్నరేళ్లలో మేం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. డిజిటల్ ఇండియా ఇక కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ప్రజల జీవన విధానం. దీన్ని ప్రజలే ముందుండి నడుపుతున్నారు’’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఆవిష్కరణలకు మన దేశం చిరునామాగా మారిందని పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు భౌగోళిక దూరాలు ఇక ఏమాత్రం అవాంతరం కాదన్నారు. కొత్త ఆవిష్కరణలతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్), రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సోమవారం ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ప్రారంభమైంది. ఈ సదస్సును ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రారంభించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. రూ.57 వేల కోట్లు ఆదా చేశాం టెక్నాలజీకి ప్రపంచంలోనే భారత్ అత్యంత అనుకూల దేశమని, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇప్పటికే దేశంలో లక్షకు పైగా గ్రామాలు ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉన్నాయని ప్రధాని చెప్పారు. ‘‘దేశంలో 121 కోట్ల మొబైల్ ఫోన్లున్నాయి. 50 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. 120 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉంది. పేదలకు జారీ చేసిన జన్‌ధన్ బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్లను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా సంక్షేమ పథకాల్లో రూ.57 వేల కోట్ల నిధులు ఆదా అయ్యాయి. దేశవ్యాప్తంగా 172 ఆస్పత్రుల్లో 2.2 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. స్కాలర్‌షిప్‌ల కోసం 1.4 కోట్ల మంది విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాల వెబ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. రైతులకు సరైన మద్దతు ధర అందించేందుకు ప్రవేశపెట్టిన ఈ–నామ్ వెబ్సైట్లో 66 లక్షల మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భీమ్ యాప్‌తో గత జనవరిలో రూ.15 వేల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇటీవల తెచ్చిన ‘ఉమంగ్’యాప్ ద్వారా 185 ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చాం. దేశంలో 2.8 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు ప్రజలకు ఎన్నో డిజిటల్ సేవలందిస్తున్నాయి. వీటి ద్వారా 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అందులో లక్షల మంది మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలున్నారు’’అని ప్రధాని వివరించారు. మొబైల్ పరిశ్రమలు 2 నుంచి 118కి.. 2014 నాటికి దేశంలో కేవలం రెండు మొబైల్ ఫోన్ల ఉత్పత్తి పరిశ్రమలే ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్యను 118కు పెంచామని, అందులో కొన్ని ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ల కంపెనీలు ఉన్నాయని ప్రధాని చెప్పారు. కృత్రిమ మేధోశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) రంగంలో పరిశోధనల కోసం ముంబై వర్సిటీలో వాద్వానీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సంస్థను ఆదివారమే ప్రారంభించిన సంగతిని గుర్తుచేశారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌కు వెళ్లిన సందర్భంగా సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు అక్కడ ఏర్పాటు చేసిన ‘మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్’ను సందర్శించానని చెప్పారు. ఈ సదస్సుకు వచ్చిన వారిలో కొత్త పరిజ్ఞాన ఆవిష్కర్తలెందరో ఉన్నారంటూ వారికి అభినందనలు తెలిపారు. మానవజాతి ఉజ్వల భవిష్యత్ కోసం వీరంతా కృషి చేస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్ వంటకాలను ఆస్వాదించండి ‘‘నేను హైదరాబాద్‌లో ఉండాల్సి ఉంది. అయినా ఆనందంగానే ఉంది. సుదూర ప్రాంతం నుంచి మీ ముందు ప్రసంగించే అవకాశాన్ని సాంకేతిక పరిజ్ఞానం కల్పించింది’’అని ప్రధాని పేర్కొన్నారు. హైదరాబాద్ ఘన చరిత్ర తెలుసుకోవడంతోపాటు అక్కడి రుచికరమైన వంటకాలను ఆస్వాదించాలని సదస్సుకు తరలి వచ్చిన విదేశీ ప్రతినిధులకు సూచించారు. భారతదేశం పురాతన, వైవిధ్య, ఘన చరిత్ర, సంస్కృతికి నిలయమైనప్పటికీ ఏకత్వమనే నినాదంతో పురోగమిస్తోందన్నారు. వసుధైక కుటుంబం భావన భారతీయ తత్వంలో లోతుగా పాతుకుపోయిందన్నారు. ఐటీలో ఈ ఎనిమిదే కీలకం ప్రస్తుతం ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, రొబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డాటా అనాలిటిక్స్, 3డీ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సోషల్ అండ్ మొబైల్ అనే ఎనిమిది రకాల అంశాలు కీలకంగా మారాయని ప్రధాని చెప్పారు. తన సూచన మేరకు నాస్కామ్ ఈ జాబితాను తయారు చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీటిపై శిక్షణ కోసం నాస్కామ్ రూపొందించిన ‘స్కిల్స్ ఆఫ్ ఫ్యూచర్’కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాత టెక్నాలజీని వెనక్కి నెట్టి కొత్త సాంకేతికతను సదస్సులో చర్చనీయాంశంగా తీసుకోవడాన్ని ప్రధాని స్వాగతించారు. నూతన టెక్నాలజీ దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న సిబ్బందికి ‘రీ స్కిల్లింగ్’కల్పించే అంశంపై దృష్టి సారించామన్నారు. ఈ సదస్సులో ప్రసంగించేందుకు ఆహ్వానం పొందిన యంత్ర మనిషి (హ్యూమనాయిడ్ రోబో) సోఫియా.. టెక్నాలజీ శక్తి సామర్థ్యాలకు అద్దం పడుతోందన్నారు. ఇంటెలిజెంట్ ఆటోమేషన్తో ఉద్యోగాల స్వరూపంలో వస్తున్న మార్పులపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెప్పారు. -
పరి పరిశోధన
కొత్త టెక్నాలజీ అనగానే మనలో చాలామంది... అది ఏ అమెరికాలోనో.. యూరప్‌లోనో తయారయ్యింది అనుకుంటాం. సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఆ దేశాలు ఎంతో ముందున్నాయని మన అంచనా. అయితే భారత్ కూడా ఏమీ వెనుకబడి లేదని యువ స్టార్టప్‌లు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైన వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన కొన్ని వినూత్న స్టార్టప్ టెక్నాలజీలు ఇలా ఉన్నాయి. వంటలు నేర్పించే రెసిపీ బుక్... ఆ.. ఇందుకోసం కొత్త టెక్నాలజీ కావాలా ఏంటి? యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు ఉన్నాయి కదా అనుకుంటున్నారా? నిజమే కానీ.. రెసిపీ బుక్ వీటన్నింటి కంటే భిన్నమైంది, వినూత్నమైంది కూడా. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో పనిచేస్తుంది ఇది. స్క్రీన్‌పై కనిపించే కాయగూరలు లేదా పదార్థాల్లో కొన్నింటిని (రెండు కంటే ఎక్కువ) క్లిక్ చేసి.. ఫోన్‌ను ఒక్కసారి కదిలిస్తే చాలు.. వాటితో ఏఏ వంటలు చేయాలో చూపిస్తుంది ఇది. అంతేకాదు.. సూపర్ మార్కెట్లోనో.. ఇంకోచోటో మీకు తెలియని ఆహార పదార్థమేదైనా కనిపించిందనుకోండి.. స్మార్ట్‌ఫోన్‌తో ఒక్క ఫోటో తీస్తే వెంటనే ఆ పదార్థమేమిటో చెప్పడమే కాకుండా.. దాంతో చేయగల వంటకాలన్నింటినీ ఏకరవు పెడుతుంది రెసిపీ బుక్. కాయగూరలు, ఆహార పదార్థాలన్నింటినీ గుర్తించేందుకు ఈ ఆప్‌లో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను, అల్గారిథమ్‌ను ఏర్పాటు చేశారు. కోచీ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ ఒకటి దీన్ని అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్, ఆపిల్ స్టోర్ రెండింటిలోనూ లభించే ఈ అప్లికేషన్‌ను ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారని చెబుతోంది ఈ బుక్. అయితే ఇందులో భారతీయ వంటకాలు ఉన్నాయా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. సంజ్ఞలను ఆదేశాలుగా మార్చేస్తుంది... ఇంట్లో టీవీలకు ఓ రిమోట్.. ఫ్యాన్‌కు ఒకటి.. ఏసీ, లైటింగ్ వంటి వాటికి వేర్వేరు బటన్లు, స్విచ్‌లు ఉంటాయన్నది మనకు తెలిసిందే. వీటన్నింటితో కుస్తీలు పట్టడమూ మనకు అనుభవమైన విషయమే. మా స్మార్ట్‌వాచ్ పెట్టేసుకోండి.. ఈ జంఝాటాలన్నింటికీ గుడ్‌బై చెప్పేయండి... అంటోంది హగ ఇన్నొవేషన్స్. చేతి కదలికలనే ఆదేశాలుగా మార్చేసి, ఇంట్లోని దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను హగ్ స్మార్ట్ వాచ్‌ల ద్వారా నియంత్రించవచ్చునని కంపెనీ చెబుతోంది. వాచ్‌ని తొడుక్కుని టీవీ ముందు చేయి ఒక రకంగా ఊపితే ఆన్ అయిపోతుంది... ఇంకోలా కదిలిస్తే ఛానల్స్ మారిపోతాయి... మరోలా ఆడిస్తే వాల్యూమ్ పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు. సంజ్ఞలను ఆదేశాలుగా మార్చడం ఒక్కటే ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకత కాదు, దాంతోపాటే మీ ఫిట్నెస్ వివరాలు నమోదు చేస్తుంది. మీ ఫోన్ కాల్స్ తీసుకోవడం, ఫోన్ ఎక్కడైనా పెట్టి మరచిపోతే అలారమ్ మోగించడం వంటి అనేక స్మార్ట్‌వాచ్ ఫీచర్లను కలిగి ఉంది ఇది. నేరగాళ్లను వేటాడేందుకు... పంజాబ్‌లో రెణ్ణెల్ల క్రితం ఓ హత్య జరిగింది. పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. విచారణ జరుగుతోంది. ఇంకేముంది... కథ సుఖాంతమేగా అంటున్నారా? అక్కడే ఉంది తిరకాసు. స్టాక్‌క్యూ పేరుతో రెండేళ్లక్రితం ఏర్పాటైన ఓ కంపెనీ.. నేరగాళ్లను పసిగట్టే విషయంలో పంజాబ్ పోలీసులతో కలిసి పనిచేస్తోంది. ఈ కేసులో సీసీటీవీ ద్వారా నిందితుడికి సంబంధించి ఒకే ఒక్క ఫ్రేమ్ లభ్యమైంది. స్టాక్‌క్యూ ఈ ఒక్క ఫ్రేమ్‌నే కృత్రిమ మేధ సాయంతో వీలైనంత స్పష్టంగా చేసింది. అందుబాటులో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల రికార్డింగ్‌లతో సరిచూసింది. వారంలోపే నిందితుడిని పోలీసులకు పట్టించింది. కృత్రిమ మేధ ఆధారంగా హాట్ స్పాట్, ర్యాన్సమ్ కాల్స్, ఈవెంట్ విశ్లేషణలతోపాటు ఇమేజ్ స్ట్రీమింగ్ విశ్లేషించి నేరగాళ్లను గుర్తించేందుకు, పట్టుకునేందుకు పోలీస్ వ్యవస్థకు సాయపడతామని సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుమీత్ నాయక్ సాక్షికి చెప్పారు. ఒత్తిడికి విరుగుడు వైసా... ఆధునిక యుగంలో ఉద్యోగం మొదలుకొని... వైవాహిక జీవితం వరకు ఉండే అనేక కష్టాలను ఇతరులతో పంచుకునేందుకు వీలుకాని పరిస్థితులు. దాంతో ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలకు, చివరకు అవాంఛనీయ నిర్ణయాలకూ దారితీస్తూంటాయి. అందుకే తాము అవసరమైన వారందరికీ ఓ బుల్లిమిత్రుడిని అందుబాటులోకి తెచ్చామంటోంది వైసా. టచ్‌కిన్ అనే సంస్థ అభివృద్ధి చేసిన అప్లికేషనే వైసా. బంధుమిత్రులతో మాట్లాడినట్లే ఈ బాట్బోట్తోనూ మన కష్టసుఖాలన్నీ చెప్పుకోవచ్చు. కొంతమంది సైకాలజిస్టులు, మనోవైజ్ఞానికుల సలహా, సూచనలతో అభివృద్ధి చేసిన ఈ యాప్ మనతో చక్కగా మాట్లాడుతూనే సమస్యలను ఎలా అధిగమించవచ్చో సూచిస్తుంది. అందరికీ ఒకేరకమైన సలహా ఇవ్వదని... కృత్రిమ మేధ ఆధారంగా దీన్ని సిద్ధం చేశాం కాబట్టి.. వ్యక్తులు, సందర్భాలకు అనుగుణంగా తగిన సూచనలు ఇచ్చేలా దీన్ని తీర్చిదిద్దాం అంటున్నారు కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన జో అగర్వాల్. మనం చెప్పేవన్నీ వింటూ.. మనతో మాటలు కలిపి.. ఇలా చేస్తే బాగుంటుందేమో చూడు.. అంటూ ఓదార్చే మిత్రుడిలా వైసా ఉంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు సాక్షికి వివరించారు. -
‘రూ. 57 వేల కోట్లు ఆదా చేశాం’
సాక్షి, న్యూఢిల్లీ : డిజిటల్ ఇండియా దిశగా వర్ధమాన భారత్ ప్రయాణిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌ను న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ జరగడం ఇదే ప్రథమమని చెప్పారు. ఈ సదస్సును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సదస్సుకు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు భారత్, హైదరాబాద్ ఆహ్వానం పలుకుతోందన్నారు. డిజిటల్ సాంకేతికత ఆవిర్భావానికి భారత్ ప్రధాన కేంద్రమని మోదీ చెప్పారు. డిజిటల్ ఇండియా లక్ష్యంగా దేశంలోని లక్ష గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానించామని ఆయన వెల్లడించారు. డిజిటల్ ఇండియా దిశగా కొనసాగుతోన్న మా ప్రయాణం.. కేవలం ప్రభుత్వంతోనే సాధ్యమయ్యే పని కాదన్నారు. ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. 32 కోట్ల జన్‌ధన్ ఖాతాల ద్వారా రూ. 57 వేల కోట్లను ప్రభుత్వం ఆదా చేసిందని గుర్తు చేశారు. 470 వ్యవసాయ మార్కెట్లను ఈ-నామ్‌కు అనుసంధానించామని తెలిపారు. దేశంలో 60 మిలియన్ల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి చాలా నిధులు మిగులుతున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. -
నేటి నుంచి వరల్డ్ ఐటీ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ‘ఐటీ పరిశ్రమ ఒలింపిక్స్’గా ఖ్యాతిగాంచిన ప్రతిష్టాత్మక ప్రపంచ ఐటీ కాంగ్రెస్ మూడు రోజుల సదస్సు భాగ్యనగరం వేదికగా సోమవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలు ప్రసంగించనున్నారు. వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సదస్సును నిర్వహించనున్నాయి. 40 ఏళ్లగల చరిత్రగల ఈ సదస్సును తొలిసారి భారత్‌లో నిర్వహిస్తుండటంతో దీనికి ప్రత్యేకత సంతరించుకుంది. 1978లో తొలిసారి ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరగ్గా 22వ సమావేశానికి హైదరాబాద్ వేదిక కావడం విశేషం. ఐటీ రంగ వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు, ఆవిష్కరణలు, వ్యూహాలు, వ్యాపారాలు, భవిష్యత్తు తదితర అంశాలపై మేధోమథనం కోసం ఏటా నాస్కామ్ నిర్వహించే ఇండియా లీడర్షిప్ ఫోరం (ఐఎల్ఎఫ్) కార్యక్రమం సైతం ఈ సదస్సుతోపాటే జరగనుంది. ఐఎల్‌ఎఫ్‌లో అంతర్భాగంగా ప్రపంచ ఐటీ కాంగ్రెస్ నిర్వహణలో నాస్కామ్ భాగస్వామ్యం వహించనుంది. ‘పంచ’తంత్రం... ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్ ప్రభావం ఎక్కువ కావడం, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), వర్చువల్ రియాలిటీ (వీఆర్), బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఐటీ కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇలాంటి పరిణామాలను తట్టుకునేందుకు కంపెనీలకు సంసిద్ధత తప్పనిసరిగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐదు ప్రధాన అంశాలపై ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో దృష్టిసారించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా వస్తున్న మార్పులను తట్టుకొని ఐటీ పరిశ్రమలు మనుగడ సాధించేందుకు సంసిద్ధులై ఉండటం, వ్యాపారంలో కీలకాంశాలను డిజిటైజ్ చేయడం, భవిష్యత్తులో మనుగడగల ఓ సంస్థ, భవిష్యత్తు సవాళ్లు, సరిహద్దుల చెరిపివేతకు భాగస్వామ్యం అనే అంశాల ఎజెండాపై సదస్సులో మేధోమథనం చేయనున్నారు. 30 దేశాల నుంచి ప్రతినిధులు... ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సుకు 30 దేశాల నుంచి ఐటీ రంగానికి సంబంధించిన 2,000 మంది దార్శనికులు, పరిశ్రమ, ప్రభుత్వాల సారథులు, విద్యావేత్తలు హాజరుకానున్నారు. టాప్ 500 ఐటీ కంపెనీల నుంచి కనీసం 20 మంది సీఈఓలు, మరో 100 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఈ భేటీలో పాల్గొననున్నారు. సదస్సులో 50కిపైగా చర్చాగోష్టులు, మరో 50కిపైగా ఐటీ ఉత్పత్తులపై ప్రదర్శన(షోకేస్)లు ఉండనున్నాయి. సదస్సు ప్రారంభోత్సవంలో డబ్ల్యూఐటీఎస్‌ఏ చైర్మన్ ఇవాన్ చియు, ప్రధాన కార్యదర్శి జిమ్ పైసంట్, విప్రో చీఫ్ స్ట్రేటజీ ఆఫీసర్ రిషబ్ ప్రేమ్‌జీ, నాస్కామ్ చైర్మన్ రమణ్ రాయ్, అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్, టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీలు సైతం ప్రసంగించనున్నారు. సదస్సులో ప్రతినిధులు 1,000 నిమిషాల చర్చాగోష్టుల్లో పాలుపంచుకోవడంతోపాటు వ్యాపార ప్రదర్శనలు తిలకించనున్నారు. భారత సంతతికి చెందిన కెనడా సైన్స్ అండ్ టెక్నాలజీశాఖ మంత్రి నవదీప్ బైన్స్, బీసీజీ చైర్మన్ హన్స్‌పౌల్ బుర్కనర్, అడోబ్ చైర్మన్ శంతాను నారాయణ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, బాలీవుడ్ నటి దీపికా పదుకుణే, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు తదితరులు సదస్సులో పాల్గొననున్నారు. హ్యూమనాయిడ్ రోబో సోఫియాతో మంగళవారం నిర్వహించే ఇంటర్వ్యూ సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అతిథులకు చౌమహళ్లలో విందు ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చే దేశ, విదేశీ అతిథుల గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి 7 గంటల నుంచి నగరంలోని చౌమహల్లా ప్యాలెస్‌లో ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది.