పరి పరిశోధన | special story to World IT Congress | Sakshi
Sakshi News home page

పరి పరిశోధన

Feb 20 2018 12:32 AM | Updated on Feb 20 2018 12:32 AM

special  story to World IT Congress - Sakshi

టెక్నాలజీ

కొత్త టెక్నాలజీ అనగానే మనలో చాలామంది... అది ఏ అమెరికాలోనో.. యూరప్‌లోనో తయారయ్యింది అనుకుంటాం. సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఆ దేశాలు ఎంతో ముందున్నాయని మన అంచనా. అయితే భారత్‌ కూడా ఏమీ వెనుకబడి లేదని యువ స్టార్టప్‌లు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైన వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన కొన్ని వినూత్న స్టార్టప్‌ టెక్నాలజీలు ఇలా ఉన్నాయి.

వంటలు నేర్పించే రెసిపీ బుక్‌...
ఆ.. ఇందుకోసం కొత్త టెక్నాలజీ కావాలా ఏంటి? యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు ఉన్నాయి కదా అనుకుంటున్నారా? నిజమే కానీ.. రెసిపీ బుక్‌ వీటన్నింటి కంటే భిన్నమైంది, వినూత్నమైంది కూడా. స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ సాయంతో పనిచేస్తుంది ఇది. స్క్రీన్‌పై కనిపించే కాయగూరలు లేదా పదార్థాల్లో కొన్నింటిని (రెండు కంటే ఎక్కువ) క్లిక్‌  చేసి.. ఫోన్‌ను ఒక్కసారి కదిలిస్తే చాలు.. వాటితో ఏఏ వంటలు చేయాలో చూపిస్తుంది ఇది. అంతేకాదు.. సూపర్‌ మార్కెట్‌లోనో.. ఇంకోచోటో మీకు తెలియని ఆహార పదార్థమేదైనా కనిపించిందనుకోండి.. స్మార్ట్‌ఫోన్‌తో ఒక్క ఫోటో తీస్తే వెంటనే ఆ పదార్థమేమిటో చెప్పడమే కాకుండా.. దాంతో చేయగల వంటకాలన్నింటినీ ఏకరవు పెడుతుంది రెసిపీ బుక్‌. కాయగూరలు, ఆహార పదార్థాలన్నింటినీ గుర్తించేందుకు ఈ ఆప్‌లో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను, అల్గారిథమ్‌ను ఏర్పాటు చేశారు. కోచీ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌ ఒకటి దీన్ని అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్, ఆపిల్‌ స్టోర్‌ రెండింటిలోనూ లభించే ఈ అప్లికేషన్‌ను ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకుని వాడుతున్నారని చెబుతోంది ఈ బుక్‌. అయితే ఇందులో భారతీయ వంటకాలు ఉన్నాయా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు.

సంజ్ఞలను ఆదేశాలుగా మార్చేస్తుంది...
ఇంట్లో టీవీలకు ఓ రిమోట్‌.. ఫ్యాన్‌కు ఒకటి.. ఏసీ, లైటింగ్‌ వంటి వాటికి వేర్వేరు బటన్‌లు, స్విచ్‌లు ఉంటాయన్నది మనకు తెలిసిందే. వీటన్నింటితో కుస్తీలు పట్టడమూ మనకు అనుభవమైన విషయమే. మా స్మార్ట్‌వాచ్‌ పెట్టేసుకోండి.. ఈ జంఝాటాలన్నింటికీ గుడ్‌బై చెప్పేయండి... అంటోంది హగ ఇన్నొవేషన్స్‌. చేతి కదలికలనే ఆదేశాలుగా మార్చేసి, ఇంట్లోని దాదాపు అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలను హగ్‌ స్మార్ట్‌ వాచ్‌ల ద్వారా నియంత్రించవచ్చునని కంపెనీ చెబుతోంది. వాచ్‌ని తొడుక్కుని టీవీ ముందు చేయి ఒక రకంగా ఊపితే ఆన్‌ అయిపోతుంది... ఇంకోలా కదిలిస్తే ఛానల్స్‌ మారిపోతాయి... మరోలా ఆడిస్తే వాల్యూమ్‌ పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు. సంజ్ఞలను ఆదేశాలుగా మార్చడం ఒక్కటే ఈ స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకత కాదు, దాంతోపాటే మీ ఫిట్‌నెస్‌ వివరాలు నమోదు చేస్తుంది. మీ ఫోన్‌ కాల్స్‌ తీసుకోవడం, ఫోన్‌ ఎక్కడైనా పెట్టి మరచిపోతే అలారమ్‌ మోగించడం వంటి అనేక స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లను కలిగి ఉంది ఇది. 

నేరగాళ్లను వేటాడేందుకు...
పంజాబ్‌లో రెణ్ణెల్ల క్రితం ఓ హత్య జరిగింది. పోలీసులు కొందరిని అరెస్ట్‌ చేశారు. విచారణ జరుగుతోంది. ఇంకేముంది... కథ సుఖాంతమేగా అంటున్నారా? అక్కడే ఉంది తిరకాసు. స్టాక్‌క్యూ పేరుతో రెండేళ్లక్రితం ఏర్పాటైన ఓ కంపెనీ.. నేరగాళ్లను పసిగట్టే విషయంలో పంజాబ్‌ పోలీసులతో కలిసి పనిచేస్తోంది. ఈ కేసులో సీసీటీవీ ద్వారా నిందితుడికి సంబంధించి ఒకే ఒక్క ఫ్రేమ్‌ లభ్యమైంది. స్టాక్‌క్యూ ఈ ఒక్క ఫ్రేమ్‌నే కృత్రిమ మేధ సాయంతో వీలైనంత స్పష్టంగా చేసింది. అందుబాటులో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లు, ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల రికార్డింగ్‌లతో సరిచూసింది. వారంలోపే నిందితుడిని పోలీసులకు పట్టించింది. కృత్రిమ మేధ ఆధారంగా హాట్‌ స్పాట్, ర్యాన్‌సమ్‌ కాల్స్, ఈవెంట్‌ విశ్లేషణలతోపాటు ఇమేజ్‌ స్ట్రీమింగ్‌ విశ్లేషించి నేరగాళ్లను గుర్తించేందుకు, పట్టుకునేందుకు పోలీస్‌ వ్యవస్థకు సాయపడతామని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ సుమీత్‌ నాయక్‌ సాక్షికి చెప్పారు.

ఒత్తిడికి విరుగుడు వైసా...
ఆధునిక యుగంలో ఉద్యోగం మొదలుకొని... వైవాహిక జీవితం వరకు ఉండే అనేక కష్టాలను ఇతరులతో పంచుకునేందుకు వీలుకాని పరిస్థితులు. దాంతో ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలకు, చివరకు అవాంఛనీయ నిర్ణయాలకూ దారితీస్తూంటాయి. అందుకే తాము అవసరమైన వారందరికీ ఓ బుల్లిమిత్రుడిని అందుబాటులోకి తెచ్చామంటోంది వైసా. టచ్‌కిన్‌ అనే సంస్థ అభివృద్ధి చేసిన అప్లికేషనే వైసా. బంధుమిత్రులతో మాట్లాడినట్లే ఈ బాట్‌బోట్‌తోనూ మన కష్టసుఖాలన్నీ చెప్పుకోవచ్చు. కొంతమంది సైకాలజిస్టులు, మనోవైజ్ఞానికుల సలహా, సూచనలతో అభివృద్ధి చేసిన ఈ యాప్‌ మనతో చక్కగా మాట్లాడుతూనే సమస్యలను ఎలా అధిగమించవచ్చో సూచిస్తుంది. అందరికీ ఒకేరకమైన సలహా ఇవ్వదని... కృత్రిమ మేధ ఆధారంగా దీన్ని సిద్ధం చేశాం కాబట్టి.. వ్యక్తులు, సందర్భాలకు అనుగుణంగా తగిన సూచనలు ఇచ్చేలా దీన్ని తీర్చిదిద్దాం అంటున్నారు కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన జో అగర్వాల్‌. మనం చెప్పేవన్నీ వింటూ.. మనతో మాటలు కలిపి.. ఇలా చేస్తే బాగుంటుందేమో చూడు.. అంటూ ఓదార్చే మిత్రుడిలా వైసా ఉంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు సాక్షికి వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement