ప్రజలే సారథులు | PM Modi inaugurates World Congress IT | Sakshi
Sakshi News home page

ప్రజలే సారథులు

Published Tue, Feb 20 2018 2:09 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

PM Modi inaugurates World Congress IT - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘డిజిటల్‌ విధానాల్లో ప్రజలకు సేవలందించేందుకు ప్రారంభించిన ప్రయాణమే డిజిటల్‌ ఇండియా. ప్రజల భాగస్వామ్యంతో మూడున్నరేళ్లలో మేం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. డిజిటల్‌ ఇండియా ఇక కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ప్రజల జీవన విధానం. దీన్ని ప్రజలే ముందుండి నడుపుతున్నారు’’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్‌ ఆవిష్కరణలకు మన దేశం చిరునామాగా మారిందని పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు భౌగోళిక దూరాలు ఇక ఏమాత్రం అవాంతరం కాదన్నారు. కొత్త ఆవిష్కరణలతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. వరల్డ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ అలయెన్స్‌ (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌(నాస్కామ్‌), రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సోమవారం ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ ప్రారంభమైంది. ఈ సదస్సును ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రారంభించినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

రూ.57 వేల కోట్లు ఆదా చేశాం
టెక్నాలజీకి ప్రపంచంలోనే భారత్‌ అత్యంత అనుకూల దేశమని, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ద్వారా ఇప్పటికే దేశంలో లక్షకు పైగా గ్రామాలు ఇంటర్నెట్‌ సదుపాయం కలిగి ఉన్నాయని ప్రధాని చెప్పారు. ‘‘దేశంలో 121 కోట్ల మొబైల్‌ ఫోన్లున్నాయి. 50 కోట్ల ఇంటర్నెట్‌ వినియోగదారులున్నారు. 120 కోట్ల మందికి ఆధార్‌ కార్డు ఉంది. పేదలకు జారీ చేసిన జన్‌ధన్‌ బ్యాంక్‌ ఖాతాలు, మొబైల్‌ ఫోన్లను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా సంక్షేమ పథకాల్లో రూ.57 వేల కోట్ల నిధులు ఆదా అయ్యాయి. దేశవ్యాప్తంగా 172 ఆస్పత్రుల్లో 2.2 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగాయి. స్కాలర్‌షిప్‌ల కోసం 1.4 కోట్ల మంది విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాల వెబ్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. రైతులకు సరైన మద్దతు ధర అందించేందుకు ప్రవేశపెట్టిన ఈ–నామ్‌ వెబ్‌సైట్‌లో 66 లక్షల మంది రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. భీమ్‌ యాప్‌తో గత జనవరిలో రూ.15 వేల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇటీవల తెచ్చిన ‘ఉమంగ్‌’యాప్‌ ద్వారా 185 ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చాం. దేశంలో 2.8 లక్షల కామన్‌ సర్వీస్‌ సెంటర్లు ప్రజలకు ఎన్నో డిజిటల్‌ సేవలందిస్తున్నాయి. వీటి ద్వారా 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అందులో లక్షల మంది మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలున్నారు’’అని ప్రధాని వివరించారు.

మొబైల్‌ పరిశ్రమలు 2 నుంచి 118కి..
2014 నాటికి దేశంలో కేవలం రెండు మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి పరిశ్రమలే ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్యను 118కు పెంచామని, అందులో కొన్ని ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ల కంపెనీలు ఉన్నాయని ప్రధాని చెప్పారు. కృత్రిమ మేధోశక్తి (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) రంగంలో పరిశోధనల కోసం ముంబై వర్సిటీలో వాద్వానీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సంస్థను ఆదివారమే ప్రారంభించిన సంగతిని గుర్తుచేశారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్‌ సమ్మిట్‌కు వెళ్లిన సందర్భంగా సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు అక్కడ ఏర్పాటు చేసిన ‘మ్యూజియం ఆఫ్‌ ఫ్యూచర్‌’ను సందర్శించానని చెప్పారు. ఈ సదస్సుకు వచ్చిన వారిలో కొత్త పరిజ్ఞాన ఆవిష్కర్తలెందరో ఉన్నారంటూ వారికి అభినందనలు తెలిపారు. మానవజాతి ఉజ్వల భవిష్యత్‌ కోసం వీరంతా కృషి చేస్తున్నారని కొనియాడారు.

హైదరాబాద్‌ వంటకాలను ఆస్వాదించండి
‘‘నేను హైదరాబాద్‌లో ఉండాల్సి ఉంది. అయినా ఆనందంగానే ఉంది. సుదూర ప్రాంతం నుంచి మీ ముందు ప్రసంగించే అవకాశాన్ని సాంకేతిక పరిజ్ఞానం కల్పించింది’’అని ప్రధాని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఘన చరిత్ర తెలుసుకోవడంతోపాటు అక్కడి రుచికరమైన వంటకాలను ఆస్వాదించాలని సదస్సుకు తరలి వచ్చిన విదేశీ ప్రతినిధులకు సూచించారు. భారతదేశం పురాతన, వైవిధ్య, ఘన చరిత్ర, సంస్కృతికి నిలయమైనప్పటికీ ఏకత్వమనే నినాదంతో పురోగమిస్తోందన్నారు. వసుధైక కుటుంబం భావన భారతీయ తత్వంలో లోతుగా పాతుకుపోయిందన్నారు.

ఐటీలో ఈ ఎనిమిదే కీలకం
ప్రస్తుతం ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, వర్చువల్‌ రియాలిటీ, రొబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బిగ్‌ డాటా అనాలిటిక్స్, 3డీ ప్రింటింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, సోషల్‌ అండ్‌ మొబైల్‌ అనే ఎనిమిది రకాల అంశాలు కీలకంగా మారాయని ప్రధాని చెప్పారు. తన సూచన మేరకు నాస్కామ్‌ ఈ జాబితాను తయారు చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీటిపై శిక్షణ కోసం నాస్కామ్‌ రూపొందించిన ‘స్కిల్స్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌’కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాత టెక్నాలజీని వెనక్కి నెట్టి కొత్త సాంకేతికతను సదస్సులో చర్చనీయాంశంగా తీసుకోవడాన్ని ప్రధాని స్వాగతించారు. నూతన టెక్నాలజీ దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న సిబ్బందికి ‘రీ స్కిల్లింగ్‌’కల్పించే అంశంపై దృష్టి సారించామన్నారు. ఈ సదస్సులో ప్రసంగించేందుకు ఆహ్వానం పొందిన యంత్ర మనిషి (హ్యూమనాయిడ్‌ రోబో) సోఫియా.. టెక్నాలజీ శక్తి సామర్థ్యాలకు అద్దం పడుతోందన్నారు. ఇంటెలిజెంట్‌ ఆటోమేషన్‌తో ఉద్యోగాల స్వరూపంలో వస్తున్న మార్పులపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement