
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : డిజిటల్ ఇండియా దిశగా వర్ధమాన భారత్ ప్రయాణిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌ను న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ జరగడం ఇదే ప్రథమమని చెప్పారు. ఈ సదస్సును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
సదస్సుకు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు భారత్, హైదరాబాద్ ఆహ్వానం పలుకుతోందన్నారు. డిజిటల్ సాంకేతికత ఆవిర్భావానికి భారత్ ప్రధాన కేంద్రమని మోదీ చెప్పారు. డిజిటల్ ఇండియా లక్ష్యంగా దేశంలోని లక్ష గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానించామని ఆయన వెల్లడించారు. డిజిటల్ ఇండియా దిశగా కొనసాగుతోన్న మా ప్రయాణం.. కేవలం ప్రభుత్వంతోనే సాధ్యమయ్యే పని కాదన్నారు. ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు.
32 కోట్ల జన్‌ధన్ ఖాతాల ద్వారా రూ. 57 వేల కోట్లను ప్రభుత్వం ఆదా చేసిందని గుర్తు చేశారు. 470 వ్యవసాయ మార్కెట్లను ఈ-నామ్‌కు అనుసంధానించామని తెలిపారు. దేశంలో 60 మిలియన్ల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి చాలా నిధులు మిగులుతున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment