ఖమ్మం మెడికల్ కాలేజీలో కలకలం
నల్లగొండలో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్– ముగ్గురు విద్యార్థులు, ఓ జూనియర్ డాక్టర్ సస్పెండ్
ఖమ్మం వైద్యవిభాగం/ నల్లగొండ టౌన్: ఖమ్మం మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థి భిన్నంగా హెయిర్ కట్ చేయించుకున్నాడని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. ఇక నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనలో విద్యార్థులతో పాటు జూనియర్ డాక్టర్‌ను సైతం సస్పెండ్ చేశారు.
వివరాలు.. ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థికి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ కావడం గమనార్హం.
ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది చేరిన ములుగుకు చెందిన విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరి కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తూ ఇలా వ్యవహరించొద్దని సూచించడంతో ఆ విద్యార్థి సెలూన్‌కు వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు.
కాగా, ఈ విషయం బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జన్)కు తెలియడంతో ఆగ్రహించిన ఆయన విద్యార్థిని సెలూన్‌కు తీసుకెళ్లి ఏకంగా గుండు గీయించాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు.
కాగా, ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడమే కాక విచారణకు ఫోర్‌మెన్ కమిటీని నియమించామని తెలిపారు.
నల్లగొండ కాలేజీలో ర్యాగింగ్ కలకలం!
నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థినులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలతో ముగ్గురు సీనియర్ విద్యార్థులను, ఒక జూనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
సీనియర్ మెడికోలతో పాటు జూనియర్ డాక్టర్ కూడా విద్యార్థినులను ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులకు గురిచేశారన్న ఫిర్యాదుతో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం విద్యార్థిని నెల రోజులు, ఇద్దరు నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేసినట్లు కాలేజీ వర్గాల ద్వారా తెలిసింది.
అయితే మొదటిసారి ర్యాగింగ్ విషయం బహిర్గతం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ర్యాగింగ్ విషయంపై కళాశాల ప్రిన్సిపల్‌ను వివరణ కోరడానికి ‘సాక్షి’ప్రయత్నించగా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment