సాక్షి, సంగారెడ్డి: పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న వెలిమల నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థిని బాత్‌రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కళాశాల యాజమాన‍్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ బుధవారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతదేహాన్ని పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డుకున్నారు. అంతేకాకుండా మార్చురీలో ఉన్న సంధ్యారాణి మృతదేహాన్ని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మృతదేహం తరలింపును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మృతురాలి తండ్రిని ఓ పోలీస్ అధికారి బూట్ కాళ్లతో తన్నారు. ఈ సంఘటనతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమువుతున్నాయి. దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబీకులు కోరుతున్నారు. న్యాయం చేయమని అడిగితే దౌర్జన్యానికి దిగుతారా అని ప్రశ్నిస్తున్నారు.
కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలి
సంధ్యారాణి మృతిపై నిరసన వ్యక్తం చేసిన ఏబీవీపీ, తెలంగాణ జన సమితి విద్యార్థి నేతలు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసులు అదుపులోనే ఉన్నారు. అరెస్టు చేసిన విద్యార్థి నేతల్ని పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. సంధ్యారాణి తండ్రి చంద్రశేఖర్‌ను బూటుకాలితో తన్నిన కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. నారాయణ విద్యా సంస్థ ల యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయకపోతే విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు.
ఎస్పీ చందనా దీప్తి సీరియస్
పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద సంధ్యారాణి తండ్రి చంద్రశేఖర్‌ను బూటు కాలితో కానిస్టేబుల్ తన్నిన ఘటనపై సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ చందనా దీప్తి సీరియస్ అయ్యారు. కానిస్టేబుల్ శ్రీధర్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఎస్పీ చందనా దీప్తి ఆదేశించారు.
కాగా, వెలిమేల గ్రామంలోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజ్ లో సంధ్యారాణి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో బాత్‌రూమ్‌లోకి వెళ్లిన సంధ్యారాణి అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న యాజమాన్యం నలగండ్లలోని సిటీజన్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment