వేంపల్లె: తండ్రి చనిపోయి పుట్టెదు దుఃఖంలో ఉన్నప్పటికీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ల్యాబ్ పరీక్షలకు హాజరయ్యాడు. వైఎస్‌ఆర్ జిల్లా వేంపల్లె ఎస్సీ కాలనీకి చెందిన ముద్ది సుబ్బరాయుడు(50) బుధవారం అనారోగ్యంతో మృతిచెందాడు. మృతునికి భార్య భవాని, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రెండవ కుమారుడు ముద్ది నారాయణస్వామి వేంపల్లె వాసవీ జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
బుధవారం ఉదయం రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ) ప్రాక్టికల్ పరీక్షకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా తండ్రి చనిపోయాడు. బాగా చదువుకోవాలని, తనలాగా కూలీగా మారవద్దని తండ్రి పదే పదే చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో ఓ వైపు దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు జరిగిన ప్రయోగ పరీక్షలకు హాజరయ్యాడు. అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.