స్కూల్ ఫీజు చెల్లించలేదని ప్రిన్సిపాల్ మందలింపు
టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
మేడ్చల్ పట్టణంలో ఘటన
బాచుపల్లిలో ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని
హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి
గోప్యంగా ఉంచిన కళాశాల యాజమాన్యం
విద్యార్థి సంఘాల ఆందోళనలు
కార్పొరేట్ విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా పని చేస్తూ ఫీజుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి, విద్యార్థుల మానసిక స్థితి గురించి ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నాయి. కొంచెం కూడా మానవత్వాన్ని చూపడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురై చావు నోట్లో తలపెడుతున్నారు.
స్కూల్ ఫీజు చెల్లించలేదని పాఠశాల ప్రిన్సిపాల్ తోటి విద్యార్థుల ముందే మందలించడంతో మనస్తాపానికి గురైన టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. కాగా.. ఇంటర్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మేడ్చల్ రూరల్: మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్‌లో కమల, వెంకటేశ్వర్లు దంపతుల కవల పిల్లలు అఖిల, విక్రమ్‌లు 10వ తరగతి చదువుతున్నారు. వీరిరువురి ఫీజు రూ.30 వేలు చెల్లించాల్సి ఉంది. అందులో రూ.10 వేలు చెల్లించారు. మిగతా మొత్తం చెల్లించడంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 8న అఖిల పాఠశాలకు వెళ్లగా ప్రిన్సి పాల్ రమాదేవి తోటి విద్యార్థినుల ముందే అవమానకరంగా మాట్లాడింది. తెలిసిన వారితో ఫీజు కోసం తనను ప్రిన్సిపాల్ టార్చర్ చేస్తున్నారని చెప్పుకొని ఏడ్చింది. సోమవారం పాఠశాలకు వెళ్లలేదు. మంగళవారం తల్లి ఇంట్లో ఉండగానే అఖిల వేరే గదిలోకి వెళ్లి గడియ వేసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన
పాఠశాల యాజమాన్యం తీరుతో విద్యార్థిని అఖిల ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఆందోళన దిగారు. పాఠశాల ముందు బైఠాయించి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వేధింపులు నిజం కాదు..
ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, నిర్వాహకులు వివరణ ఇస్తూ తాము అఖిలను వేధించలేదని తెలిపారు. అందరితో పాటు తనకు ఫీజు చెల్లించాలని గుర్తు చేశామన్నారు. కాగా ఘటనకు కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్‌పై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్మ
నిజాంపేట్ : ఇంటర్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా కృష్ణాపురంనకు చెందిన బైసు శ్రీనివాస్, దేవి దంపతులు నగరంలోని బోరబండ ఫేజ్– 3లో నివాసం ఉంటున్నారు. వీరి కూతురు పూజిత (17) బాచుపల్లిలోని ఎస్‌ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. బుధవారం ఉదయం హాస్టల్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కాలేజీ సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
పూజిత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా.. మొదట కాలేజీ సిబ్బంది పూజిత బాత్రూంలో జారిపడిందని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. వారిని హాస్పిటల్‌కు రావాలని సూచించారు. కొద్ది సేపటి తర్వాత చనిపోయింది గాంధీ ఆసుపత్రికి రావాలని చెప్పడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమ కూతురు మృతి అనుమానాస్పదంగా ఉందని పూజిత తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడితోనే విద్యార్థిని మృతి చెందిందని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
Comments
Please login to add a commentAdd a comment