
పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్థి మృతి
కడప: ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పరీక్ష రాస్తూ అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి కుప్పకూలిపోయాడు. ఈ హృదయవిదారకమైన ఘటన కడప జిల్లా రాజంపేటలో గురువారం చోటు చేసుకుంది. పెనగలూరు మండలం ఓబిలి గ్రామానికి చెందిన కె. వెంకటేశ్వర్లు స్థానిక కాకతీయ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ఈ రోజు ద్వితీయ సంవత్సరం పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రమైన గీతాంజలి పాఠశాలకు చేరుకున్నాడు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి వెంకటేశ్వర్లును స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. గతంలోనే వెంకటేశ్వర్లుకు గుండె సంబంధమైన సమస్యలు ఉన్నాయని వాటివల్లే మృతి చెంది ఉండవచ్చని తోటి విద్యార్థులు ఈ సందర్బంగా వెల్లడించారు.