ప్రాక్టికల్ పరీక్షలను పరిశీలిస్తున్న డీఐఈవో (ఫైల్)
సాక్షి, ఆదిలాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 1 నుంచి 20 వరకు నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ అంతా అస్తవ్యస్తంగా తయారైందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంటరీ్మడియెట్ పరీక్ష నిర్వహణ అధి కారులు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాసుల కోసం కొంతమంది పరీక్ష నిర్వహణ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. కొంతమంది పరీక్షల ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అధికారులు కాసులు తీసుకుంటూ పరీక్షల్లో మార్కులు వేస్తున్నట్లు సమాచారం.
జిల్లాలో..
జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్న ఎంపీసీ, బైపీసీ, జనరల్ విద్యార్థులు మొత్తం 5,272 మంది ఉన్నారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 1884 మంది, బైపీసీ విద్యార్థులు 3388 ఉండగా, ఒకేషనల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 749, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 655 మంది ఉన్నారు. మొత్తం ఒకేషనల్ విద్యార్థులు 1404 మంది ఉన్నారు. వీరికి విడతల వారీగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కాసులు ముట్టజెప్పి..
ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అదే కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్ష కేంద్రం ఉండడంతో జోరుగా కాపీయింగ్ జరుగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రైవేట్ కళాశాలలకు అదే కళాశాలకు చెందిన లెక్చరర్ ఒకరు ఇంటర్నల్‌గా వ్యవహరిస్తుండగా, మరో కళాశాలకు చెందిన లెక్చరర్ ఎక్స్‌టర్నల్‌గా ఉంటారు. విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించి పేపర్లు మూల్యాంకణం చేసి మార్కులు వేస్తారు. అయితే మార్కుల కోసం కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎక్స్‌టర్నల్‌గా వచ్చిన కొంతమందికి విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక బ్యాచ్ పరీక్షకు రూ.3వేల వరకు అప్పజెబుతున్నారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నాలుగు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. మొత్తం 120 మార్కులు ఉండగా, ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వంద శాతం మార్కులు వేయడం గమనార్హం.
ఇందుకు విద్యార్థుల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు ఈ మార్కులు దోహద పడనుండడంతో వారు సైతం కాసులు ముట్టజెబుతున్నారు. కాగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం ప్రాక్టికల్‌లో 30 మార్కులకు గాను 11 నుంచి 24 లోపు మాత్రమే మార్కులు వేస్తున్న అధికారులు ప్రైవేట్ విద్యార్థులకు మాత్రం 30 మార్కులకు 29 నుంచి 30 వరకు వేయడం గమనార్హం.
అయితే ఈ విషయమై ఓ అధికారిని అడగగా ప్రైవేట్ కళాశాలల్లో రూ.1500 నుంచి రూ.2వేల వరకు మాత్రమే ఇస్తున్నారని చెప్పడం కొసమెరుపు. ఇంత జరుగుతున్నా ఇంటరీ్మడియెట్ బోర్డు అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారు మౌనంగా ఉండటం పట్ల వారికి కూడా వాటా అందుతుందా అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మా దృష్టికి రాలేదు
ప్రాక్టికల్ పరీక్షల్లో ఎక్స్‌టర్నల్ విధులు నిర్వహించే లెక్చరర్లకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు డబ్బులు ఇస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే చర్యలు తీసుకుంటాం.
– దస్రునాయక్, డీఐఈవో, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment