సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ మూల్యాంకనం కూడా సమస్యగా తయారైంది. వచ్చే నెల 12 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 27 నుంచి ప్రారంభం అయ్యే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏ ప్రాంతంలోని విద్యార్థుల పేపర్లను ఆ ప్రాంతంలోనే చేయాలన్న డిమాండ్లు వస్తుండటంతో విద్యాశాఖ, ప్రభుత్వ అధికారులకు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
విభజన ఉద్యమంలో భాగంగా ఇరుప్రాంతాల్లోని ఉపాధ్యాయులు, లెక్చరర్లు సమ్మెలకు దిగిన నేపథ్యంలో మూల్యాంకనం వ్యవహారంలో ప్రాంతీయ అభిమానం పనిచేస్తే అదే పెద్ద సమస్యగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
సాధారణంగా మూల్యాంకనం అనేది రహస్య వ్యవహారమే అయినప్పటికీ ఒక ప్రాంతంలోని పేపర్లు మరో ప్రాంతానికి వెళితే తక్కువ మార్కులు వేసే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన ఇటు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, తల్లిదండ్రుల్లో నెలకొంది. దీంతో ఏ ప్రాంత జవాబు పత్రాలను ఆ ప్రాంతంలోనే మూల్యాంకనం చేయించాలని లెక్చరర్ల సంఘాలు ఇంటర్మీడియట్ బోర్డుకు విజ్ఞాపన పత్రాలు అందజేశాయి.
దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఏ ప్రాంతం వారి పేపర్లను ఆ ప్రాంతంలోనే మూల్యాంకనం చేస్తే టెన్త్‌లో ఎక్కువ మార్కులు వేసుకున్నా తీవ్రస్థాయిలో సమస్య లేకపోయినా ఇంటర్మీడియట్‌లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటం, జేఈఈ మెయిన్‌లో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా టాప్-20 పర్సంటైల్ విధానం ఉన్న పరిస్థితుల్లో ప్రాంతీయ అభిమానంతో ఎక్కువ మార్కులు వేస్తే ఎలాగన్న గందరగోళం నెలకొంది. దీనివల్ల బాగా చదివే విద్యార్థులకు నష్టం వాటిల్లడంతోపాటు అనర్హులకు మేలు జరిగే పరిస్థితి నెలకొంది.
తక్కువ మార్కులు వచ్చి ఎవరికైనా నష్టం జరిగితే రీవ్యాల్యుయేషన్ వంటి ప్రత్యామ్నాయం ఉన్నా.. అది విద్యార్థులందరి విషయంలో కష్టసాధ్యమనే వాదన ఉంది. అలాగని ఏ ప్రాంత పేపర్లు ఆ ప్రాంతానికి పంపితే, అక్కడ ప్రాంతీయ అభిమానం పనిచేస్తే సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.