సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో 2014-15 విద్యా సంవత్సరంలో సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ ఆమోదం తెలిపింది. 9 పేపర్ల విధానంతోపాటు 80 శాతం మార్కుల కు పబ్లిక్ పరీక్షల నిర్వహణ, ఇంటర్నల్స్‌కు 20 శాతం మార్కుల విధానానికి శనివారం జరిగిన విద్యాశాఖ ఉన్నత స్థాయి సమావేశం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వచ్చే వారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి మే నెల రెండు లేదా మూడో వారంలో ఆమోదం లభిస్తే వచ్చే జూన్ నుంచే సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించారు. ఇటీవల పదో తర గతి పాఠ్య పుస్తకాలను మార్చిన విద్యాశాఖ.. బట్టీ విధానానికి స్వస్తి పలికి విద్యార్థి స్వతహాగా ఆలోచించటం, తెలుసుకొని నేర్చుకునే విధానాన్ని తెచ్చింది. అందుకు అనుగుణంగా పరీక్ష విధానంలోనూ సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది.
నూతన పరీక్ష విధానం, పాఠ్య పుస్తకాల్లో మార్పులపై త్వరలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనుంది. వచ్చే జూన్‌లో స్కూళ్లు తెరిచిన వెంటనే 9, 10వ తరగతుల్లో కొత్త విధానంలో బోధన, అభ్యసనను అమలు చేయనున్నట్లు ప్రాథమిక విద్యాముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. సచివాలయంలో పూనం మాలకొండయ్య అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాఠశాల విద్య కమిషనర్ జగదీశ్వర్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డెరైక్టర్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంస్కర ణలపై ఇప్పటికే పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడిన అధికారులు శనివారం మరోసారి చర్చించి సంస్కరణల అమలుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇంటర్నల్స్‌లో పరిగణనలోకి తీసుకొనే 20 మార్కుల్లో మాట్లాడటం, ప్రతిస్పందనలకు 5 మార్కులు ఇవ్వాలని భావిస్తున్నారు.
మొదట 7 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని యోచించినా సంఘాలు, అధికారుల అభిప్రాయాల మేరకు 9 పేపర్ల వైపు మొగ్గు చూపారు.
భాషా సబ్జెక్టుల్లో(ప్రథమభాష, ద్వితీయ భాష, తృతీయ భాష) ఒక్కో పేపరుగా, భాషేతర సబ్జెక్టుల్లో (గణితం, సైన్స్, సోషల్) రెండేసి పేపర్ల చొప్పున అమల్లోకి రానున్నాయి.
రెండేసి పేపర్లు ఉండే సబ్జెక్టుల పరీక్షల్లో ఒక్కో పేపరుకు 40 మార్కుల చొప్పున ఉంటాయి. ఇంటర్నల్స్‌కు కూడా 10 మార్కుల చొప్పున రెండింటికి 20 మార్కులు కేటాయిస్తారు. వీటికి అనుగుణంగా గ్రేడింగ్ విధానం మారనుంది.
టెన్త్ ఫలితాల వెల్లడి తేదీపై త్వరలో నిర్ణయం
పదో తరగతి పరీక్షల ఫలితాల వెల్లడి తేదీని ఖరారు చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సెకండరీ విద్యా ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ శనివారం తెలిపారు. అయితే ఫలితాలను ఈ నెల 20 తరువాత వెల్లడించేందుకు ఆలోచన చేస్తున్నట్టు ఆయన వివరించారు.