అధికార యంత్రాంగం చేసిన పటిష్టమైన ఏర్పాట్ల వల్ల జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు సజావుగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Published Thu, Mar 13 2014 12:19 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :అధికార యంత్రాంగం చేసిన పటిష్టమైన ఏర్పాట్ల వల్ల జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు సజావుగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా ఒక్క పరీక్ష కేంద్రంలోనూ మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదు. బుధవారం ప్రథమ సంవత్సర పేపర్-1 పరీక్షకు దరఖాస్తు చేసిన 49,777 మందిలో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 130 కేంద్రాల్లో 46,907 మంది హాజరయ్యారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు జారీ చేసిన ప్రకటనల నేపథ్యంలో ఉదయం 7.00 గంటల నుంచే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభించారు. ఉదయం 8.30 గంటలకు కేంద్రాల్లోనికి అనుమతించారు.
9.00 గంటల తరువాత వచ్చే విద్యార్థులను అనుమతించబోమని ముందుగా ప్రకటించిన అధికారులు తొలిరాజు అదనంగా ఐదు నిమిషాల సమయం కేటాయించారు. మిగతా రోజుల్లో ఉదయం 9.00 గంటల తరువాత ఎట్టిపరిస్థితుల్లో గేట్లు మూసి వేయిస్తామని ఆర్‌ఐవో ఎం. రూఫస్‌కుమార్ చెప్పారు. దూర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులు ప్రధానంగా ఆర్టీసీ బస్సులపై ఆధారపడగా, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు విద్యార్థులతో కిటకిటలాడాయి. వివిధ ఇంజినీరింగ్, పార్మశీ కళాశాలల నిర్వాహకులు విద్యార్థులను తమ విద్యాసంస్థల బస్సుల్లో పరీక్ష కేంద్రాలకు చేర్చారు. కేంద్రాల వద్ద పోలీసు యంత్రాంగం 144 సెక్షన్ అమలు పరిచింది. పరీక్ష ప్రారంభమైన తరువాత విద్యార్థుల తల్లిదండ్రులను, వెంట వచ్చిన వారిని అక్కడి నుంచి పంపివేశారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను ముందుగానే మూసి వేయించారు.
డిగ్రీ పరీక్షలతో తికమక..
జిల్లాలో వారం రోజులుగా ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. పలు కళాశాలలు ఇంటర్, డిగ్రీ కోర్సులు రెండింటినీ నిర్వహిస్తున్నాయి. ఆయా పరీక్ష కేంద్రాల బయట ఇంటర్, డిగ్రీ కేంద్రాలను వేర్వేరుగా సూచించే బోర్డులు లేక విద్యార్థులు తికమకపడ్డారు. గుంటూరులోని ఏసీ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పరీక్ష కేంద్రాలను పక్కపక్క భవనాల్లోనే ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల కోడ్‌లు కనిపించక ఇంటర్ విద్యార్థులు డిగ్రీ పరీక్షా కేంద్రంలోకి, డిగ్రీ విద్యార్థులు ఇంటర్ పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు.
విస్తృత తనిఖీ..
జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇంటర్ బోర్డు ఆర్జేడీ డీఆర్‌కే పరమహంస పిట్టలవానిపాలెంలో రెండు, పొన్నూరులో ఒకటి, చేబ్రోలులో ఒక పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఆర్‌ఐవో ఎం. రూఫస్‌కుమార్ గుంటూరు ప్రభుత్వ వృత్తి విద్యా బాలికల జూనియర్ కళాశాల తదితరాలలో తనిఖీ చేశారు. మూడు అత్యున్నత స్థాయి కమిటీ సభ్యుల బృందాలు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యుల బృందాలు 5, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 7, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 5 పరీక్ష కేంద్రాలను తనఖీ చేశాయి.
Advertisement
Advertisement