ఇంటర్ పరీక్షలకు అంతా రెడీ
Published Tue, Mar 11 2014 2:14 AM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంట ర్మీడియెట్ పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగే పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరు. ఉదయం 8.30 నుంచి 8.45 వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 8.45 నుంచి 9 గంటల మధ్య వచ్చినవారిని వివరణ తీసుకుని అనుమతిస్తారు. జిల్లాలో 58,160 మంది పరీక్షలకు హాజరుకానుండగా వీరికోసం 93 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్టియర్ పరీక్షలకు 27,863 (వొకేషనల్ విద్యార్థులు 1,396 మందితో కలిపి) మంది, సెకండియర్ పరీక్షలకు 30,297 (వొకేషనల్ విద్యార్థులు 2,651 మందితో కలిపి) మంది హాజరుకానున్నారు. 93 కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతోపాటు 37 మంది కస్టోడియన్లను నియమించారు. ప్రశ్నపత్రాలను 37 పోలీస్ స్టేషన్ల లో భద్రపరచగా ఇతర సామగ్రిని పరీక్ష కేంద్రాలకు చేరవేశారు.
అక్రమాల అడ్డుకట్టకు ఏర్పాట్లు
పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిరోధించేందుకు హైపవర్ కమిటీతోపాటు నాలుగు ఫ్లయింగ్, ఐదు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. దీంతోపాటు ఆర్‌ఐవో, డీఈసీ సభ్యులు తనిఖీలు నిర్వహించనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించటంతోపాటు జీపీఎస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. జీపీఎస్ వల్ల సెల్‌ఫోన్లు పనిచేయవు. కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారుల సెల్‌ఫోన్లను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. వీరు కూడా స్మార్ట్ ఫోన్లు కాకుండా సాధారణ ఫోన్లే తేవాలి. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో వెళ్లిరావటానికి వీలుగా 12 రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది.
ఆర్‌ఐవో సమీక్ష
పరీక్షల ఏర్పాట్లపై ఆర్‌ఐవో ఎ.అన్నమ్మ సోమవారం ఉదయం డీఈసీ సభ్యులు గురుగుబెల్లి అప్పలనాయుడు, బి.యజ్ఞభూషణ రావు, ఆర్.భూషణరావు, బల్క్ ఇన్‌చార్జి ఎం.ప్రకాశరావు, బి.ప్రసాదరావులతో సమీక్ష నిర్వహించారు. అక్రమాలకు తావులేకుండా అప్రమత్తంగా వ్య వహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వివరించారు.
Advertisement