ఇక ప్రాదేశిక పోరు
ఇక ప్రాదేశిక పోరు
Published Mon, Mar 17 2014 2:33 AM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: కీలకమైన మరో ఎన్నికల ఘట్టానికి రంగం సిద్ధమైంది. మూడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ప్రాదేశిక ఎన్నికల యుద్ధం సోమవారం నుంచి మొదలుకానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ సౌరభ్‌గౌర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం చివరి దశకు చేరుకోవడంతో రాజకీయ పార్టీలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి. జిల్లాలో 38 జెడ్పీటీసీలు, 675 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి, 21న వాటిని పరిశీలిస్తారు. 22వ తేదీ సాయంత్రం వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిపై విచారణ జరిపి 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు నిర్ణయం ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ సాయంత్రం వరకు అవకాశం ఉంది. ఆరోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అవసరమైన చోట్ల 7వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తారు. 8వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితాలు ప్రకటిస్తారు.జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లాపరిషత్ కార్యాలయంలోనూ, ఎంపీటీసీ అభ్యర్థులు స్థానిక ఎంపీడీవో కార్యాలయాల్లోనూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే అనూహ్యంగా వచ్చిపడిన ఈ ఎన్నికలతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అభ్యర్థుల వెతుకలాట లో పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెట్టుకోలేని ఈ రెండు పార్టీలు ప్రాదేశిక ఎన్నికల్లోనైనా అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపి పరువు దక్కించుకోవాలని చూస్తున్నాయి. అయితే స్థానిక నాయకులు మాత్రం అంతగా ఆసక్తి కనబరచడం లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వైఎస్‌ఆర్‌సీపీలోకి ఆ పార్టీ నాయకులు వరదలా వలస వస్తుండటంతో ఇప్పటికే జిల్లాలో దాదాపు ఖాళీ అయిన కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థులే లభించడం లేదు. ఉన్న చోటామోటా నాయకులనే పోటీ చేయమని బతిమాలుకోవలసి వస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ వార్డులకు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థులు లేని విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వందల సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేయడం పెద్ద సమస్యగా మారింది.
రెండు పంచాయతీల్లో
ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం మండలంలోని చాపురం, కిల్లిపాలెం పంచాయతీల్లోనూ ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మండలంలోని పెద్దపాడు, చాపురం, పాత్రునివలస, కిల్లిపాలెం, ఖాజీపేటలను 2009లో ప్రభుత్వం శ్రీకాకుళం మున్సిపాలిటీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే పెద్దపాడు మినహా మిగిలిన నాలుగు పంచాయతీలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించి స్టే పొందాయి. కాగా గత ఏడాది పంచాయతీ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలో విలీనం కానుందున పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పాత్రునివలస, ఖాజీపేట మళ్లీ కోర్టును ఆశ్రయించాయి. కోర్టు అనుమతించడంతో ఆ రెండు చోట్ల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. చాపురం, కిల్లిపాలెం పంచాయితీలకు మాత్రం ఎన్నికలు జరగలేదు. పంచాయతీ ఎన్నికలు జరగనందున ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగవేమోనన్న అనుమానం ఉండేది. అయితే మండలంలోని మొత్తం 27 పంచాయతీల్లోని 25 ఎంపీటీసీలకూ ఎన్నికలు నిర్వహించనున్నట్లు శనివారం రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో అధికారులు ప్రకటించడంతో సందిగ్ధతకు తెర పడింది. అయితే పంచాయతీ ఎన్నికలు జరగకుండా ఎంపీటీసీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు.
డీసీసీకి ఎట్టకేలకు కార్యవర్గం
అభ్యర్థుల ఎంపికలో ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల వేళ జిల్లా పార్టీ(డీసీసీ) కార్యవర్గాన్ని ప్రకటించింది. ముఖ్య నాయకులందరూ పార్టీని వీడి పోవడంతో చోటా నేతలే కార్యవర్గంలో చోటు చేసుకున్నారు. త్వరలో మండల కార్యవర్గాలను ప్రకటిస్తామని డీసీసీ అధ్యక్షుడు డోల జగన్ చెప్పారు.
ఎన్నికల స్వరూపం, షెడ్యూల్
ఎన్నికలు జరిగే జెడ్పీటీసీలు 38
మొత్తం ఎంపీటీసీలు 675
నామినేషన్ల స్వీకరణ గడువు 20
పరిశీలన 21
అభ్యంతరాల స్వీకరణ 22
ఉపసంహరణ గడువు 24
పోలింగ్ నిర్వహణ ఏప్రిల్ 6
లెక్కింపు, ఫలితాలు 8
Advertisement
Advertisement