స్థానిక పోరుషురూ | ZPCT,MPTC, Nominations | Sakshi
Sakshi News home page

స్థానిక పోరుషురూ

Published Mon, Mar 17 2014 1:17 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM

స్థానిక పోరుషురూ - Sakshi

స్థానిక పోరుషురూ

  • జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు నేటి నుంచి నామినేషన్లు
  •   జెడ్పీటీసీలకు మచిలీపట్నంలో..
  •   ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో..
  •   20వ వరకు స్వీకరణ.. 21న పరిశీలన
  •   ఏప్రిల్ 6న పోలింగ్
  •   వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక
  •   అయోమయంలో కాంగ్రెస్, టీడీపీ
  • వరుస ఎన్నికల పోరులో మరో అంకం ప్రారంభం కానుంది. గ్రామాల్లో స్థానిక సంస్థల సమరం సోమవారం మొదలవనుంది. మున్సిపల్ నామినేషన్ల ఘట్టం పూర్తవగా, నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి చేపట్టనున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిని ముందే ప్రకటించిన వైఎస్సార్‌సీపీ ఈ పోరులో ముందువరుసలో నిలిచింది.
     
    సాక్షి, మచిలీపట్నం :  మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. ఇప్పటికే జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సంగ్రామానికి నామినేషన్‌ల ఘట్టం ముగిసింది. దాని వెనుకనే స్థానిక సంస్థల ఎన్నికలు షురూ అయ్యాయి. జిల్లాలో ఈ నెల 17 నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్‌ల స్వీకరణ మొదలు కానుంది. జెడ్పీటీసీ నామినేషన్‌లను జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వీకరించనున్నారు.

    జెడ్పీ ఎన్నికల అధికారిగా జిల్లా పరిషత్ సీఈవో డి.సుదర్శనం వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పక్షాలతో జెడ్పీ సీఈవో సుదర్శనం ఆదివారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ నామినేషన్‌లు ఆయా మండలాల పరిధిలోని మండల పరిషత్ కార్యాలయాల్లో వేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీల నామినేషన్ ప్రక్రియను ఆయా మండలాలకు నియమించిన రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు.

    ఈ నెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజులపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌లు స్వీకరిస్తారు. 21న నామినేషన్‌ల పరిశీలన జరుగుతుంది. 22న నామినేషన్‌లకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరిస్తారు. 24న నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. ఏప్రిల్ ఆరున పోలింగ్ నిర్వహిస్తారు. ముందు ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు పూర్తిచేసే అవకాశం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఫలితాలు ప్రకటించిన తరువాత జెడ్పీ చైర్మన్, ఆయా మండలాల్లోని ఎంపీపీల ఎన్నికకు మళ్లీ షెడ్యూల్ ప్రకటించి వాటి ఎంపిక కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు.

    బ్యాలెట్ బాక్సులతో పోలింగ్...

    ఒకేసారి వరుస ఎన్నికలు రావడంతో ఈవీఎంల కొరత నెలకొంది. దీంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు బ్యాలెట్ బ్యాక్సులను ఉపయోగించనున్నారు. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలకు మాత్రం ఈవీఎంలను ఉపయోగించనున్నట్టు అధికారులు ఇటీవల ప్రకటించారు.
     
    రిజర్వేషన్లు ఇలా..    

    జిల్లాలోని 49 మండలాల్లో 836 మండల ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), 49 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జెడ్పీటీసీ) ఉన్నాయి. వాటికి ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించారు. 836 ఎంపీటీసీ స్థానాల్లో 428 మహిళలకు, 408 పురుషులకు.. 49 జెడ్పీటీసీల్లో 25 మహిళలకు, 24 పురుషులకు కేటాయించారు. జెడ్పీటీసీల్లో ఎస్టీలకు 2, ఎస్సీలకు 12, బీసీలకు 13, జనరల్‌కు 22 చొప్పున కేటాయించారు. ఎంపీటీసీల్లో ఎస్టీలకు 24, ఎస్సీలకు 201, బీసీలకు 229, జనరల్‌కు 382 చొప్పున రిజర్వేషన్‌లను ఖరారు చేశారు.
     
    వైఎస్సార్‌సీపీ ముందడుగు..    
     
    మున్సిపల్ ఎన్నికల్లో ఆయా నామినేషన్‌ల ప్రక్రియలో ముందు వరుసలో ఉన్న వైఎస్సార్‌సీపీ తాజాగా జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిని ప్రకటించడంలోనూ ముందుంది. ఈసారి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. సోమవారం నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ముందుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా తాతినేని పద్మావతిని ప్రకటించడం విశేషం.

    పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన తాతినేని పద్మావతి వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, బందరు, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయకర్తలు కేవీఆర్ విద్యాసాగర్, కోనేరు ప్రసాద్‌లు విజయవాడలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తాతినేని పద్మావతి పేరును జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థినిగా ప్రకటించారు.

    ఇప్పటికే జిల్లాలో పట్టు కోల్పోయిన కాంగ్రెస్, ఉనికి కోసం పాట్లు పడుతున్న తెలుగుదేశం పార్టీలు జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిని కోసం వెదుకులాట ప్రారంభించాయి. నామినేషన్‌ల ప్రక్రియ మొదలు కానున్న తరుణంలోనూ వారు అభ్యర్థి కోసం మల్లగుల్లాలు పడుతుండటం కొసమెరుపు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement