- ఒకవేళ కుదరకుంటే 9 నుంచి నిర్వహణకు బోర్డు కసరత్తు
- రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
- ఏపీ కంటే ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 2 నుంచి ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు కసరత్తు చేస్తోంది. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల తేదీలు, సెలవులను పరిగణనలోకి తీసుకొని ఒకవేళ 2 నుంచి నిర్వహణ సాధ్యం కాకుంటే అదే నెల 9వ తేదీ నుంచి నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
తొలుత మార్చి 11 నుంచి పరీక్షలు నిర్వహిం చాలని ఉన్నతాధికారులు భావించినా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలను అదే తేదీ నుంచి నిర్వహించేందుకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు ఇప్పటికే షెడ్యూలు/టైంటేబుల్ జారీ చేయడంతో అంతకంటే ముందుగానే పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ మొదటి వారంలో (4వ తేదీన నిర్వహించే అవకాశం) ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ రాత పరీక్షను నిర్వహించే అవకాశం ఉండటం, అదే నెల నుంచి జూన్ వరకు వివిధ జాతీయస్థాయి పోటీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో మార్చిలోనే ఇంటర్ పరీక్షలను పూర్తి చేయాలని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేం దుకు సులభంగా ఉంటుందని, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడవచ్చని పేర్కొంటున్నాయి.
ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రాక్టికల్స్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ వంటి పరీక్షలను ఫిబ్రవరిలోనే బోర్డు నిర్వహించనుంది. మరోవైపు మార్చి మూడో వారంలో పదో తరగతి పరీక్షలను (మార్చి 16 లేదా 18వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే ఇంటర్ పరీక్షలను పూర్తి చేసేలా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. గత విద్యా సంవత్సరం ఇంటర్ పరీక్షలను 2015 మార్చి 9 నుంచి బోర్డు నిర్వహించింది. ప్రథమ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 22న, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 27న ప్రకటించింది.
మార్చి 2 నుంచి ఇంటర్ పరీక్షలు?
Published Mon, Nov 16 2015 2:36 AM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM
Advertisement